Share News

కాశ్మీర్ గుల్మార్గ్‌లో ఆగిన కేబుల్ కార్లు.. గాల్లోనే 300 మంది.. వీడియో వైరల్

ABN , Publish Date - May 25 , 2026 | 05:25 PM

ఉత్తర కశ్మీర్‌లోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్‌లో సోమవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. వివరాల్లోకి వెళితే..

కాశ్మీర్ గుల్మార్గ్‌లో ఆగిన కేబుల్ కార్లు.. గాల్లోనే 300 మంది.. వీడియో వైరల్
Gulmarg Cable Car Incident

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర కశ్మీర్‌లోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్‌లో సోమవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఇక్కడి ప్రముఖ ఆకర్షణ అయిన 'గోండోలా కేబుల్ కార్' సర్వీస్‌లో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సుమారు 300 మంది పర్యాటకులు గాల్లోనే చిక్కుకుపోయారు. కేబుల్ కార్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొన్ని గంటలపాటు ప్రయాణికులు గాల్లోనే ఉండిపోవడంతో అక్కడ ఉత్కంఠభరిత వాతావారణం నెలకొంది.


కేబుల్ కార్లు గాల్లోనే నిలిచిపోవడంతో పర్యాటకులు.. గట్టిగా కేకలు వేశారు. గమనించిన స్థానికులు రక్షణ బలగాలకు సమాచారం అందించారు. కేబుల్ కార్ల నిర్వహణ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) దళాలతో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు.


ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన ఆయన.. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. పర్యాటకులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు, ఆర్మీ, సహాయక బృందాల సాయంతో పర్యాటకులను కేబుల్‌ కార్ల నుంచి సురక్షితంగా కిందకు దించుతున్నారు. మరోవైపు కేబుల్ కార్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఇంజనీర్లు పనులు ప్రారంభించగా.. అసలు ఈ సాంకేతిక లోపం తలెత్తడానికి గల కారణాలపై ఉన్నతాధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Updated Date - May 25 , 2026 | 06:00 PM