‘మంత్రించిన’ చింతగింజలు కిలో రూ.లక్ష
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:48 AM
అతడో దొంగ స్వామి.. పేరు అశోక్ కారత్.. జ్యోతిష్యం చెబుతానని నమ్మబలికి భక్తులతో పూజలు చేయిస్తాడు.. పనికిరాని చింతగింజలను మంత్రించిన రాళ్లు అంటూ కిలోకు రూ.లక్ష చొప్పున అమ్ముతాడు..
‘పవిత్రమైన’ తేనె కిలో రూ.9 లక్షలు.. 150 మందికిపైగా మహిళలపై అత్యాచారం
మహారాష్ట్రలో దొంగస్వామి అశోక్ కారత్ దారుణాలు..బయటపడిన వీడియోలు
నిందితుడి అరెస్టు.. 2వారాలుగా జైలులో
నాసిక్, ఏప్రిల్ 3: అతడో దొంగ స్వామి.. పేరు అశోక్ కారత్.. జ్యోతిష్యం చెబుతానని నమ్మబలికి భక్తులతో పూజలు చేయిస్తాడు.. పనికిరాని చింతగింజలను మంత్రించిన రాళ్లు అంటూ కిలోకు రూ.లక్ష చొప్పున అమ్ముతాడు.. పవిత్రమైన తేనె అని చెప్పి మామూలు తేనెనే కిలోకు రూ.9 లక్షలకు విక్రయిస్తాడు. అంతేకాదు, కుటుంబ సమస్యల పరిష్కారం కోసం వచ్చే మహిళలకు తీర్థం పేరుతో మత్తు ద్రావకాలు ఇచ్చి, వారు స్పృహ కోల్పోయాక అత్యాచారం చేసేవాడు. సంతానం కలగటం లేదని వచ్చిన మహిళల్ని.. తానే దేవుని అవతారం అంటూ.. రేప్ చేసేవాడు. మహారాష్ట్రలో కెప్టెన్‌బాబాగా పేరొందిన ఈ దొంగస్వామి అక్రమాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయనతో ఉన్న సంబంధాల కారణంగా ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాజీనామా చేశారు. పలువురు మహిళలు తమ మీద అశోక్ కారత్ జరిపిన అత్యాచారాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మహిళలతో అతడు జరిపిన శృంగారం వీడియోలు బయటకొస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల నిర్వహించిన అక్రమ భూ లావాదేవీలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఉదంతం మహారాష్ట్రనే కాదు.. సోషల్ మీడియానూ ఊపేస్తోంది. అశోక్ కారత్ ప్రస్తుతం నాసిక్‌లోని సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఒక అత్యాచారం కేసులో కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తాజాగా, గురువారం రెండో అత్యాచారం కేసులో ఏప్రిల్ 8వ తేదీ వరకూ పోలీసు రిమాండ్ విధించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పోలీసు స్టేషన్లలో 8 రేప్ కేసులు, 2 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఫోనులో వందకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఏర్పాటైన సిట్ అధికారులు వెల్లడించారు.
20 అడుగుల రిమోట్ పాము
అశోక్ కారత్ కార్యాలయం నుంచి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు.. అక్కడ రిమోట్‌తో నడిచే ఓ 20 అడుగుల బొమ్మ పామును చూసి ఆశ్చర్యపోయారు. ఆ బొమ్మను అశోక్ కారత్ నిజమైన పాముగా భక్తులను నమ్మించి, రిమోట్‌తో కదిలించేవాడని వెల్లడైంది. అశోక్ కారత్ భారీగా ఆస్తులు సంపాదించినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఆ అక్రమ సొమ్మును జమ చేయడానికి రెండు సహకార పరపతి సంఘాల్లో వివిధ పేర్లతో 130కిపైగా ఖాతాలు తెరిచినట్టు ఓ పోలీసు అధికారి చెప్పారు. కొన్ని ఖాతాలు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలీ చకాన్‌కర్ పేరున కూడా ఉన్నాయి. అశోక్ కారత్, ఆయన భార్య కల్పనలపై నమోదైన మరో కేసులో అహల్యానగర్ జిల్లా పోలీసులు విచారణ జరిపినప్పుడు మరిన్ని ఆస్తుల సమాచారం వెలుగులోకి వచ్చింది. కల్పన ప్రస్తుతం పరారీలో ఉండటంతో ఆమె విదేశాలకు పారిపోకుండా లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు. అశోక్ కారత్ వ్యవహారం మహారాష్ట్రలో సంచలనం రేపింది. ఇది అమెరికాలోని ఎప్‌స్టీన్ ఫైళ్ల కేసు కంటే దారుణమైనదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో.. అధికార పార్టీ బీజేపీ నేతలకు సంబంధించిన వీడియోలు కూడా బయటకొస్తే ప్రభుత్వం కూలుతుందన్నారు. అక్రమాలు, మోసాలతో అశోక్ కారత్ రూ.1500 కోట్ల మొత్తం సంపాదించాడని, విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టాడని తెలుస్తోంది. 150 మందికి పైగా మహిళలపై లైంగిక దాడులు జరిపినట్లుగా భావిస్తున్నారు. ఓ 36 ఏళ్ల మహిళ ఫిర్యాదుతో అశోక్ కారత్‌ను మార్చి 18న అరెస్టు చేశారు.
దొంగస్వామి నేపథ్యం ఇదీ
నాసిక్ జిల్లా కహందల్‌వాడీ గ్రామానికి చెందిన అశోక్ కారత్ పదో తరగతి ఫెయిలై.. చదువు ఆపేశాడు. ఓ వ్యక్తికి ఇచ్చిరమ్మని తండ్రి అందజేసిన రూ.4 వేలు తీసుకొని గ్రామం నుంచి చిన్నతనంలోనే ఉడాయించాడు. కొన్నేళ్ల అనంతరం మర్చంట్‌నేవీలో చేరాడు. అక్కడ తాను పదేళ్లపాటు పని చేసి కెప్టెన్ స్థాయికి చేరుకున్నానని తర్వాత కాలంలో చెప్పుకొనేవాడు. దీనివల్లే అతడు కెప్టెన్ బాబాగా పేరొందాడు. కానీ, అతడు మర్చంట్ నేవీలో పని చేసింది నాలుగేళ్లేనని, సెయిలర్‌గా పని చేశాడన్న అభిప్రాయాలున్నాయి. 1990లలో అశోక్ కారత్ నాసిక్ నగరానికి వచ్చి జ్యోతిష్యం చెప్పటం ప్రారంభించాడు. పలువురు రాజకీయ నాయకులు కూడా వస్తుండటంతో అతని ఇమేజీ పెరిగిపోయింది. 2000లలో స్థిరాస్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, భూలావాదేవీలు జరపటం ప్రారంభించాడు. ఈశాన్వేశ్వర్ పేరుతో ఒక ఆలయాన్ని ప్రారంభించి, దానికి తన ఆధ్వర్యంలో ట్రస్టు నెలకొల్పాడు. పలువురు మంత్రులు, ప్రముఖ నేతలు కూడా అశోక్ కారత్ ను కలిసేవారు. అశోక్ కారత్ ఆఫీసులో పని చేసే నీరజ్ జాదవ్ అనే వ్యక్తికి.. దొంగస్వామి పనులపై అనుమానం కలిగి.. ఆఫీసులో రహస్యంగా ఓ కెమెరా అమర్చి, అతడి పనుల్ని రికార్డు చేశాడు. ఈ వీడియో రికార్డులే ఇప్పుడు అశోక్ కారత్ చేసిన దారుణాలకు సాక్ష్యాలుగా నిలిచాయి.