కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఛార్జిషీట్ దాఖలు..
ABN , Publish Date - Sep 20 , 2026 | 01:07 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. శనివారం నాడు పుణె కోర్టులో 5,053 పేజీల ఛార్జిషీట్‌ను సమర్పించారు.
పుణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇవాళ (శనివారం) పుణె కోర్టులో 5,053 పేజీల ఛార్జిషీట్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా హత్య పథక రచన నుంచి అమలు వరకు జరిగిన అన్ని అంశాలను వివరించారు. పోలీసుల ఛార్జిషీట్ ప్రకారం.. కేతన్ అగర్వాల్ (25)కు సియా గోయల్ (20)తో వివాహం జరగాల్సి ఉంది. వీరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరగగా.. నవంబర్‌లో జైపూర్ వేదికగా అంగరంగ వైభవంగా వివాహం జరగాల్సి ఉంది.
అయితే, కేతన్ అగర్వాల్‌ను వివాహం చేసుకోవడం సియా గోయల్‌కు ఇష్టం లేదని పోలీసులు తెలిపారు. ఈ కారణంగానే అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి, రితేష్ హంగే అనే మరో నిందితుడు పథకం రచించినట్లు వెల్లడించారు. ఈ కుట్రలో భాగంగా నిందితులు కేతన్‌కు తెలిసిన ఓ యువతి ఫొటోను ఉపయోగించి ‘మాహి’ పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఖాతా ద్వారా కేతన్‌తో చాటింగ్ చేశారని చెప్పారు. ఈ మేరకు జూన్ 18న లోహగడ్ కోట వద్ద సియాకు ముందస్తు పుట్టినరోజు సర్‌ప్రైజ్ ఇవ్వాలని అతన్ని నమ్మించినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.
జూన్ 18న సియాను ఆ యువ వ్యాపారవేత్త అక్కడికి తీసుకెళ్లగా.. నిందితులు కోట పైనుంచి తోసి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. జూన్ 14న కూడా అదే ప్రాంతంలో హత్యకు ప్లాన్ చేసి విఫలమయ్యారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సియా, చేతన్, రితేష్ హంగేను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ కేసు ఛార్జిషీట్‌లో ఐదుగురు ప్రత్యక్ష సాక్షులతో సహా 100 మందికి పైగా వ్యక్తుల వాంగ్మూలాలను పోలీసులు పొందుపరిచారు. నిందితుల మొబైల్ ఫోన్ డేటా, వాట్సాప్ చాట్‌లు, ఫొటోలు, కాల్ రికార్డులు వంటివి కోర్టుకు సమర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ముంబైలో ఘోర ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి పడిన బీఎండబ్ల్యూ, ముగ్గురి మృతి
రాహుల్ గాంధీపై బీజేపీ నేతల ఫైర్.. 'ఇది నీచమైన చర్య' అంటూ విమర్శలు