Share News

నా స్థలం ఆక్రమించారు.. న్యాయం చేయండి

ABN , Publish Date - Sep 14 , 2026 | 03:34 AM

ముంబైలోని తూర్పు భయందర్‌ ప్రాంతంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని ఆయన చిన్ననాటి స్కూల్‌మేట్‌ అస్గర్‌ అలీ వోహ్రా(81) కోరారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

నా స్థలం ఆక్రమించారు..  న్యాయం చేయండి
modi with his friend

ప్రధాని మోదీకి చిన్ననాటి స్కూల్‌మేట్‌ వినతి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: ముంబైలోని తూర్పు భయందర్‌ ప్రాంతంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని ఆయన చిన్ననాటి స్కూల్‌మేట్‌ అస్గర్‌ అలీ వోహ్రా(81) కోరారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌లోని వడ్నగర్‌లో ఉన్న బీఎన్‌ స్కూల్‌లో వోహ్రా, మోదీ ఒకే సమయంలో విద్యను అభ్యసించారు. ఈ నెల 8న ఆయన ప్రధానితో భేటీ అయి తన సమస్యను విన్నవించుకున్నారు. 1989లో ఈస్ట్‌ భయందర్‌లోని నవఘర్‌లో తాను 2,810 చదరపు గజాల భూమిని కొనుగోలు చేసినట్లు వోహ్రా తెలిపారు. ఆ స్థలానికి నకిలీ దస్తావేజులు సృష్టించిన స్వయం బిల్డర్డ్‌, సెవెన్‌ ఎలెవన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థలు 2011లో దాన్ని చెరి సగం చొప్పున ఆక్రమించుకున్నాయని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మోహతాకు సెవెన్‌ ఎలెవన్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు మధ్య సంబంధం ఉందని వోహ్రా పేర్కొన్నారు. ఈ వివాదంపై 2015లో పోలీసులు కేసు నమోదు చేశారని, అయినప్పటికీ న్యాయం కోసం ఏళ్ల తరబడి రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు, పోలీసుల చుట్టూ తిరుగుతునే ఉన్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానితో వోహ్రా భేటీ నేపథ్యంలో స్థానిక అధికారులు ఈ వ్యవహారంపై తాజాగా దృష్టి సారించారు. ఈ నెల 16న జరగనున్న కోర్టు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని రెండు బిల్డర్స్‌ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు.

Updated Date - Sep 14 , 2026 | 03:36 AM