మహిళా కోటా సవరణకు ఏమిటా ఆత్రం?
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:30 AM
మహిళా కోటా చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం ఎందుకంత ఆత్రుత ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు...
ఎన్నికలయ్యాక అఖిలపక్షం నిర్వహించండి: ఖర్గే
న్యూఢిల్లీ, మార్చి 26: మహిళా కోటా చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం ఎందుకంత ఆత్రుత ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజుకు గురువారం ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. ఏప్రిల్‌లో జరుగనున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. నారీ శక్తి వందన్ అధినియం-2023 చట్టాన్ని సవరించే విషయంలో పార్టీ అభిప్రాయాలను తెలుసుకునేందుకు సమావేశమవుదామంటూ రిజిజు రాసిన లేఖకు ప్రతిస్పందనగా ఖర్గే ఈ లేఖ రాశారు. ‘నారీ శక్తి వందన్ అధినియం-2023 చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని 2023లో రాజ్యసభలో చర్చ సందర్భంగానే నేను డిమాండ్ చేశాను. అయితే, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఆ చట్టాన్ని ఆమోదించి 30 నెలలే అయింది. ఇప్పుడు ఆ చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం ఎందుకంత ఆత్రుత ప్రదర్శిస్తోందో నాకు అర్థం కావడం లేదు. మేమంతా ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాం. అందుకే ఎన్నికల ప్రచారం ముగిశాక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించాం. ఏప్రిల్ 29 తర్వాత ఏ సమయంలోనైనా అఖిలపక్షం నిర్వహించాలని మిమ్మల్ని మరోసారి అభ్యర్థిస్తున్నా’ అని ఖర్గే ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..