Share News

వచ్చేది బీజేపీ సర్కారే

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:15 AM

పశ్చిమ బెంగాల్‌లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరక్‌పూర్‌లో సోమవారం రెండో(తుది) విడత...

వచ్చేది బీజేపీ సర్కారే

ప్రమాణ స్వీకారానికి వస్తా.. టీఎంసీది సిండికేట్‌ రాజ్‌, రాజకీయ హింస: ప్రధాని మోదీ

బెంగాలీలకు ప్రధాని భావోద్వేగ లేఖ.. నిశ్చింతగా ఓటేయండి: అమిత్‌ షా

దక్షిణ కోల్‌కతాలో మమత రోడ్‌షో.. బెంగాల్‌లో ముగిసిన తుది విడత ప్రచారం

కోల్‌కతా/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: పశ్చిమ బెంగాల్‌లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరక్‌పూర్‌లో సోమవారం రెండో(తుది) విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. మే 4న పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడించాక బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వస్తానని అన్నారు. అధికార తృణమూల్‌ కాంగ్రె్‌సపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో సిండికేట్‌ రాజ్‌, రాజకీయ హింస, ఆర్థిక పతనానికి ఆ పార్టీ నాయకత్వం వహిస్తోందని ఆరోపించారు. ‘రాష్ట్రంలో ప్రజల మనోభావాలను చూశాక మే 4న బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి తాను రావడం ఖాయమని అర్థమైంది.’ అని ఆయన అనగానే ప్రజల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన వచ్చింది. అలాగే దక్షిణ బెంగాల్‌ జిల్లాల్లో కీలకంగా ఉన్న మతువా వర్గానికి చెందిన వారికి తప్పనిసరిగా పౌరసత్వం, ఇతర వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా తన ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా ప్రధాని పశ్చిమ బెంగాల్‌ ప్రజలను ఉద్దేశించి ‘ఎక్స్‌’లో భావోద్వేగ లేఖ రాశారు. వారి ప్రేమ, ఆశీర్వాదాలు తనలో నూతన శక్తిని నింపాయని పేర్కొన్నారు. వారందరు బెంగాల్‌ అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్నట్లు గుర్తించానని తెలిపారు. మార్పునకు ఇదే సమయమని, రావాల్సింది బీజేపీనేనని గుర్తుచేశారు. బెంగాల్‌ ఎదుర్కొనే ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాగా బెహాలలో సోమవారం రోడ్‌షో నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అనంతరం మాట్లాడుతూ... టీఎంసీ గూండాలకు భయపడకుండా ఈ నెల 29న నిశ్చింతగా ఓటేయండని ప్రజలకు పిలుపునిచ్చారు.


ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో విస్తృత భద్రత కల్పించిందని... అలాగే కేంద్ర బలగాలు ఎన్నికలు ముగిశాక మరో వారం రోజులపాటు రాష్ట్రంలోనే ఉంటాయని చెప్పారు. అనంతరం హూగ్లీ జిల్లాలోని చందన్‌నగర్‌లో భారీ సంఖ్యలో జనం పాల్గొన్న రోడ్‌షోలో అమిత్‌ షా పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే చొరబాటుదారుల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తామని హామీ ఇచ్చారు. కాగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతాలో సోమవారం మధ్యాహ్నం రోడ్‌షో నిర్వహించారు. ఆరు కిలోమీటర్లు సాగిన ఈ రోడ్‌షోలో టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాగరిక ఘోష్‌, టాలీగంజ్‌, రాష్‌బెహరి నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అరూప్‌ బిశ్వాస్‌, దేబశీష్‌ కుమార్‌ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్న ఈ రోడ్‌షో ఆరు కిలోమీటర్లు సాగి సాయంత్రం 5.30 గంటలకు ముగిసింది. దీంతో మమత తన తుది విడత ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. కాగా మమత భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఆమెను ఓడించిన సువేందు అధికారిని బీజేపీ ఈసారి భవానీపూర్‌లో పోటీకి దింపింది. పశ్చిమ బెంగాల్‌లో తుది(రెండో) విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. ఈ నెల 29న 142 నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తర కోల్‌కతా, దక్షిణ కోల్‌కతా, హౌరా, నాడియా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హూగ్లీ, పూర్వ బర్ధమాన్‌ జిల్లాలు ఇందులో ఉన్నాయి. దీంతో ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు ప్రచారం హోరెత్తించారు. కాగా పశ్చిమ బెంగాల్‌లో తుది విడత ప్రచారం ముగిసే సమయానికి అక్రమంగా తరలిస్తోన్న రూ. 510 కోట్లకు పైగా విలువైన మద్యం, నగదు, డ్రగ్స్‌, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తోన్న రూ.184.85 కోట్ల విలువైన వస్త్రాలు, గృహోపకరణాలు, సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్ర నెట్‌ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం

Updated Date - Apr 28 , 2026 | 07:15 AM