డీఎంకే పాలన అవినీతిమయం
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:19 AM
తమిళనాడులో డీఎంకే పాలన అవినీతిమయం అయిపోయిందని, రాష్ట్రంలో మాదకద్రవ్యాల మాఫియా చెలరేగిపోతోందని ప్రధాని మోదీ ఆరోపించారు.
అక్రమాల్లో మంత్రుల మధ్య పోటీ
అన్ని రంగాల్లోనూ రూ.వేల కోట్ల దోపిడీ
మేమొస్తే స్వచ్ఛమైన పాలన అందిస్తాం
తమిళనాడులోని మదురై సభలో మోదీ
చెన్నై, మార్చి 1(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో డీఎంకే పాలన అవినీతిమయం అయిపోయిందని, రాష్ట్రంలో మాదకద్రవ్యాల మాఫియా చెలరేగిపోతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆదివారం ఆయన తమిళనాడు, పుదుచ్చేరిలలో పర్యటించారు. ఆదివారం సాయంత్రం మదురైలో జరిగిన ఎన్డీయే బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఎక్కడైనా పారదర్శక పాలన అందించేందుకు మంత్రుల మధ్య పోటీ ఉంటుందని, కానీ డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులు మాత్రం అవినీతిలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగుల బదిలీల్లో రూ.365 కోట్లు, ఉద్యోగ అవకాశాల పేరుతో రూ.900కోట్లు, కాంట్రాక్టర్ల పేరుతో రూ.1000 కోట్లు, ఇసుక కుంభకోణంలో రూ.4700 కోట్లు, టాస్మాక్ స్కామ్‌లో రూ.40 వేల కోట్లు.. ఇలా ప్రతి విషయంలోనూ డీఎంకే భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు స్వచ్ఛమైన, పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో జరుగనున్న శాసనసభ ఎన్నికలు రాష్ట్రానికి టర్నింగ్ పాయింట్ వంటివని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని ప్రధాని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌కు స్పీడ్ బ్రేకర్!
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పుదుచ్చేరి.. ఢిల్లీలోని ఓ కుటుంబానికి ఏటీఎంలా ఉండేదని మోదీ ఆరోపించారు. పుదుచ్చేరిలో ఆదివారం ఉదయం పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. పుదుచ్చేరి అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్‌బ్రేకర్‌లా వ్యవహరించిందని విమర్శించారు. ఆ పార్టీ పాలన అవినీతి, నేరాలమయంగా మారిందని, పేదలకు కష్టాలను మిగిల్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి సీఎం ఎన్. రంగస్వామి మాట్లాడుతూ.. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తిరుప్పరంగుండ్రంలో ప్రధాని పూజలు
మదురై జిల్లా తిరుప్పరంగుండ్రంలోని అరుళ్‌మిగు సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. 15 నిముషాల పాటు ప్రధాని ఆలయంలో గడిపారు. అర్చకులు స్వామివారి జ్ఞాపికను, ప్రసాదాలను అందించారు. ప్రధాని వెంట తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి, కేంద్రమంత్రి ఎల్. మురుగన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఉన్నారు. ఇటీవల తమిళనాట తీవ్ర వివాదం రేపిన ఆలయానికి ప్రధాని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.