Share News

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:37 AM

భారత్‌-అమెరికాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు.

భారత్‌-అమెరికా   వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన
nirmalaseetharaman

  • మరిన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు

ఇక సాధ్యం కాకపోవచ్చు

  • వాణిజ్య లోటు భర్తీపైనే ఆ దేశం దృష్టి

  • సంప్రదింపుల కన్నా టారిఫ్‌ల పెంపుపైనే ఆసక్తి

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ, అక్టోబరు 5: భారత్‌-అమెరికాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. చర్చలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని, మరిన్ని రాయితీలు ఇవ్వడం ఇరు పక్షాలకూ సాధ్యపడకపోవచ్చని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన మ్యూనిక్‌ లీడర్స్‌ మీటింగ్‌లో ఆమె ప్రసంగిస్తూ చర్చలు ఒక స్థాయికి చేరుకున్నాయని, అంతకుమించి ఇచ్చిపుచ్చుకోవడం చాలా కష్టమవుతుందని తెలిపారు. అయితే ఏ మాత్రం అవకాశం ఉన్నా చర్చలు కొనసాగించడానికి ఇరు పక్షాలూ సిద్ధంగా ఉన్నాయని అన్నారు. భారత్‌తో అమెరికాకు వాణిజ్య లోటు ఉందని, దాన్ని పూడ్చుకోవడంపైనే ఆ దేశం దృష్టి పెట్టిందని తెలిపారు. ఇందుకు సంప్రదాయ చర్చల మార్గాన్ని కాకుండా ’టారిఫ్‌‘లను ఆయుధంగా మార్చుకోవాలని భావిస్తోందని చెప్పారు.టారిఫ్‌లను పెంచడం ద్వారా వాణిజ్యలోటును భర్తీ చేసుకోవాలని ప్రయత్నిస్తోందని తెలిపారు. ఒకరికొకరు రాయితీలు ఇచ్చుకోవడం, మార్కెట్లను అందుబాటులోకి తెచ్చుకోవడం ద్వారా వాణిజ్య లోటును తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారని, కానీ ఈ విధానం నుంచి అమెరికా మళ్లిందని అభిప్రాయపడ్డారు. వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడంపైనే చర్చల్లో అమెరికా దృష్టి పెడుతోందని, ఇంతవరకు జరిగిన లోటును ఏదోవిధంగా పూడ్చుకోవాలని భావిస్తోందని వివరించారు. భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతులు ఎక్కువగా ఉండి, దిగుమతులు తక్కువగా ఉన్నాయి.


ఈ కారణంగా అమెరికాకు వాణిజ్య లోటు ఏర్పడడంతో ఆ అంశంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించింది. కేవలం వాణిజ్యపర అంశాలకు పరిమితం కాకుండా, వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో చర్చలు సంక్లిష్టంగా మారాయని నిర్మలా సీతారామన్‌ అన్నారు. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా కాకుండా టారిఫ్‌లు విధించడం ద్వారా లోటును భర్తీ చేసుకోవాలని ఆలోచిస్తోందని చెప్పారు. ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరలాంటే సరఫరాల గొలుసుకు నష్టం కలగకూడదని అన్నారు. ఆ గొలుసుకు ఏ చిన్న విఘాతం కలిగినా కొత్త భాగస్వామిని ఎంచుకొని సరఫరాలకు ఆటంకాలు కలగకుండా చూసుకుంటారని తెలిపారు. ప్రపంచంలో క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నందున దేశ ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకువెళ్లాల్సి ఉందని అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.

ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్

Updated Date - Oct 06 , 2026 | 04:38 AM