Share News

కమిటీ నుంచే ‘నీట్‌’గా లీకేజీ!

ABN , Publish Date - May 17 , 2026 | 04:54 AM

నీట్‌ పరీక్ష ప్రశ్నపత్రం దానిని రూపొందించిన కమిటీలోని సభ్యుల నుంచే నీట్‌గా లీకైన వైనం వెలుగులోకి వస్తోంది. లీకేజీ సూత్రధారి నీట్‌ కమిటీలో....

కమిటీ నుంచే ‘నీట్‌’గా లీకేజీ!

  • నీట్‌ ప్రశ్నపత్రం రూపకల్పన కమిటీలోని నిపుణులే సూత్రధారులు

  • ఇప్పటికే కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ కులకర్ణి అరెస్టు

  • తాజాగా పుణెలో జీవశాస్త్ర నిపుణురాలు మనీషా మంధారే అదుపులోకి..

న్యూఢిల్లీ, మే 16: నీట్‌ పరీక్ష ప్రశ్నపత్రం దానిని రూపొందించిన కమిటీలోని సభ్యుల నుంచే నీట్‌గా లీకైన వైనం వెలుగులోకి వస్తోంది. లీకేజీ సూత్రధారి నీట్‌ కమిటీలో రసాయనశాస్త్ర నిపుణుడిగా ఉన్న పీవీ కులకర్ణిని సీబీఐ అధికారులు శుక్రవారమే అరెస్టు చేయగా.. జీవశాస్త్ర నిపుణురాలు మనీషా మంధారేను శనివారం ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. దీనితో నీట్‌ కేసులో అరెస్టుల సంఖ్య ఎనిమిదికి చేరింది. పీవీ కులకర్ణి విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నీట్‌ ప్రశ్నపత్రం రూపకల్పన కమిటీలో సభ్యులుగా ఉన్న నిపుణులకు సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలన్నీ తెలిసి ఉంటాయి. ప్రశ్నపత్రంలోని మొత్తం అన్ని సబ్జెక్టుల ప్రశ్నలు తెలిసే అవకాశం తక్కువ. ఈ క్రమంలోనే కీలక సూత్రధారి పీవీ కులకర్ణి ఇతర సబ్జెక్టు నిపుణులతో కలిసి లీకేజీకి పాల్పడినట్టుగా సీబీఐ అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన పీవీ కులకర్ణికి రసాయనశాస్త్ర ప్రశ్నలు తెలిసి ఉండగా, మనీషా మంధారే వద్ద వృక్ష, జంతుశాస్త్రాలకు సంబంధించిన ప్రశ్నలున్నాయి. కులకర్ణి తరహాలోనే మనీషా మంధారే కూడా పుణెకు చెందిన మనీషా వాఘ్మరే సాయంతో విదార్థులను సమీకరించి, లక్షలకొద్దీ సొమ్ము తీసుకున్నారని సీబీఐ అధికారులు గుర్తించారు. ఆ విద్యార్థులకు పుణెలోని తన ఇంట్లోనే ప్రత్యేకంగా కోచింగ్‌ క్లాసులు నిర్వహించి నీట్‌ ప్రశ్నలకు సమాధానాలు ప్రాక్టీసు చేయించారని తేల్చారు. ఆ కోచింగ్‌ తీసుకున్న అభ్యర్థుల నోట్‌ పుస్తకాల్లో రాసుకున్న ప్రశ్నలు.. నీట్‌ పేపర్‌లోని ప్రశ్నలతో సరిపోలాయని అధికారులు వెల్లడించారు. కాగా, మొత్తంగా నీట్‌ను రద్దు చేయాలని.. రాష్ట్రాలే ప్రవేశపరీక్షలు నిర్వహించుకుని వైద్య విద్య సీట్లు భర్తీ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కర్ణాటక డిమాండ్‌ చేసింది.


‘పరీక్షా లీక్స్‌పే చర్చా’ పెట్టాలి:ఖర్గే

ప్రధాని మోదీ ఏటా ‘పరీక్షాపే చర్చా’ పేరిట ప్రచార ఆర్భాటం చేస్తారని.. కానీ ఆయన చేపట్టాల్సింది ‘పరీక్షా లీక్స్‌ పే చర్చా’ కార్యక్రమమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం చెబుతున్న అమృత కాలం.. విద్యార్థులకు మృతకాలంగా మారిపోయిందని విమర్శించారు. నీట్‌ లీకేజీ, పేపర్‌ రద్దు కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. నీట్‌లో అక్రమాలపై కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం ఢిల్లీలోని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కేంద్ర విద్యా మంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు. కాగా, నీట్‌ లీకేజీ, అక్రమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్‌టీఏలో కొత్తగా నలుగురు అధికారులను నియమించింది. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ అధికారి అనూజ బాపట్‌, ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ అధికారి రుచిత విజ్‌ ఇద్దరూ జాయింట్‌ సెక్రెటరీ హోదాలో.. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ అధికారి ఆకాశ్‌ జైన్‌, ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ సర్వీస్‌ అధికారి ఆదిత్య రాజేంద్ర జాయింట్‌ డైరెక్టర్లుగా నియామకం అయ్యారు. వారు ఎన్‌టీఏలో వ్యవహారాలను పర్యవేక్షించడం, సమస్యలను సరిదిద్దడంపై దృష్టిపెడతారని ప్రభుత్వం పేర్కొంది.

కేంద్ర విద్యా మంత్రిని వెంటనే తొలగించాలి: రాహుల్‌

నీట్‌ లీకేజీ, అక్రమాల వ్యవహారంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీని డిమాండ్‌ చేశారు. లేకపోతే విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాని మోదీ స్వయంగా బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో వీడియోను పోస్టు చేశారు. ‘‘నీట్‌కు రెండు రోజుల ముందే వాట్సాప్‍లో ప్రశ్నపత్రం పంపిణీ అవుతోందని దేశమంతటికీ తెలుసు. విద్యా మంత్రి మాత్రం దీనితో తనకు సంబంధం లేదంటున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తమవారిని వర్సిటీల్లో వీసీలుగా, ప్రొఫెసర్లుగా నియమించుకుని, డబ్బులు సంపాదించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ వ్యవస్థలు విద్యా వ్యవస్థను నాశనం చేశాయి’’ అని రాహుల్‌ అన్నారు.

Updated Date - May 17 , 2026 | 04:54 AM