Share News

జడ్జి కాబట్టి బెయిల్ ఇచ్చారా? హిట్ అండ్ రన్ కేసు బాధితుల ప్రశ్న

ABN , Publish Date - Oct 29 , 2026 | 03:11 PM

కొచ్చీలో మెర్సిడీజ్ బెంజ్ కారు హిట్ అండ్ రన్ కేసులో వాహనం యజమాని అయిన ఓ జడ్జికి ముందస్తు బెయిల్ రావడంపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

జడ్జి కాబట్టి బెయిల్ ఇచ్చారా? హిట్ అండ్ రన్ కేసు బాధితుల ప్రశ్న
Kochi Mercedes Benz Hit and Run Case

ఇంటర్నెట్ డెస్క్: కొచ్చీలో మెర్సిడీజ్ బెంజ్ కారు హిట్ అండ్ రన్ కేసులో వాహనం యజమాని అయిన ఓ జడ్జికి ముందస్తు బెయిల్ రావడంపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన జడ్జి అయినందుకే బెయిల్ వచ్చిందా? అంటూ కేరళ హైకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆదివారం ఉదయం స్కూటీపై వెళుతున్న జయబాలకృష్ణన్‌ను(55) మెర్సిడీజ్ బెంజ్ కారు ఢీకొట్టడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో జడ్జి తనయుడు (17) కారును డ్రైవ్ చేసినట్టు తేలింది. త్రిస్సూర్ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి పేరిట ఆ కారు రిజిస్టర్ అయి ఉంది.


ఈ నేపథ్యంలో జయబాలకృష్ణన్ కుటుంబం న్యాయ పోరాటం ప్రారంభించింది. అయితే, ఈ కేసులో కేరళ హైకోర్టు తాజాగా జడ్జికి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయడంపై జయబాలకృష్ణన్ కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘హైకోర్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. కానీ ఈ కేసులో బెయిల్ మంజూరు కావడం నిరాశపరిచింది. జడ్జికి, ఆయన కుమారుడికి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. కానీ చట్టం మాత్రం వారికి అండగా ఉంది. ఇలా ఎందుకు? ఆయన జడ్జి కావడం వలనేనా? ఓ సామాన్యుడికి ఇలాంటి అవకాశం ఉంటుందా?’ అని జయబాలకృష్ణన్ కుమార్తె భద్ర కీర్తి జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.

తన కుమారుడు కారును బయటకు తీసుకెళ్లినట్టు తనకు తెలియదని ఆ జడ్జి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు ఏ విషయమూ తెలియనప్పుడు బాధ్యుడిని చేయడం సబబు కాదని వాదించారు. తాను కారుతో బయట డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం అదే తొలిసారి అని టీనేజర్ చెప్పినట్టు కూడా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


అయితే, జయబాలకృష్ణన్ కుటుంబం మాత్రం ఈ వాదనలను తోసిపుచ్చింది. ‘తన కుమారుడు కారు నడపడం అదే తొలిసారని జడ్జి పేర్కొన్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి తన కుమారుడు డ్రైవింగ్ నేర్చుకున్నట్టు ఆయనే మళ్లీ చెప్పారు. ఇదంతా నమ్మశక్యంగా లేదు. మైనర్ బాలుడి తల్లిదండ్రులు ఘటనా స్థలి వద్ద చాలా సేపు ఉన్నట్టు మాకు సమాచారం ఉంది. వాళ్లు ఆధారాలను టాంపర్ చేసి ఉంటారని అనుకుంటున్నాము. తమ కొడుకును కాపాడుకునేందుకు వాళ్లు ఎంత చేయాలో అంతా చేశారు’ అని జయబాలకృష్ణన్ కుమార్తె ఆరోపించారు. మైనర్ బాలుడి డ్రైవింగ్ వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయని చెప్పారు. ఆ తరువాత వాటిని డిలీట్ చేశారని ఆరోపించారు. జయబాలకృష్ణన్ కుటుంబానికి ఆయన ఒక్కరే జీవనాధారం. ఆ రోజు ఎప్పటిలాగే టీస్టాల్ కట్టేసి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీ నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

నీట్ పేపర్ లీకేజీ కేసు.. 14 మంది నిందితులపై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు!

Updated Date - Oct 29 , 2026 | 03:47 PM