పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం
ABN , Publish Date - May 05 , 2026 | 05:25 AM
కేరళలో పదేళ్ల దుష్టపాలనను ప్రజలు తిరస్కరించారని, యూడీఎఫ్ పాలనలో రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ఏఐసీసీ తెలిపింది.
కేరళలో విజయంపై కాంగ్రెస్ అగ్రనేతల స్పందన
న్యూఢిల్లీ, మే 4: కేరళలో పదేళ్ల దుష్టపాలనను ప్రజలు తిరస్కరించారని, యూడీఎఫ్ పాలనలో రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ఏఐసీసీ తెలిపింది. రాష్ట్రంలో నిజమైన సంక్షేమం, ఆర్ధిక ప్రగతి యూడీఎఫ్ హయాంలో ప్రారంభం కాబోతున్నాయని తెలిపింది. కేరళలో మార్పును కోరుకుంటూ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేరళ ఓటర్ల నమ్మకమే యూడీఎఫ్‌కు మార్గదర్శిగా ఉంటుందంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా వాద్రా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేరళలో ప్రజా ప్రభుత్వం ద్వారా సుపరిపాలన అందిస్తామంటూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
యూడీఎఫ్ విజయం ఊహించిందే
కేరళంలో యూడీఎఫ్ కూటమి గెలుపు అనూహ్యమైనది కాదు. ఈ విజయం.. చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నదే. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. 2025లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో పినరాయి సర్కారుకు ఓటర్లు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో.. యూడీఎఫ్ కూటమికి ఏకంగా 18 స్థానాలు కట్టబెట్టారు. అధికార ఎల్డీఎఫ్‌కు కేవలం ఒకే ఒక్క స్థానం ఇచ్చారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ నుంచి ఒకరు గెలుపొందారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే.. 2025 డిసెంబరులో రెండు దశల్లో గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి అన్ని చోట్లా సత్తా చాటింది. 505 గ్రామ పంచాయతీలను, 54 మునిసిపాలిటీలను, నాలుగు కార్పొరేషన్లను యూడీఎఫ్ గెలుచుకోగా.. ఎల్డీఎఫ్ 340 గ్రామ పంచాయతీలు, 28 మునిసిపాలిటీలు, ఒక్క కార్పొరేషన్‌కు పరిమితమైంది. కానీ, విజయన్ సర్కారు ఆ ఓటముల నుంచి ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదు సరికదా.. ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ లేదన్న అతి విశ్వాసంతో.. విజయన్ 3.0 సర్కారు లోడ్ అవుతోందంటూ విస్తృత ప్రచారంతో ఎన్నికలకు వెళ్లి బొక్కబోర్లా పడింది.
బీజేపీ నెగ్గింది 3 స్థానాలే.. ఓట్లు 11.42శాతం
ఈ ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది మూడు చోట్లే అయినప్పటికీ.. 22 సీట్లు గెలిచిన ఐయూఎంఎల్ కన్నా (11.01శాతం) ఎక్కువగా 11.42శాతం ఓట్లు సాధించడం గమనార్హం. నిజానికి బీజేపీ కొన్నేళ్లుగా కేరళలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నుంచి సురేశ్ గోపి బీజేపీ తరపున తొలిసారిగా గెలిచారు. ఆ పార్టీ ఓట్ షేర్ 2019లో 15.64శాతం నుంచి 2024లో 19.24 శాతానికి చేరింది. ఈ ఎన్నికల్లో 11.42 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఓట్ షేర్ తగ్గినప్పటికీ.. ఆ ఎన్నికల్లో మోదీ ఫ్యాక్టర్ పనిచేసిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక, స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఫోకస్ చేసిన కమలనాథులు తిరువనంతపురం కార్పొరేషన్‌ను, 25కు పైగా గ్రామ పంచాయితీలను కూడా గెలుచుకున్నారు. రాష్ట్రమంతటా కాకుండా హిందువులు మెజారిటీగా ఉన్న కొన్ని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి బలాన్ని పెంచుకుంటున్నారు. త్రిసూర్, కాసరగోడ్, తిరువనంతపురం తదితర జిల్లాల్లో పుంజుకున్నారు. అలాగే రాష్ట్రంలో 18.38శాతం శాతం ఉన్న క్రైస్తవులకు దగ్గరవుతూ వారి మద్దతు కూడగడుతున్నారు.