Share News

తమిళనాట 164 స్థానాల్లో డీఎంకే పోటీ

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:08 AM

తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే మిత్రపక్షాలకు సీట్లు కేటాయించిన అధికార డీఎంకే పార్టీ 164 స్థానాల్లో పోటీ చేయనుంది. ఆ పార్టీ అధ్యక్షుడు...

తమిళనాట 164 స్థానాల్లో డీఎంకే పోటీ

తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి, అభ్యర్థులను ప్రకటించిన సీఎం స్టాలిన్‌

చెన్నై, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే మిత్రపక్షాలకు సీట్లు కేటాయించిన అధికార డీఎంకే పార్టీ 164 స్థానాల్లో పోటీ చేయనుంది. ఆ పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. శనివారం సాయంత్రం ఆయన పార్టీ కార్యాలయంలో 164 మంది అభ్యర్థులతో జాబితాను వెల్లడించిన అనంతరం... నేరుగా స్థానిక మెరీనాలో ఉన్న తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి సమాధి వద్దకు వెళ్లి, నివాళులర్పించి.. అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఆయన వెంట పలువురు సీనియర్‌ నేతలు కూడా వున్నారు. ఇప్పటికే స్టాలిన్‌ 16 పార్టీలతో కూడిన తమ కూటమిలో సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. శనివారం ఆయా పార్టీలకు స్థానాలు కూడా ఖరారు చేశాక, తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇదిలా వుండగా గతంలో మూడుసార్లు విజయం సాధించిన కొళత్తూరు నియోజకవర్గం నుంచే స్టాలిన్‌ మళ్లీ పోటీ చేయనున్నారు. చెపాక్‌ నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి మళ్లీ బరిలోకి దిగనున్నారు. దివంగత సినీ నటుడు విజయకాంత్‌ సతీమణి ప్రేమలత నేతృత్వంలోని డీఎండీకేకు డీఎంకే కూటమిలో 10 స్థానాలు దక్కాయి. విరుదాచలం నియోజకవర్గం నుంచి ప్రేమలత, విరుదునగర్‌ నుంచి ఆమె కుమారుడు విజయ ప్రభాకర్‌ పోటీ చేయనున్నట్టు డీఎండీకే ప్రకటించింది. అదేవిధంగా ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ భర్త, సినీ దర్శకుడు సుందర్‌.సి ‘పుదియనీది కట్చి’ పార్టీ తరఫున మదురై సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పుదియనీది కట్చి అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో వున్న విషయం తెలిసిందే.

చెన్నైలో రూ.5 కోట్ల నగదు స్వాధీనం

చెన్నై మధురవాయల్‌లో వాహనంలో తరలిస్తున్న రూ.5 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం మధురవాయల్‌లో తనిఖీలు చేపట్టిన అధికారులు.. ఓ వాహనంలో తరలిస్తున్న రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఈ నగదు ప్రభుత్వ మద్యం దుకాణాలకు సంబంధించినదని, ఆ వాహన సిబ్బంది చెప్పారు.

ఇవీ చదవండి:

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Updated Date - Mar 29 , 2026 | 07:05 AM