Share News

మీ వీసా విధానంతోమాకు తీవ్ర నష్టం

ABN , Publish Date - May 25 , 2026 | 04:09 AM

అమెరికా తన వీసా విధానంలో తీసుకొచ్చిన మార్పులతో భారతీయులు తీవ్రంగా నష్టపోతున్నారని విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్‌ తెలిపారు.

మీ వీసా విధానంతోమాకు తీవ్ర నష్టం

  • అమెరికా వీసా సంస్కరణలపై రుబియోతో విదేశాంగ మంత్రి జైశంకర్‌

న్యూఢిల్లీ, మే 24: అమెరికా తన వీసా విధానంలో తీసుకొచ్చిన మార్పులతో భారతీయులు తీవ్రంగా నష్టపోతున్నారని విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్‌ తెలిపారు. గ్రీన్‌కార్డులు, హెచ్‌1బీ వీసాల జారీలో మార్పులు అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో జైశంకర్‌ ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు మంత్రులు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా తన వీసా విధానాన్ని పునఃపరిశీలించాలని కోరారు. అయితే, ఆ మార్పులు తమ వలస విధానంలో చేపట్టిన సంస్కరణల్లో భాగమని, ఏ ఒక్క దేశాన్ని ఉద్దేశించి చేసినవి కాదని రుబియో తెలిపారు. ఇంధనం, ద్వైపాక్షిక వాణిజ్యం పెంపు, వ్యూహాత్మక సాంకేతికతలు, అరుదైన ఖనిజాలు, రక్షణ, ప్రజా సంబంధాలు తదితర అంశాలపై తాము చర్చించినట్లు ఇద్దరు నేతలు వెల్లడించారు. అంతర్జాతీయ శాంతి సుస్థిరతలపై భారత్‌ అనుసరిస్తున్న ఐదు అంశాల సూత్రాన్ని జైశంకర్‌ వివరించారు. చర్చల ద్వారా వివాదాల పరిష్కారం, ఆంక్షలు లేని సముద్ర ఆధారిత వాణిజ్యం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించటం, మార్కెట్లను, అరుదైన వనరులను ఆయుధంగా వాడటాన్ని నిరోధించటం, ప్రపంచ సప్లైచైన్‌కు నమ్మకమైన భాగస్వామ్యాలు అనేవిభారత విదేశాంగ విధాన మూల సూత్రమని తెలిపారు. కాగా, రుబియో భారత పర్యటన మోదీ ప్రభుత్వ దౌత్య విజయమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు.


త్వరలోనే ట్రేడ్‌ డీల్‌: రుబియో

భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి తుది రూపు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇందులో భాగంగా త్వరలోనే తమ ప్రతినిధి బృందం చర్చల కోసం ఢిల్లీకి వస్తుందని చెప్పారు. భారత ప్రతినిధి బృందం ప్రస్తుతం అమెరికాలోనే ఉందని వెల్లడించారు. రెండుదేశాలకు ప్రయోజనకరమైన, సుస్థిరమైన వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేసుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. తమ వాణిజ్య విధానాన్ని పూర్తిగా సంస్కరిస్తున్నామని.. అందులో భాగంగానే భారత వస్తువులపై అదనపు సుంకాలు విధించామే తప్ప.. కక్షపూరితంగా కాదని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ప్రధాని స్వయంగా మాట్లాడకపోవటం వల్లనే వాణిజ్య ఒప్పందం ఆగిపోయిందన్న వాదనను ఆయన ఖండించారు. అమెరికాలో భారతీయులపై జాతి వివక్ష దాడులు పెరిగిపోవటంపై రుబియో స్పందించారు. ప్రతిదేశంలోనూ మూర్ఖులు ఉంటారని, అలాగే తమ దేశంలోనూ కొందరు మూర్ఖులు ఉన్నారని తెలిపారు. భారతీయులపై జాతివివక్ష చూపేవారిని కఠినంగా శిక్షిస్తున్నట్లు చెప్పారు.

ఇండియా ఏం కోరినా ఇస్తాం: ట్రంప్‌

తన చర్యలు, మాటలతో అందరినీ ఆశ్చర్యపరిచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఆదివారం కూడా అలాంట పనే చేశారు. ఢిల్లీలో మార్కో రుబియో నేతృత్వంలో అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించారు. రుబియోతోపాటు భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ వేదికపై ఉండగా.. ఊహించిన విధంగా గోర్‌కు ట్రంప్‌ ఫోన్‌ చేశారు. ఆయన మాటలను లైవ్‌లో ప్రసారం చేశారు. ‘ప్రధాని మోదీ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నా స్నేహితుడు. నాపైనా, మనదేశంపైనా భారత్‌ 100 శాతం నమ్మకం పెట్టుకోవచ్చు. వారికి ఏదైనా సహాయం కావాలంటే ఎవరికి ఫోన్‌ చేయాలో తెలుసు. వాళ్లు ఇక్కడికే (ట్రంప్‌కు) ఫోన్‌ చేస్తారు. మనం చాలాబాగా పనిచేస్తాం. రికార్డులు సృష్టిస్తాం. మనది రికార్డ్‌ ఎకానమీ. రికార్డ్‌ స్టాక్‌ మార్కెట్‌. భారత్‌కు ఏం కావాలన్నా.. (మననుంచి) వాళ్లు పొందలరు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

Updated Date - May 25 , 2026 | 04:09 AM