బాగేపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి ఎన్నిక రద్దు
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:12 AM
కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్‌ఎన్ సుబ్బారెడ్డి ఎన్నికను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఈ సమాచారాన్ని ఎన్నికల...
కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
బెంగళూరు, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్‌ఎన్ సుబ్బారెడ్డి ఎన్నికను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఈ సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు, శాసనసభ కార్యదర్శికి పంపాలని సోమవారం ఆదేశించింది. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో సుబ్బారెడ్డి సమర్పించిన నామినేషన్ అఫిడవిట్‌లో ఆస్తి వివరాలను దాచి పెట్టారని, సమగ్రంగా సమర్పించలేదని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి మునిరాజు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి జస్టిస్ ఎంజీఎస్ కమల్ ఏకసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఎమ్మెల్యే సుబ్బారెడ్డి అనర్హుడని సోమవారం తీర్పునిచ్చింది. రెండో స్థానంలో ఉన్న మునిరాజును ఎమ్మెల్యేగా ప్రకటించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఉన్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు వీలుగా, ఆదేశాలను నిలుపుదల చేయాలని ఎమ్మెల్యే సుబ్బారెడ్డి తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో ధర్మాసనం మధ్యంతర స్టేను విధించింది. దీంతో ఎమ్మెల్యే సుబ్బారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని ఎమ్మెల్యే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు పిటిషన్‌ను స్వీకరించి, ఆదేశాలపై స్టే విధించినా, రద్దు చేసినా ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతారు. లేనిపక్షంలో ఆయన ఎన్నిక రద్దు అవుతుంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారెడ్డికి 82 వేల ఓట్లు, బీజేపీ అభ్యర్థి మునిరాజుకు 62 వేల ఓట్లు దక్కాయి.
ఇవి కూడా చదవండి..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..