రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు: మంత్రి జైశంకర్
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:51 PM
దేశాలు తమ లక్ష్యాల కోసం ఉగ్రవాదాన్ని ఓ సాధనంగా చూడకూడదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హితవు పలికారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశాలు తమ లక్ష్యాల కోసం ఉగ్రవాదాన్ని ఓ సాధనంగా చూడకూడదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హితవు పలికారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన చిన్మయ మిషన్ 75వ వార్షికోత్సవంలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఏరకంగా సమర్థించలేమని చెప్పారు. టెర్రరిజాన్ని ఏమాత్రం సహించకూడదని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదని ప్రపంచదేశాలకు స్పష్టం చేశారు. తమకు అన్ని దేశాలతో సంబంధాలు తప్పదంటూ పాక్తో దౌత్యాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి సమర్థించుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
చరిత్ర నేర్పించిన పాఠాలను కొన్ని దేశాలు రాజకీయ కారణాలతో పక్కన పెట్టేస్తున్నాయని మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షిస్తున్నాయని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతర్జాతీయ సమాజం కఠిన వైఖరి అవలంబించాలని చెప్పారు.
ప్రపంచం ఉమ్మడిగా ఎదుర్కొంటున్న ముప్పు ఉగ్రవాదని మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఉగ్రవాదం కట్టడికి తమ నిబద్ధతను చాటుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు.
యుద్ధం ఏ మూలన జరిగినా అందరికీ ముప్పే..
యుద్ధాలతో ప్రపంచ ఆర్థిక రాజకీయ పరిస్థితులపై విస్తృత ప్రతికూల ప్రభావం పడుతోందని మంత్రి అన్నారు. యుద్ధం ఎక్కడ జరిగినా ప్రపంచమంతా అశాంతి నెలకొంటుందని హెచ్చరించారు. ప్రస్తుత ఇరాన్, యుక్రెయిన్ యుద్ధాలకు చర్చలు, దౌత్యమే పరిష్కారమని మరోమారు స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
కర్ణాటకలో కన్నడిగులకే ప్రాధాన్యం.. ఐటీ సంస్థలకు డీకే శివకుమార్ హెచ్చరిక
ఎన్నారైలు అలా ఎప్పుడూ చేయరు.. ఫ్రాన్స్ అల్లర్లపై మంత్రి పీయూష్ గోయల్