Share News

సుంకాలు తగ్గాయ్‌

ABN , Publish Date - Feb 03 , 2026 | 02:39 AM

భారత్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్‌పై ప్రతీకార సుంకాలను 25శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ప్రకటించారు.

సుంకాలు తగ్గాయ్‌

  • భారత్‌పై టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించిన ట్రంప్‌

  • ప్రధాని మోదీతో ఫోన్‌లో ట్రంప్‌ చర్చలు.. అనంతరం ట్రూత్‌ సోషల్‌లో పోస్టు

  • భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు!.. ఉక్రెయిన్‌పైనా మోదీతో మాట్లాడా..

  • రష్యా చమురు ఇకపై కొనమన్నారు.. అమెరికా, వెనెజువెలా నుంచి కొంటామన్నారు

  • వీలైనంత భారీగా అమెరికా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటామని హామీ ఇచ్చారు

  • భారత్‌ రూ.45.5 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటుంది

  • సుంకాలను భారత్‌ క్రమంగా సున్నాకు తగ్గించనుంది.. ట్రంప్‌ వెల్లడి

  • సుంకాల తగ్గింపుపై ప్రధాని మోదీ హర్షం.. ప్రజల తరఫున ట్రంప్‌కు ధన్యవాదాలు

  • ప్రపంచ శాంతికి ట్రంప్‌ సారథ్యం అవసరమని వ్యాఖ్య.. అమెరికాలో జైశంకర్‌

న్యూయార్క్‌/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: భారత్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్‌పై ప్రతీకార సుంకాలను 25శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ప్రకటించారు. ఒప్పందం వెంటనే అమల్లోకి వస్తుందని ట్రూత్‌ సోషల్‌ వేదికగా ప్రకటించారు. బదులుగా రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తామని, అమెరికా చమురు ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని వెల్లడించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ వసూలు చేస్తున్న టారి్‌ఫలను దశలవారీగా సున్నాకు తగ్గిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్‌పై వేసిన అదనపు 25శాతం సుంకాల అంశాన్ని ట్రంప్‌ ప్రస్తావించలేదు. కానీ భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ సోమవారం రాత్రి జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌పై సుంకాలను 50శాతం నుంచి 18శాతానికి తగ్గించినట్టుగా వెల్లడించారు. మరోవైపు సుంకాల తగ్గింపుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. 18శాతానికి సుంకాలను తగ్గించడంపై ట్రంప్‌కు 140 కోట్ల మంది భారతీయుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్టు ప్రకటించారు. అయితే రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేత తదితర అంశాలు వేటినీ మోదీ ప్రస్తావించలేదు. అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై భారత్‌ భారీగా సుంకాలు విధిస్తోందంటూ గతేడాది జూలైలో 25శాతం ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్‌.. తర్వాత రష్యా నుంచి వద్దన్న చమురు కొంటోందంటూ ఆగస్టులో సుంకాలను 50శాతానికి పెంచిన విషయం తెలిసిందే.


మోదీతో ఫోన్‌లో ట్రంప్‌ చర్చలు

సోమవారం ప్రధాని మోదీకి ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ ‘ఎక్స్‌’లో తొలుత ఈ విషయాన్ని వెల్లడించారు. తర్వాత ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘‘నా గొప్ప స్నేహితుల్లో ఒకరు, శక్తివంతమైన నేత ప్రధాని మోదీతో మాట్లాడాను. వాణిజ్యం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలకడం సహా చాలా అంశాలపై చర్చించాం. రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేసేందుకు.. అమెరికా నుంచి, ముఖ్యంగా వెనెజువెలా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసేందుకు మోదీ అంగీకరించారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేందుకు ఇది తోడ్పడుతుంది. మిత్రుడు మోదీ విజ్ఞప్తి మేరకు, ఆయనపై గౌరవంతో.. యూఎ్‌స-భారత్‌ వాణిజ్య ఒప్పందానికి అంగీకరించాం. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. భారత్‌పై అమెరికా ప్రతీకార సుంకాలను 25శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తున్నాం. బదులుగా అమెరికా ఉత్పత్తులపై భారత్‌ సుంకాలను క్రమంగా సున్నాకు తగ్గిస్తుంది. వాణిజ్య అడ్డంకులను తొలగిస్తుంది. రూ.45.5 లక్షల కోట్ల (500 బిలియన్‌ డాలర్ల) విలువైన అమెరికా చమురు, బొగ్గు, సాంకేతిక, వ్యవసాయ, ఇతర ఉత్పత్తులను భారత్‌ కొనుగోలు చేస్తుంది. దీనికి అదనంగా వీలైనంత ఎక్కువగా అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. భారత్‌తో మా బంధం మరింత బలోపేతం అవుతుంది. ప్రధాని మోదీ, నేను ఇద్దరం గొప్ప పనులు పూర్తి చేశాం’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా, భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం వాషింగ్టన్‌కు చేరుకున్నారు. అరుదైన ఖనిజాల సరఫరాకు సంబంధించిన సమావేశంలో పాల్గొననున్నారు.


ఇండియా గేట్‌ బాగుంటుంది..

భారతీయ సైనిక అమరులకు గుర్తుగా ఢిల్లీలో ఠీవిగా నిలబడిన ‘ఇండియా గేట్‌’పై ట్రంప్‌ కన్ను పడింది. అలాంటిది తమకూ కావాలని అనిపించింది. ట్రంప్‌ స్వయంగా దీనిపై ట్రూత్‌ సోషల్‌లో ఇండియా గేట్‌ ఫొటోతో పోస్టు పెట్టారు. ‘‘ఇది భారత్‌ విజయ ద్వారం. మేం కట్టబోయేది ఇలాంటి వాటన్నింటికన్నా గొప్పగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. తర్వాత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో చాలా నగరాలకు విజయ ద్వారాలు ఉన్నాయని.. గొప్ప దేశమైన అమెరికాలోని వాషింగ్టన్‌లో మాత్రం లేదని పేర్కొన్నారు. పారి్‌సలోని ‘ఆర్క్‌ డె ట్రయంఫీ’ తరహాలో ప్రపంచంలోనే గొప్పగా, అందంగా వాషింగ్టన్‌లో విజయ ద్వారాన్ని నిర్మిస్తామని చెప్పారు.

మోదీ ఆత్మ నిర్భరత కాదు ట్రంప్‌ నిర్భరత: కాంగ్రెస్‌

భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొదట ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ సెటైర్లు వేశారు. ‘‘ఆపరేషన్‌ సిందూర్‌ ఆగినప్పుడు, రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి.. ఇప్పుడు వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా నుంచి ట్రంపే మొదట ప్రకటించారు. ట్రంప్‌తో మోదీ మాట్లాడిన విషయాన్ని కూడా అమెరికా రాయబారి ప్రకటించారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాలను మన ప్రభుత్వం నుంచి కాకుండా.. అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రజలు తెలుసుకుంటున్నారు. మోదీ పూర్తిగా ట్రంప్‌కు లొంగిపోయారు. మోదీ ఆత్మ నిర్భరత కాదు.. ట్రంప్‌ నిర్భరత’’ అని విమర్శించారు.

Updated Date - Feb 03 , 2026 | 02:39 AM