చక్కెర కొనుగోళ్లపై పరిమితులు
ABN , Publish Date - Aug 28 , 2026 | 02:20 AM
పంచదార సరఫరా తగ్గిపోవడంతో డీమార్ట్ లాంటి రీటైలర్స్, బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు.. చక్కెర కొనుగోళ్లపై పరిమితులు విధించడం మొదలుపెట్టాయి. గిరాకీకి తగ్గ సరఫరా లేకపోవడంతో గడిచిన రెండు నెలల వ్యవధిలోనే పంచదార ధరలు 40 శాతానికిపైగా పెరిగిన సంగతి తెలిసిందే
బ్రాండ్‌ను బట్టి కిలో నుంచి గరిష్ఠంగా ఐదు కిలోల వరకే కొనుగోలు చేసే వీలు
కొనుగోలు దారులకు రీటెయిల్, క్విక్ కామర్స్ సంస్థల ఆంక్షలు
దిగుమతులకు అనుమతిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ, ఆగస్టు 27: పంచదార సరఫరా తగ్గిపోవడంతో డీమార్ట్ లాంటి రీటైలర్స్, బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు.. చక్కెర కొనుగోళ్లపై పరిమితులు విధించడం మొదలుపెట్టాయి. గిరాకీకి తగ్గ సరఫరా లేకపోవడంతో గడిచిన రెండు నెలల వ్యవధిలోనే పంచదార ధరలు 40 శాతానికిపైగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి తోడు.. కొనుగోళ్లకే పరిమితులు విధించడం గమనార్హం. ఉదాహరణకు.. డీమార్ట్ సంస్థ తన యాప్‌లో 5 కిలోల పంచదార ప్యాకెట్ అయితే గరిష్ఠంగా ఒక ప్యాకెట్‌ను మాత్రమే కొనుగోలు చేయడానికి మాత్రమే వీలు కల్పిస్తోంది. అయితే.. రెండు వేర్వేరు బ్రాండ్లకు చెందిన 5 కిలోల ప్యాకెట్లు (ఒక్కొక్కటీ గరిష్ఠంగా ఒక ప్యాకెట్ మాత్రమే) కొనే వీలుంది. కిలో ప్యాకెట్లు అయితే.. గరిష్ఠంగా రెండు మాత్రమే కొనొచ్చు. బ్లింకిట్, జెప్టో వంటి యాప్స్‌లో 5 కిలోల పంచదార ప్యాకెట్లు కనపడట్లేదు. కిలో ప్యాకెట్లు కూడా కొన్ని బ్రాండ్లవి ఎక్కువ కొనుగోలు చేసే వీలుందిగానీ.. కొన్ని పాపులర్ బ్రాండ్ల చక్కెర ప్యాకెట్ల కొనుగోలుపై ఒకటి నుంచి 3 కిలోల దాకా పరిమితులు ఉంటున్నాయి. కొనుగోలుదారులు ఉండే ప్రాంతాన్ని బట్టి, అక్కడ పంచదార సరఫరా తీరును బట్టి కూడా దేశవ్యాప్తంగా ఈ పరిమితుల్లో తేడాలు ఉంటున్నాయి.
కొరతకు కారణాలు..
పంచదార కొరతకు ప్రధాన కారణాలు మూడు.. 1. అంచనాలకు తగినట్టుగా ఉత్పత్తి లేకపోవడం, 2.మిగులు ఉంటుందనే అంచనాలతో ప్రభుత్వం ఎగుమతులకు అనుమతించడం (ఉత్పత్తి తగ్గిన విషయాన్ని గమనించి మే నెలలో ఎగుమతులపై సర్కారు నిషేధం విధించిందిగానీ.. అప్పటికే 8 లక్షల టన్నుల పంచదార విదేశాలకు ఎగుమతి అయ్యింది). 3. వ్యాపారులు, దళారుల అక్రమ నిల్వ. జూన్ మొదటివారానికి రూ.41గా ఉన్న పంచదార మిల్లు ధర.. ఈ మూడు కారణాలతో ఒక్కసారిగా రూ.65కి చేరింది. ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం కిందటివారమే మిలియన్ టన్నుల చక్కెర దిగుమతులకు అనుమతించడంతో రూ.58కి తగ్గింది. అది మిల్లు ధర. రీటెయిల్‌లో బ్రాండ్‌ను బట్టి ఆ ధరలు రూ.60 నుంచి రూ.90 దాకా కూడా ఉన్నాయి. ధర పెరిగినా కొందామంటే.. గిరాకీకి తగ్గ సరఫరా లేదు. అందునా రానున్నది ప్రధానమైన పండగల సీజన్. ఈ నేపథ్యంలోనే.. ఎక్కువ మందికి చక్కెరను అందుబాటులో ఉంచడానికే ఇలా పరిమితులు విధిస్తున్నట్టు క్విక్ కామర్స్ సంస్థలు చెబుతున్నాయి. గిరాకీకి తగ్గట్టుగా పంచదారను మార్కెట్లోకి అందుబాటులోకి తేవడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ముడిచక్కెర దిగుమతులను అనుమతించి.. దానిని శుద్ధి చేసి మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే సమయాన్ని పెంచింది. దీంతో దసరా, దీపావళి నాటికి చక్కెర ధరలు సాధారణస్థాయికి చేరుకుంటాయని అంచనా