నిలువునా చీలిన మైనారిటీ ఓట్లు
ABN , Publish Date - May 06 , 2026 | 06:45 AM
బీజేపీ భయంతో బెంగాల్లోని ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాల్లో వారి ఓట్లన్నీ తనకే పడతాయనుకున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అంచనాలు తలకిందులయ్యాయి. మైనారిటీ ఓట్లు...
టీఎంసీ ఓటుబ్యాంకును దెబ్బతీసిన కాంగ్రెస్, సీపీఎం, కబీర్
కోల్‌కతా, మే 5: బీజేపీ భయంతో బెంగాల్లోని ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాల్లో వారి ఓట్లన్నీ తనకే పడతాయనుకున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అంచనాలు తలకిందులయ్యాయి. మైనారిటీ ఓట్లు చీలిపోవడంతో బీజేపీ అనూహ్యంగా భారీగా లబ్ధి పొందింది. టీఎంసీ ముస్లిం ఓటుబ్యాంకుకు కాంగ్రెస్, సీపీఎం, హుమయూన్ కబీర్ నేతృత్వంలోని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ(ఏజేయూపీ) గండికొట్టాయి. చివరకు 50 శాతానికిపైగా ముస్లిం జనాభా ఉన్న జిల్లాలు ముర్షీదాబాద్, మాల్దా, ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లాల్లో సైతం టీఎంసీకి సంఘటితంగా ఉన్నాయనుకున్న మైనారిటీల ఓట్లు చీలిపోయాయి. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 43 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 35 చోట్ల గెలిచింది. కానీ ఈసారి 22కే పరిమితమైంది. బీజేపీ స్థానాలు 8 నుంచి 17కి పెరిగాయి. మిగతా నాల్గింటిలో కాంగ్రెస్, టీఎంసీ, ఏజేయూపీ గెలిచాయి. ఈ నియోజకవర్గాల్లో మైనారిటీ ఓట్లు మూడు పార్టీలకూ వెళ్లాయని.. ఈ చీలికతో బీజేపీ లబ్ధి పొందినట్లు ఓట్ల డేటా స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. రాణినగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జుల్ఫికర్ అలీ 2,701 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అలీకి 79,423 ఓట్లు, సమీప టీఎంసీ అభ్యర్థికి 76,722 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సీపీఎం అభ్యర్థి 48,587 ఓట్లు సాధించారు. అంటే ముస్లిం ఓట్లు ఈ ముగ్గురి నడుమా చీలిపోయాయి. చాలా స్థానాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ అభ్యర్థులు సాధించిన ఓట్లు.. టీఎంసీ అభ్యర్థుల ఓటమి మార్జిన్ల కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..
రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్