Share News

జేఈఈ-నీట్‌ విలీనం?

ABN , Publish Date - May 24 , 2026 | 04:06 AM

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పేపర్‌ లీకైన వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో ఈ పరీక్ష నిర్వహణలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ....

జేఈఈ-నీట్‌ విలీనం?

కేంద్రానికి హైలెవల్‌ కమిటీ సిఫారసు.. పేపర్‌ తయారీలో థర్డ్‌పార్టీ పాత్ర నిలుపుదల: ఎన్‌టీఏ

ఫీజు తిరిగి చెల్లింపు ప్రారంభం

అందుబాటలోకి ప్రత్యేక పోర్టల్‌

న్యూఢిల్లీ, మే 23: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పేపర్‌ లీకైన వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో ఈ పరీక్ష నిర్వహణలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇస్రో మాజీ చీఫ్‌ కె. రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. తాజాగా ఈ కమిటీ కొన్ని సిఫారసులను చేసినట్టు జాతీయ మీడియా పేర్కొంది. వీటి ప్రకారం.. ఇంజనీరింగ్‌, మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రస్తుతం విడివిడిగా నిర్వహిస్తున్న జేఈఈ, నీట్‌లను ఇక నుంచి విలీనం చేసి.. ఒకే జాతీయ ప్రవేశ పరీక్షా విధానాన్ని తీసుకువచ్చే అంశంపై కేంద్రం దృష్టిసారించింది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల ప్రవేశానికి సంబంధించి ఒకే ప్రవేశ పరీక్ష విధానం తీసుకువచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి అధికారులు సమాచారం ఇచ్చారు. రాధాకృష్ణన్‌ కమిటీ సిఫారసుల మేరకు ఈ విధానంపై చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఎన్‌టీఏ నిర్వహించే పరీక్షల సంస్కరణల నేపథ్యంలో ‘అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రవేశాల కోసం పరీక్షల సమన్వయం, ఏకీకరణ’ అనే ఆలోచనను ఈ కమిటీ పేర్కొంది. దీని ప్రకారం.. జేఈఈ, నీట్‌లను ఒకే బోర్డు ఎగ్జామినేషన్‌ తరహాలో నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఇంజనీరింగ్‌లో చేరేవారికి గణితం, వైద్య విద్యలో చేరాలనుకునేవారికి జీవశాస్త్రం వంటి సబ్జెక్టులను ప్రత్యేక విభాగాలుగా కొనసాగించనున్నారు. కాగా, కామన్‌ ప్రవేశ పరీక్ష ప్రతిపాదనను పార్లమెంటరీ స్థాయీ సంఘంలోని చాలా మంది సభ్యులు సమర్థించారు. అలాగే, భవిష్యత్తులో నీట్‌ అభ్యర్థులకు అర్హతలను కఠినతరం చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రవేశ పరీక్ష రాసేందుకు అలాగే అభ్యర్థుల వయసుకు పరిమితులు విధించాలనే సిఫారసులపైనా కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా ప్రవేశ పరీక్షల్లో తీసుకురావాలని భావిస్తున్న సంస్కరణలను ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ అభిషేక్‌ సింగ్‌, ఉన్నత విద్య కార్యదర్శి వినీత్‌ జోషిలు స్థాయీ సంఘానికి వివరించారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షా విధానంపైనా చర్చించారు. మరోవైపు.. ప్రశ్న పత్రాల రూపకల్పనపై బయటి వ్యక్తుల సేవలను వినియోగించుకోరాదని, థర్డ్‌ పార్టీ ఏజెన్సీలను నిలుపుదల చేయాలని నిర్ణయించినట్టు ఎన్‌టీఏ అధికారులు తెలిపారు. కాగా.. స్థాయీ సంఘం చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని కమిటీ చైర్మన్‌ దిగ్విజయ్‌ సింగ్‌ తెలిపారు.


ఫీజు తిరిగి చెల్లింపునకు పోర్టల్‌

నీట్‌ పేపర్‌ లీకైన నేపథ్యంలో అభ్యర్థులు కట్టిన ప్రవేశ పరీక్ష ఫీజును ఎన్‌టీఏ తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దీనికి సంబంధించి ఫీజును తిరిగి చెల్లించేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి.. ‘రిఫండ్‌’ లింక్‌పై క్లిక్‌ చేయాలని, అనంతరం.. బ్యాంకు అకౌంట్‌ వివరాలను నమోదు చేయడం ద్వారా ఫీజును తిరిగి పొందవచ్చని అధికారులు వివరించారు. ఒకసారి వివరాలు నమోదు చేసిన తర్వాత.. వాటిని మార్చేందుకు అవకాశం ఉండదని తెలిపారు. ఫీజు రీఫండ్‌ సదుపాయం ఈ నెల 27 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కాగా, వచ్చే నెలలో నిర్వహించే నీట్‌ పునః పరీక్షకు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

నీట్‌ అడ్మిషన్‌ మానిటరింగ్‌ పోర్టల్‌ తిరిగి ప్రారంభం

దేశంలోని అన్ని వైద్య కళాశాలలు, పీజీ వైద్య విద్యా సంస్థలకు జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ప్రవేశాల వివరాల నమోదుకు సంబంధించిన నీట్‌ అడ్మిషన్‌ మానిటరింగ్‌ పోర్టల్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. అంతేకాక, 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీజీ అడ్మిషన్ల వివరాలను జూన్‌ 8వ తేదీ లోపు అన్ని విద్యాసంస్థలు అడ్మిషన్‌ మానిటరింగ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చెయ్యాలని స్పష్టం చేసింది. నిజానికి 2025-26కు సంబంధించి పీజీ అడ్మిషన్ల వివరాలను అప్‌లోడ్‌ చేయడానికి గత నెల 15 వరకు గడువు ఇచ్చారు. కానీ చివరి రోజున ఎదురైన సాంకేతిక లోపాల వల్ల చాలా కళాశాలలు తమ సమాచారాన్ని అప్‌లోడ్‌ చెయ్యలేకపోయాయి.

Updated Date - May 24 , 2026 | 04:06 AM