యుద్ధం సంగతి మోదీకి తెలీదు
ABN , Publish Date - Mar 05 , 2026 | 06:26 AM
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తాయన్న విషయం ప్రధాని నరేంద్ర మోదీకి ముందుగా తెలియదని భారత్‌లో ఇజ్రాయెల్ దౌత్యవేత్త రూవెన్ అజార్ వెల్లడించారు. ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీ...
భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన 2 రోజుల తర్వాతే నిర్ణయం
ఇజ్రాయెల్ దౌత్యవేత్త అజార్ వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 4: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తాయన్న విషయం ప్రధాని నరేంద్ర మోదీకి ముందుగా తెలియదని భారత్‌లో ఇజ్రాయెల్ దౌత్యవేత్త రూవెన్ అజార్ వెల్లడించారు. ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీ ఫిబ్రవరి 25, 26 తేదీల్లో పర్యటించే నాటికి అసలు ఈ విషయంపై ఎలాంటి చర్చాలేదన్నారు. ఆయన తిరిగి భారత్‌కు చేరుకున్న రెండు రోజుల తర్వాత ఫిబ్రవరి 28 ఉదయం ఇజ్రాయెల్ భద్రతపై జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇరాన్‌పై దాడి అనేది ‘కార్యాచరణ అవకాశం’గా రూవెన్ పేర్కొన్నారు. ‘‘వాస్తవానికి ప్రధాని మోదీ పర్యటనలో ప్రాంతీయ అభివృద్ధి సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించాం. కానీ, ఆయనతో ఈ విషయాన్ని(యుద్ధం) పంచుకోలేదు. ఎందుకంటే వాస్తవానికి అప్పటికి ఆ విషయం మాకు కూడా తెలీదు.’’ అని వ్యాఖ్యానించారు. మోదీ ఇజ్రాయెల్ నుంచి వచ్చేసిన తర్వాత తమకు ‘కార్యాచరణ అవకాశం’ చిక్కిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఇండియన్ ఎక్స్‌ప్రె్‌స’తో మాట్లాడారు. ఇరాన్‌లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు బలమైన ఇంటెలిజెన్స్‌ను వినియోగించినట్టు తెలిపారు. ‘‘ఇరాన్ సైనిక సామర్థ్యం, తదుపరి ఉద్దేశాలు, నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎవరి పాత్ర ఉంది?. ఎవరెవరు చర్చల్లో పాల్గొంటున్నారు. కచ్చితంగా ఎక్కడ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నాం.’’ అని వివరించారు. ‘‘ఇజ్రాయెల్‌కు ముప్పు ఉన్న కారణంగానే కొన్ని సంవత్సరాలుగా నిఘా కోసమే బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాం. ఈ క్రమంలో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను అధిగమించే సాంకేతికతను, సైన్యాన్ని అభివృద్ధి చేసుకున్నాం. కేవలం ఇరాన్ నుంచే కాకుండా.. ఆ దేశ ప్రోద్బలంతో ఇతర సంస్థలు చేసే దాడుల నుంచి కూడా రక్షించుకునేందుకు చర్యలు తీసుకున్నాం.’’ అని చెప్పారు.
ఇవీ చదవండి:
ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..