ఈ 10 మందితో.. లారెన్స్ బిష్ణోయ్‌కు ముప్పు!
ABN , Publish Date - Oct 30 , 2026 | 08:14 PM
ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు పలువురు క్రిమినల్స్ నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల నివేదికలు చెబుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ జైల్లో 24 గంటల పటిష్ఠ నిఘా మధ్య ఉన్నాడు. అతడిపై పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. బాలీవుడ్‌ను భయభ్రాంతులకు గురి చేస్తున్న లారెన్స్‌కు జైల్లోనే ముప్పు పొంచి ఉన్నట్టు నిఘా నివేదికల్లో వెల్లడైంది. గతంలో అతడికి మిత్రులుగా ఉన్న వారి నుంచే ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, గోల్డీ బ్రార్, రోహిత్ గొడారాలతో బిష్ణోయ్‌కు ప్రధానంగా ముప్పు పొంచి ఉంది. బ్రార్, గొడారాలతో కలిసి బిష్ణోయ్ మొదట్లో తన క్రిమినల్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. హర్యానా, ఢిల్లీల్లో విస్తరించిన ప్రత్యర్థి బాంభీహా గ్యాంగ్ నుంచి కూడా బిష్ణోయ్‌కు ముప్పు పొంచి ఉంది. బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు విస్తరిస్తున్న కొద్దీ శత్రువులు కూడా పెరిగారు.
గోల్డీ బ్రార్: బిష్ణోయ్‌కి ఒకప్పుడు నమ్మినబంటు. సిధూ మూసేవాలా హత్యలో ఇద్దరి పేర్లూ వినిపించాయి. అయితే, 2025 జూన్‌లో వారి మధ్య ఎడం పెరిగినట్టు తెలిసింది. వీరి వైరంతో అండర్ వరల్డ్ భారీ కుదుపునకు లోనైంది.

రోహిత్ గొడారా: బిష్ణోయ్‌తో ఒకప్పుడు కలిసి పనిచేసిన ముఖ్యుల్లో గొడారా ఒకడు. రాజ్‌పుత్ నేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యలో గొడారా పేరు వినిపించింది. ప్రస్తుతం అతడు గోల్డీ బ్రార్‌తో స్నేహం పెంచుకున్నట్టు సమాచారం.

లక్కీ పాటియాల్: దేవీందర్ బాంభీహా గ్యాంగ్‌లో ముఖ్యుడు. బాంభీహా, బిష్ణోయ్ గ్యాంగ్‌ల మధ్య సుదీర్ఘకాలంగా శత్రుత్వం ఉంది. ప్రస్తుతం బిష్ణోయ్‌కు ఉన్న ప్రధాన శత్రువుల్లో బాంభీహా గ్యాంగ్ ఒకటని పోలీసులు చెబుతున్నారు.

కౌషల్ చౌదరి: బాంభీహా నెట్‌వర్క్‌కు చెందిన మరో ప్రమాదకర గ్యాంగ్‌స్టర్ కౌషల్. బలవంతపు వసూళ్లు, హత్యలు, క్రిమినల్ గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు తదితర కేసులు అతడిపై ఉన్నాయి.

షెహజాద్ భట్టీ: బిష్ణోయ్‌కు ప్రమాదకరంగా మారిన వ్యక్తుల్లో షెహజాద్ భట్టీ కూడా ఉన్నాడు. ఒకప్పుడు వీరిద్దరి మధ్య స్నేహం ఉండేదంటారు. పహల్గాం దాడుల తరువాత ఎడం పెరిగింది. దమ్ముంటే పాకిస్థాన్‌కు రా అంటూ బిష్ణోయ్‌కు భట్టీ సవాలు విసిరాడు కూడా.

నీరజ్ బవానా: ఢిల్లీలోని అత్యంత క్రూరమైన గ్యాంగ్‌స్టర్లలో ఒకడైన నీరజ్‌కు బాంభీహా గ్యాంగ్‌తో దగ్గర సంబంధాలు ఉన్నాయి.

అర్ష దల్లా: పంజాబ్‌లోని పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష దల్లాకు కూడా బాంభీహా గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయి. అర్ష దల్లాతో కూడా బిష్ణోయ్‌కు ముప్పు ఉందని తెలుస్తోంది.

దేవీందర్ బాంభీహా: బాంభీహా గ్యాంగ్‌కు ఆద్యుడు ఇతడే. 2016లోనే పోలీస్ ఎన్‌కౌంటర్‌లో కన్నుమూశాడు. కానీ అతడి పేరిట ఉన్న గ్యాంగ్ ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. లక్కీ పాటియాల్ ప్రస్తుతం గ్యాంగ్‌కు లీడర్‌గా ఉన్నాడు.

హిమాన్షూ భావ్: పంజాబ్‌కు చెందిన హిమాన్షూ కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బాంభీహాతో పాటు నీరజ్ బవానా గ్యాంగ్‌తో కూడా అతడికి సంబంధాలు ఉన్నాయి. లాస్ వేగస్‌లో అతడిని ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది. భారత్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నీరజ్ ఫరీద్‌పురియా: బాంభీహా గ్యాంగ్‌లో ముఖ్యుడైన నీరజ్ స్వస్థలం హర్యానా. కౌషల్ చౌదరి గ్యాంగ్‌తో కూడా నీరజ్‌కు సంబంధాలు ఉన్నాయి. దీంతో పాటు బిష్ణోయ్‌ను తీవ్రంగా వ్యతిరేకించే వర్గాలతో ఇతడు నిరంతరం టచ్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది. హిమాన్షూతో పాటు నీరజ్ కూడా లాస్ వేగస్‌లో పోలీసులకు దొరికిపోయాడు.

ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?
బస్సు బ్రేకులు ఫెయిల్.. పెను ప్రమాదాన్ని తప్పించిన రియల్ హీరో కండక్టర్!