మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి!
ABN , Publish Date - Sep 01 , 2026 | 04:37 PM
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సోదరుడి కుమార్తె, 28 ఏళ్ల బృష్టి ముఖర్జీ మృతి చెందారు. కుసుంబా గ్రామంలో ఉన్న నివాసంలో ఆమె అనుమానాస్పద స్థితిలో ప్రాణాలొదిలారు.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 1: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మమత సోదరుడి కుమార్తె, 28 ఏళ్ల బృష్టి ముఖర్జీ పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా రాంపూర్ హాట్ సమీపంలోని కుసుంబా గ్రామంలో ఉన్న నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భవనం రెండో అంతస్తులోని ఆమె గదిలో ఉరి వేసుకుని ప్రాణాలొదిలారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతికి గల పూర్తి కారణాలు.. పోస్టుమార్టం నివేదిక, సమగ్ర విచారణ అనంతరం వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
బృష్టి ముఖర్జీ విడాకుల కేసు విచారణ దశలో ఉందని, కొన్ని సంవత్సరాలుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని, దీనికి సంబంధించి చికిత్స కూడా పొందుతున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఉద్యోగాలు రద్దవ్వడంతో, ఆమె కూడా తన ఉద్యోగాన్ని కోల్పోయారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఉద్యోగం పోయినప్పటి నుంచి ఆమె మరింత ఆందోళనకు గురైనట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు మొదలుపెట్టారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల నియామకాల కుంభకోణానికి సంబంధించి బ్రిష్టి ముఖర్జీ గతంలో ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఒక వైపు ఉద్యోగం కోల్పోవడం, దీనికితోడు భర్తతో విడాకుల అంశం ఆమె ఆత్మహత్యకు కారణం కావొచ్చని కుటుంబ సభ్యులు అంటున్నారు. బృష్టి ముఖర్జీ తండ్రి నిహార్ ముఖర్జీ స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు.
ఈ వార్తలు కూడా చదవండి
పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని
వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..