భాగస్వాములుగా ఉందాం!
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:13 AM
భారత్, చైనా భాగస్వాములుగా ఉండాలనే విషయంలో ప్రధాని మోదీ, జిన్‌పింగ్ కీలకమైన ఏకాభిప్రాయానికి వచ్చారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రకటించారు....
మోదీ, జిన్‌పింగ్ మధ్య కీలక ఏకాభిప్రాయం
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: భారత్, చైనా భాగస్వాములుగా ఉండాలనే విషయంలో ప్రధాని మోదీ, జిన్‌పింగ్ కీలకమైన ఏకాభిప్రాయానికి వచ్చారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రకటించారు. ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా వీరిద్దరూ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొని, సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల సారాంశాన్ని వాంగ్ యీ మీడియాకు వెల్లడించారు. ఇద్దరు నాయకుల మధ్య కుదిరిన ముఖ్యమైన ఉమ్మడి అవగాహన ఒప్పందాలను అమలు చేయడానికి ఢిల్లీతో బీజింగ్ కలిసి పనిచేస్తుందని తెలిపారు. భారత్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉందని, తన భూభాగంపై చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటాన్ని అనుమతించబోమని మోదీ స్పష్టం చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. భారత్, చైనా సంబంధాలకు సంబంధించిన వ్యూహాత్మక, దీర్ఘకాలిక, దిశా నిర్దేశక అంశాలపై ఇద్దరు నాయకులు సూటిగా, లోతైన అభిప్రాయాలను పంచుకున్నారని పేర్కొన్నారు. ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ, ఉమ్మడిగా అభివృద్ధిని సాధించాలని జిన్‌పింగ్ ఆకాంక్షించారని తెలిపారు. సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతలను సంయుక్తంగా కాపాడుకోవడానికి ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరిందని వాంగ్ యీ తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై పరస్పరం సహకరించుకోవాలని, ఐక్యరాజ్యసమితి, ఎస్‌సీవో, జీ20 వంటి వేదికల ద్వారా గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల కోసం పని చేయడానికి అంగీకారం కుదిరిందని తెలిపారు. భారత్- చైనా సంబంధాలు మెరుగుపడటాన్ని ఇరు దేశాల్లోని 280 కోట్ల మందికి పైగా ప్రజలు స్వాగతించారని ఆయన పేర్కొన్నారు. కాగా, 2027లో బ్రిక్ అధ్యక్ష పదవిని చైనా చేపట్టనుంది.