రాజ్యసభలో 'లుంగీవాలా' రగడ.. అవమానించారంటూ ఆగ్రహం
ABN , Publish Date - Aug 12 , 2026 | 08:07 PM
రాజ్యసభలో దుస్తుల ప్రస్తావన రాజకీయ దుమారానికి దారితీసింది. చర్చ సందర్భంగా తనను 'లుంగీవాలా' అని పిలిచారంటూ సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఢిల్లీ, ఆగస్టు 12: రాజ్యసభలో దుస్తుల ప్రస్తావన తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. చర్చ సందర్భంగా తనను 'లుంగీవాలా' (Lungiwala) అని పిలిచారంటూ సీపీఎం (CPM) ఎంపీ జాన్ బ్రిట్టాస్, బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు (Privilege Motion) ఇవ్వడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విపక్షాలు దీనిని దక్షిణాది సంస్కృతిపై జరిగిన దాడిగా అభివర్ణించగా, ఆ ఆరోపణలను సుస్మితా దేవ్ ఖండించారు.
అసలేం జరిగింది?
సోమవారం సభలో ఇన్‌కమ్ టాక్స్ సవరణ ఆర్డినెన్స్‌పై తీర్మానం ప్రవేశపెడుతున్న సమయంలో తన వెనుక సీటులోకి వచ్చిన సుస్మితా దేవ్, తనను పదే పదే 'లుంగీవాలా' అని పిలిచారని జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు. 'నేను ధోతీ ధరించాను. మలయాళీగా, దక్షిణాది భారతీయుడిగా నేను గర్విస్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు భారతీయ సంస్కృతిని, ప్రాంతీయ గుర్తింపును హేళన చేయడమే' అని బ్రిట్టాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుస్మితా దేవ్ వివరణ – ప్రివిలేజ్ నోటీసు
ఈ ఆరోపణలపై సుస్మితా దేవ్ స్పందిస్తూ తాను 'లుంగీవాలా' అనే పదాన్ని వాడలేదని, ఏ రాష్ట్ర సంస్కృతినీ లేదా దుస్తులను అవమానించలేదని స్పష్టం చేశారు. 'నేను అస్సాంకు చెందిన బెంగాలీని. దేశంలో విభిన్న సంస్కృతులు, దుస్తులు ఉన్నాయనే విషయం నాకు తెలుసు' అని చెప్పారు. సభలో జాన్ బ్రిట్టాస్ అబద్ధాలు చెప్పారని, ఆయనపై కూడా తాను సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు తెలిపారు.

విపక్షాల ఖండన.. ప్రభుత్వ స్పందన
ఈ ఘటనను ఆప్, కాంగ్రెస్, సీపీఐ తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తీవ్రంగా ఖండించారు. భారత్‌లోని 'భిన్నత్వంలో ఏకత్వం'పై, దక్షిణాది సంస్కృతిపై జరిగిన దాడిగా దీనిని అభివర్ణించారు. పరిస్థితిపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ... ప్రభుత్వం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించదని, దాన్ని లుంగీ అనరని, ధోతీ అంటారని పేర్కొన్నారు. ఇద్దరు ఎంపీలను తన ఛాంబర్‌కు ఆహ్వానించి సమస్యను పరిష్కరిస్తానని ప్రతిపాదించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు.
చివరగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ స్పందిస్తూ... సభ్యులెవరూ ఇతర ప్రాంతాల సంస్కృతులను, భావోద్వేగాలను దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని సూచించారు. వివాదాన్ని సామరస్యంగా ముగించేందుకు ఇరుపక్షాల ఎంపీలను తన ఛాంబర్‌కు పిలిపించారు.