అడుగు దూరంలో చైనాతో యుద్ధం!
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:23 AM
చైనాతో సరిహద్దు సమస్య విషయంలో మోదీ సర్కారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిందని భారత మాజీ సైన్యాధిపతి ఎంఎం నరవణెతెలిపారు. నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగా ఉండేవని చెప్పారు.
ఏం చేయాలని అడిగితే.. ఏది సరైంది అనిపిస్తే అదే చేయమని ఆదేశాలు
అప్పటికి గల్వాన్ ఘటన జరిగి రెండున్నర నెలలు..
నిర్ణయం తీసుకునేందుకు రాజకీయ నాయకత్వం సిద్ధంగా లేదని అర్థమైంది
తీవ్ర విపరిణామాలున్న నిర్ణయాల్ని సైన్యానికి వదిలేయడం సరికాదు
రాత కోతల్లేని దౌత్య నిర్ణయాలతో చైనాకు అవకాశం ఇచ్చినట్లయింది
డోక్లాం పరిష్కారం కాలేదు.. అప్రచురిత ఆత్మకథలో మాజీ ఆర్మీ చీఫ్ నరవణె
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: చైనాతో సరిహద్దు సమస్య విషయంలో మోదీ సర్కారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిందని భారత మాజీ సైన్యాధిపతి ఎంఎం నరవణెతెలిపారు. నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగా ఉండేవని చెప్పారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ యుద్ధం వైపు మొగ్గు చూపలేదని వెల్లడించారు. సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలను రాజకీయ ఆదేశాలు లేకుండా సైన్యమే సొంత నిర్ణయాలతో పరిష్కరించుకోవాలన్నట్లుగా ప్రభుత్వ విధానం ఉండేదన్నారు. సైన్యం కూడా చైనా దురాక్రమణలను సమర్థంగా నిలువరించిందని, అయితే, చాలా వివాదాలు పరిష్కారం కాకుండానే మిగిలిపోయాయని చెప్పారు. చైనాతో సరిహద్దు పరిణామాల మీద దేశ ప్రజలకు పూర్తి అవగాహన కలిగించకుండా ప్రభుత్వం పరిమితులు విధించిందని అభిప్రాయపడ్డారు. చైనా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినపుడు రాజకీయ నాయకత్వం సైనికపరంగా కానీ, దౌత్యపరంగా కానీ మార్గదర్శనం చేయలేదని చెప్పారు. 2020 ఆగస్టు 31న చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి ప్రవేశించినపుడు కూడా ఏది మంచిదైతే అదే చేయండంటూ నిర్ణయాన్ని తమకే వదిలేశారన్నారు. మొత్తం మీద చైనాను నిలువరించామే కానీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేదని చెప్పారు. నిర్ణయాలు తీసుకొని అమలు చేయాల్సిన బాధ్యతతో పాటు జవాబుదారీతనాన్ని కూడా సైన్యం మీదే పెట్టారని తెలిపారు. అయితే, ‘‘మోదీ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఫోర్సె్‌సను చాలా గౌరవంగా చూసేవారు. ఏం చెప్పినా శ్రద్ధగా వినేవారు’’ అని నరవణే పేర్కొన్నారు. 2019 డిసెంబరు 31 నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు భారత సైన్యాధిపతిగా పనిచేసిన నరవణే జనరల్‌గా తన ప్రయాణాన్ని ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’ పేరుతో పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ప్రచురించేందుకు భారత ప్రభుత్వం అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఆయన పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ కారవాన్ మ్యాగజీన్ 40 పేజీల సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించింది. సోమవారం లోక్‌సభలో రాహుల్‌గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కారవాన్ మ్యాగజీన్‌లో కోట్ చేసిన జనరల్ నరవణె పుస్తకంలోని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాం.
కేంద్రీకృత విధానం...
చైనా విధానాన్ని రాజకీయ నాయకత్వం కేంద్రీకృతం చేసింది. ప్రధాని కార్యాలయం, భద్రతా సలహాదారు కార్యాలయం చేతుల్లో ఉంటుంది. సైన్యం పదేపదే స్పష్టత కోరాల్సిన పరిస్థితి. నిజానికి ఒకడుగు ముందుకు వేస్తే యుద్ధం అనే పరిస్థితి ఉంటుంది. కానీ, ఏం చేయాలో చెప్పరు. 2020 ఆగస్టు 31 పరిస్థితే ఇందుకు ఉదాహరణ. తూర్పు లద్ధాఖ్‌లోని రెచిన్ లా వద్ద నాలుగు చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి ప్రవేశించాయి. అప్పటికే అదే లద్ధాఖ్‌లోని గల్వాన్ లోయలో రెండున్నర నెలల ముందు చైనా చొరబాట్లను నియంత్రించే క్రమంలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతో్‌షబాబు సహా 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. అలాంటి పరిస్థితుల్లో రెచిన్‌లా వద్ద భారత ఫార్వార్డ్ పొజిషన్ల వద్దకు చైనా ట్యాంకులు వచ్చేశాయి. ఎదురుదాడి చేయాలా? నియంత్రణ పాటించాలా? ‘వాట్ ఆర్ మై ఆర్డర్స్’ అని రాజకీయ నాయకత్వాన్ని అడిగాం. ఏది సరైన నిర్ణయమని భావిస్తారో అదే చేయండి అంటూ ప్రధాని నుంచి కింది వారి ద్వారా ఆదేశాలు వచ్చాయి. ఎదురు దాడికి దిగితే యుద్ధంలోకి వెళ్లే అవకాశాలే ఎక్కువ. అది సైన్యం మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. దాంతో మళ్లీ అడిగాం. నిర్ణయం ప్రకటించేందుకు రాజకీయ నాయకత్వం సిద్ధం లేదని సందేశం వచ్చింది. యుద్ధాలను సంబంధించిన నిర్ణయాలను సైన్యానికి వదిలేయకూడదు. దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ పొత్తులను ప్రభావితం చేసే అంశాల్లో సైన్యాధిపతి నిర్ణయం తీసుకోలేడు. అయితే, నియంత్రణ పాటిస్తూ సైన్యాన్ని మోహరించాం. చివరకు చైనా సైన్యం సంప్రదింపులకు వచ్చింది.
గాల్వాన్ సమయంలోనూ
లద్ధాఖ్‌లో 2020లో చైనా పథకం ప్రకారం ఆక్రమణలకు పాల్పడింది. గల్వాన్‌లోనే కాదు. పలుచోట్ల ఆక్రమణలు జరిగాయి. కొన్ని భారత్ ఆలస్యంగా గ్రహించింది. ఒత్తిడిలో స్పందించాల్సిన పరిస్థితి. సరిహద్దు వెంట పలుచోట్ల ఇరు సైన్యాలు తలపడాల్సి వచ్చింది. గల్వాన్ ఒక్కటే కాదు. చర్చల ద్వారా కొన్నిచోట్ల వెనక్కి తగ్గారు కొన్నిచోట్ల బఫర్ జోన్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల పెట్రోలింగ్ మీద నియంత్రణలు పాటించాలని నిర్ణయించారు. అయినా కొన్ని చోట్ల పరిష్కారం కాలేదు. గల్వాన్ దాడి పథకం ప్రకారం జరిగింది. చైనా సైన్యం భారత సైనికులను బంధించి కొట్టింది. భారత్ తీవ్రంగా ప్రతిఘటించి చైనాకు తీవ్ర నష్టం చేయడంతో హఠాత్తుగా స్టేటస్ కో నాటకం ఆడింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు జీవితకాలంలో మరచిపోలేని పాఠం అందించాం. అయితే, గల్వాన్ మరణాలు ఒకేసారి జరగలేదు. గాయాలతో, మంచు ప్రభావంతో చనిపోయారు. మరికొంత మందిని బంధించి హింసించి వదిలేశారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రభుత్వం పార్లమెంటుకు కానీ, ప్రజలకు కానీ పూర్తి సమాచారం ఇవ్వలేదు. మన సైనికులు ఎలా చనిపోయారో, ఈ సంఘటన తర్వాత అక్కడ భూభాగం మోహరింపులో ఎలాంటి మార్పులు జరిగాయో సమాచారం అందించలేదు.
డోక్లాం కామాయే ఫుల్‌స్టాప్ కాదు
డోక్లాం అపరిష్కృత అంశమే. చైనా వ్యూహాత్మకంగా మాత్రమే డోక్లాం నుంచి 2017లో వెనక్కి తగ్గింది. అసలు సమస్యను దౌత్యపరంగా ఇంతవరకు పరిష్కరించలేదు. 2020 వేసవిలో లద్ధాఖ్‌లోని గల్వాన్ లోయ పీపీ-14 వద్ద చైనా తొలిసారిగా చొరబాటుకు పాల్పడినపుడు భారత నాయకత్వం దాన్ని పెద్ద సమస్యగా పరిగణించలేదు. అప్పటికి వాళ్ల దృష్టిలో డోక్లామే పెద్ద సమస్య. దోవల్ డోక్లాంపై దౌత్య చర్చల్లో పాల్గొనబోతున్నారు కాబట్టి అందులో గల్వాన్ని చేర్చాలని మే 6న జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం దృష్టికి తీసుకెళ్లాను. అందుకు వారు తిరస్కరించారు. డోక్లాం వద్ద చైనా లక్ష్మణరేఖ దాటింది. భూటాన్ భూభాగమైన డోక్లాంలో చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత్ నిలువరించినప్పటికీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేక పోయింది. భారతదేశం 2017 తర్వాత అనుసరిస్తున్న చైనా విధానంలో దృఢంగా వ్యవహస్తున్నట్లు ప్రజలకు కనబడాలని, అదే సమయంలో చైనాతో పరిస్థితులు చేతులు దాటకుండా చూడాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో దౌత్యపరమైన, సైనికపరమైన, ఇంటెలిజెన్స్ పరమైన అంచనాలను పట్టించుకోలేదు.
చైనాతో చర్చలపై
చైనాతో చర్చల విధానంలో రాజకీయ స్థాయిలో లోపాలున్నాయి. మొదట్లో రాతపూర్వకమైన రికార్డులకు అనుమతించలేదు. కోర్ కమాండర్ స్థాయి చర్చల్లో మినిట్స్ లేవు. నిర్ణయాలను ఆమోదించడం లేదు. ప్రతీదీ రికార్డు రూపంలో ఉండాలన్న సైన్యం ప్రయత్నం అమలు చేయడం విదేశాంగ శాఖ వ్యతిరేకత వల్ల ఆలస్యమైంది. ప్రభుత్వ సౌలభ్యం కోసం వాస్తవాధీన ప్రాంతాల విషయంలో కూడా చెరో పాయింట్‌ను ప్రస్తావించేందుకు, మధ్యలో బఫర్ జోన్లు ఉంచేందుకు అంగీకరించారు. ఇది సైన్యానికి ఇబ్బందికరం. అగ్నిపథ్‌పైన కూడా త్రివిధ దళాల అధిపతులతో అర్థవంతమైన సంప్రదింపులు జరగలేదు.