Share News

గత ప్రభుత్వాల కారణంగా భారత్ 6వ స్థానం నుంచి 11కు పడిపోయింది: మోదీ

ABN , Publish Date - Feb 05 , 2026 | 05:26 PM

విపక్షాల నిరసన నడుమ ప్రధాని మోదీ రాజ్య సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వాల కారణంగా దేశం 6వ స్థానం నుంచి 2014 నాటికి 11వ స్థానానికి పడిపోయిందని అన్నారు.

గత ప్రభుత్వాల కారణంగా భారత్ 6వ స్థానం నుంచి 11కు పడిపోయింది: మోదీ
Modi Rajya Sabha speech

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. విపక్ష నేతల నిరసనలు, నినాదాల నడుమ ప్రధాని ప్రసంగించారు. ఆ తరువాత కొద్ది సేపటికే విపక్షాలు వాకౌట్ చేశాయి. అయితే, ప్రధాని మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు (PM Modi Rajyasabha Speech).

వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశం ప్రస్తుతం దూసుకెళుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం అన్ని జీవిత పార్శ్వాల్లో, వర్గాల్లో మార్పులు కనిపిస్తున్నాయని అన్నారు. సరైన దిశలో దేశం ముందుకు సాగుతోందని అన్నారు. స్వాతంత్ర్యం తొలి నాళ్లల్లో భారత్ ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని అన్నారు. కానీ, మునుపటి ప్రభుత్వాల విధానాల కారణంగా 2014 నాటికి 11వ స్థానికి పడిపోయిందని అన్నారు.


పలుదేశాలతో ట్రేడ్ డీల్స్..

ప్రపంచంలో భారత్‌ పరపతి పెరుగుతోందని అన్నారు. ఈయూ సహా 27 దేశాలతో భారత్‌ అనేక ఒప్పందాలు చేసుకుందని గుర్తు చేశారు. 9 దేశాలతో ట్రేడ్‌ డీల్‌ చేసుకుంటున్నామని చెప్పారు. రీఫార్మ్‌.. పెర్ఫార్మ్‌.. ట్రాన్స్‌ఫార్మ్‌ దిశగా భారత్‌ సాగుతోందని అన్నారు. ఉత్పత్తి రంగంలో అనేక విజయాలు సాధించామని చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌ వేగంతో సంస్కరణలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. భారత్‌లో ప్రతిభావంతమైన యువతకు కొరత లేదని వ్యాఖ్యానించారు. రానున్న 25 ఏళ్లు భారత్‌కు అత్యంక కీలకమని వ్యాఖ్యానించారు. దేశ ప్రగతి సాధనలో వెనకడుగు వేసేది లేదని కూడా తేల్చి చెప్పారు.


ప్రపంచానికి ఆశాకిరణం..

ఒకప్పుడు భారత్ బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండేదని అన్నారు. ప్రస్తుతం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోందని చెప్పారు. ప్రపంచ సవాళ్లకు భారత్ పరిష్కారాలు చూపించే స్థితిలో నిలిచి ఒక ఆశాకిరణంగా మారిందని అన్నారు. అధిక వృద్ధి రేటు, తక్కువ ద్రవ్యోల్బణం కలగలిసిన అరుదైన స్థితిలో భారత్ ఉందని అన్నారు. మునుపటి ప్రభుత్వాల తప్పులను సరిచేసేందుకే అధిక శాతం తమ శక్తియుక్తులను వినియోగించాల్సి వస్తోందని అన్నారు. గత ప్రభుత్వాల కారణంగా మూటగట్టుకున్న ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించుకుంటున్నామని అన్నారు. ఈ నష్టాన్ని సరిచేసేలా భవిష్యత్తుకు తగిన విధానాలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

గ్లోబల్ సౌత్‌కు గొంతుకగా..

గ్లోబల్ సౌత్‌గా పేరు పడ్డ దేశాల తరపున భారత్ అంతర్జాతీయ వేదికలపై బలంగా తన వాణిని వినిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచదేశాలకు విశ్వసనీయ భాగస్వామిగా భారత్ అవతరించిందని చెప్పారు. కాంగ్రెస్‌కు దార్శనికత లేదని విమర్శించారు. ఫలితంగా భారత్ చాలా కాలం పాటు కష్టాలు పడిందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా వ్యవస్థలు బలహీనపడతాయని అన్నారు. ప్రపంచంలో అగ్రగామి దేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం ఉత్సుకతతో ఉన్నాయని చెప్పారు. ఈయూ ట్రేడ్ డీల్‌తో ప్రపంచంలో స్థిరత్వంపై వివిధ దేశాలకు నమ్మకం పెరిగిందని అన్నారు. అమెరికాతో ఒప్పందంతో ఈ భావన మరింత బలపడిందని వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

క్షమాపణ చెబుతున్నా.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై బిల్ గేట్స్ స్పందన

ట్రేడ్ డీల్.. త్వరలో భారత్, యూఎస్ సంయుక్త ప్రకటన!

Updated Date - Feb 05 , 2026 | 06:45 PM