Share News

ఇరాన్‌లో ఐఆర్‌జీసీ పాలన?!

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:47 AM

ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందా? పాలనను ఐఆర్‌జీసీ తన చేతుల్లోకి తీసుకోనుందా?.. అంటే.. ఔననే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. తదుపరి సుప్రీం లీడర్‌గా...

ఇరాన్‌లో ఐఆర్‌జీసీ పాలన?!

  • అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయాలను బుట్టదాఖలు చేసిన చీఫ్‌ అహ్మద్‌

  • కీలక అధికార వ్యవస్థలపై పట్టు

  • రాజకీయ అనిశ్చితిలో పెజెష్కియాన్‌

న్యూడిల్లీ, ఏప్రిల్‌ 1: ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందా? పాలనను ఐఆర్‌జీసీ తన చేతుల్లోకి తీసుకోనుందా?.. అంటే.. ఔననే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. తదుపరి సుప్రీం లీడర్‌గా ప్రకటించినప్పటికీ మొజ్తబా ఖమేనీ ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం.. ప్రస్తుత అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ రాజకీయ ప్రతిష్టంభనలో కూరుకుపోయిన దరిమిలా ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ) పాలనపై పట్టుబిగించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఓ నివేదిక ప్రకారం.. అధ్యక్షుడు పెజెష్కియాన్‌ నిర్ణయాలను ఐఆర్‌జీసీ నిలుపుదల చేయడంతోపాటు పాలనలో తమ ప్రభావాన్ని మరింత పెంచుతోంది. కార్యనిర్వాహక వర్గం పాత్రను కూడా తగ్గిస్తోంది. అంతేకాదు.. అత్యంత కీలకమైన ప్రభుత్వ వ్యవస్థలపైనా ఐఆర్‌జీసీ పట్టు పెంచుకుంటోంది. గత గురువారం ఇంటెలిజెన్స్‌ శాఖ మంత్రిని నియమించేందుకు అధ్యక్షుడు ప్రయత్నించగా.. ఐఆర్‌జీసీ చీఫ్‌ కమాండర్‌ అహ్మద్‌ వాహి దీ జోక్యంతో ఆ ప్రయత్నం విఫలమైంది. హొస్సేన్‌ దేఘన్‌ సహా ప్రతిపాదిత నేతల పేర్లను వాహిదీ బుట్టదాఖలు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అన్నీ తనకనుసన్నల్లో జరగాలని వాహిదీ పట్టుబడుతుండడంతో అధ్యక్షుడు మారుమాట్లాలేకపోతున్నారు.

దక్కని ఖమేనీ అపాయుంట్‌మెంట్‌

ప్రస్తుత పరిస్థితులను వివరించేందుకు సుప్రీం లీడర్‌గా ప్రకటించిన మొజ్తబా ఖమేనీతో భేటీకావాలని అధ్యక్షుడు పెజెష్కియాన్‌ ప్రయత్నించినప్పటికీ.. ఆయన దర్శనం లభించడం లేదని నివేదిక వెల్లడించింది. అమెరికా, ఇరాన్‌ దాడుల్లో సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ మృతి చెందారు. అనంతరం మొజ్తబాను సుప్రీం లీడర్‌గా ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. తాజాగా పెజెష్కియాన్‌కు కూడా అపాయింట్‌మెంటు ఇవ్వకపోవడంతో అనేక సందేహాలు వస్తున్నాయి. దీనివెను క కూడా ఐఆర్‌జీసీ హస్తం ఉందని భావిస్తున్నారు. అయితే.. అధికారిక చానెల్‌ సహా పలువురు అధికారు లు మొజ్తబా ప్రస్తుతం కోలుకుంటున్నారని చెబుతున్నారు. మరోవైపు మొజ్తబా కార్యాలయాన్నీ ఐఆర్‌జీసీ తమ అధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో వైపు.. లెబనాన్‌కు చెందిన షియా ఇస్లామిక్‌ పార్టీ, తీవ్రవాద సంస్థ హెజ్బొల్లాను మరింత బలోపేతం చేసే దిశగా కూడా ఐఆర్‌జీసీ ప్రయత్నిస్తున్నట్టు మరో నివేదిక వెల్లడించింది. 2024లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధం అనంతరం.. హెజ్బొల్లా మిలిటరీ స్ట్రక్చర్‌ భారీ గా దెబ్బతింది. తాజాగా దీనిని బలోపేతం చేసేందు కు ఐఆర్‌జీసీ కీలక అధికారులను నియమించినట్టు తెలిసింది. ఇదిలావుంటే, ఐఆర్‌జీసీకి చెందిన కీలక ఇమామ్‌ హొస్సేన్‌ యూనివర్సిటీపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఈ వర్సిటీలో అధునాతన ఆయుధాల తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయని ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 06:48 AM