Share News

సాగుకు, పాడికి రక్షణ

ABN , Publish Date - Feb 08 , 2026 | 05:41 AM

భారత్‌-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఒప్పందంలోని కీలక అంశాల (ఫ్రేమ్‌వర్క్‌)తో ఇరుదేశాల సంయుక్త ప్రకటన శనివారం విడుదలైంది. అమెరికా నుంచి చవకగా వ్యవసాయ, పాడి...

సాగుకు, పాడికి రక్షణ

  • అమెరికా గోధుమలు, బియ్యం సహా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులపై భారత సుంకాలు కొనసాగింపు

  • ఆ దేశ పాడి ఉత్పత్తుల దిగుమతులకు నిరాకరణ

  • అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు

  • రూ.4 లక్షల కోట్ల విలువైన భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు సున్నా.. మిగతా వాటిపై 18%

  • భారత్‌పై 25ు అదనపు సుంకాల తొలగింపు అమల్లోకి

  • పదేళ్లలో భారత ఉత్పత్తులకు 2,717 లక్షల కోట్ల మార్కెట్‌

న్యూఢిల్లీ/ వాషింగ్టన్‌, ఫిబ్రవరి 7: భారత్‌-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఒప్పందంలోని కీలక అంశాల (ఫ్రేమ్‌వర్క్‌)తో ఇరుదేశాల సంయుక్త ప్రకటన శనివారం విడుదలైంది. అమెరికా నుంచి చవకగా వ్యవసాయ, పాడి ఉత్పత్తులు భారీగా వచ్చిపడతాయన్న ఆందోళనకు చెక్‌పడింది. ఈ రంగాలకు చెందిన చాలా ఉత్పత్తుల దిగుమతులపై భారత్‌కే నియంత్రణ ఉండేలా ఒప్పందంలో విధి విధానాలు ఖరారయ్యాయి. అమెరికాతో ఒప్పందంతో భారత రైతులు, పాడి పరిశ్రమ, గ్రామీణ ఉపాధికి ఏమాత్రం నష్టం ఉండదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. ఒప్పందంతో పలు రకాల ఉత్పత్తులపై అమెరికా సుంకాలు సున్నాకు తగ్గనున్నాయని, మిగతా ఉత్పత్తులపై 18ు టారిఫ్‌ ఉంటుందని తెలిపారు. ఇక రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేసేందుకు భారత్‌ అంగీకరించిందని.. ఈ మేరకు భారత్‌పై విధించిన అదనపు 25శాతం సుంకాలను ఎత్తివేస్తున్నామని అమెరికా ప్రకటించింది. రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. కాగా, ఒప్పందంలోని అంశాలను సమీక్షించి, చట్టబద్ధత కల్పించిన అనంతరం పూర్తిస్థాయి ఒప్పందం అమల్లోకి వస్తుందని వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. అమెరికా సుంకాల్లో 25శాతం తగ్గింపు శనివారం నుంచే అమల్లోకి రాగా, మిగతా 25శాతం నుంచి 18శాతానికి తగ్గించే ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇక భారత సుంకాల తగ్గింపు మార్చి నెల మధ్యలో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వాణిజ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

రైతు ప్రయోజనాలకే ప్రాధాన్యం: గోయల్‌

మన దేశ రైతుల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తూనే.. మన దేశ ఎగుమతులు భారీగా పెరిగేలా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. రైతుల ప్రయోజనాలు, గ్రామీణ జీవనోపాధిని కాపాడాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఒప్పందం ప్రతిబింబిస్తోందన్నారు. ఇది మోదీ నాయకత్వంలో భారత్‌ సాధించిన చరిత్రాత్మక విజయమని అభివర్ణించారు. అన్ని వాణిజ్య చర్చలు, ఒప్పందాల్లో రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇటీవల యూరోపియన్‌ యూనియన్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోనూ ఈ మేరకు రక్షణలు కల్పించామని వెల్లడించారు. భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే సుమారు రూ.4 లక్షల కోట్ల(44 బిలియన్‌ డాలర్లు) విలువైన ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు తగ్గిపోనున్నాయని... మరో రూ.2.7 లక్షల కోట్ల (30 బిలియన్‌ డాలర్లు) విలువైన ఉత్పత్తులపై 18ు సుంకాలు ఉంటాయని వెల్లడించారు. మరో రూ.లక్ష కోట్ల(12 బిలియన్ల) విలువైన ఉక్కు, అల్యూమినియం, కాపర్‌, పలు రకాల వాహనాల విడిభాగాలు తదితర భారత ఉత్పత్తులపై ప్రస్తుత సుంకాలు కొనసాగుతాయని వివరించారు. వచ్చే నాలుగేళ్లలో అమెరికా, భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్యం రూ.45 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు. ఈ ఒప్పందంతో వచ్చే పదేళ్లలో భారత ఎగుమతిదారుల కోసం మొత్తంగా రూ. 2,717 లక్షల కోట్ల (30 ట్రిలియన్‌ డాలర్లు) మార్కెట్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దేశంలో చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు, రైతులు, మత్స్యకారులకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తుందని.. యువతకు లక్షలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. త్వరలోనే తుది ఒప్పందంపై సంతకాలు జరిగి, పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇది ‘న్యాయమైన, సముచిత, సమతౌల్య ఒప్పందం’ అని అభివర్ణించారు.


సుంకాలు తొలగిస్తున్నాం: అమెరికా

మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైన నేపథ్యంలో భారత్‌పై విధించిన అదనపు 25ు సుంకాలను ఈ నెల 7వ తేదీ నుంచే రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని, అమెరికా నుంచి భారీగా చమురు కొంటామని భారత్‌ హామీ ఇచ్చిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య, విదేశాంగ, ఆర్థిక శాఖల మంత్రులు, వాణిజ్యశాఖకు చెందిన ఒక ఉన్నతాఽధికారి, అధ్యక్షుడి ఆర్థిక, జాతీయ భద్రతా సలహాదారులతో కూడిన బృందం ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. ఒకవేళ భారత్‌ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటే.. తిరిగి 25శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. పదేళ్ల పాటు ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంచడం కూడా వాణిజ్య ఒప్పందంలో భాగమని వెల్లడించారు.

ఒప్పందంలో రక్షణలు ఇవే..

  • అమెరికాకు చెందిన ఎలాంటి వ్యవసాయ ఉత్పత్తులకూ కొత్తగా వెసులుబాట్లు ఉండవు. గోధుమలు, బియ్యం, మొక్కజొన్న, సోయా, నూనెగింజలు, పౌలీ్ట్ర, ఇతర మాంసం ఉత్పత్తులు, ఇథనాల్‌, పొగాకు తదితర ఉత్పత్తులపై ఇప్పటికే ఉన్న అధిక సుంకాలు కొనసాగుతాయి.

  • కూరగాయలు, చిక్కుడు జాతి ఉత్పత్తులు, బఠానీ, కాబూలీ శనగలు, ఉల్లి, వెల్లుల్లి, పుట్టగొడుగులు, తేనె, అరటి, మామిడి, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లు, ఆ పండ్ల ఆధారిత ఉత్పత్తులు, లవంగాలు, మిరియాలు సహా అన్ని రకాల మసాలాలు, అన్ని రకాల టీ ఉత్పత్తులపై నియంత్రణలు భారత్‌ ఆధీనంలో ఉంటాయి.

  • ఒప్పందంలో భాగంగా కిలో రూ.80 ఆపైన ధర ఉన్న యాపిల్స్‌ దిగుమతికే అవకాశం ఉంటుంది. అంతేగాక వాటిపై 25శాతం సుంకం వర్తిస్తుంది.

  • అమెరికా నుంచి పాలు, పెరుగు, వెన్న, బట్టర్‌, పనీర్‌ సహా పాల ఆధారిత ఉత్పత్తులను భారత్‌ దిగుమతి చేసుకోదు.

  • వికసిత్‌ భారత్‌ దిశగా: మోదీ

అమెరికాతో వాణిజ్య ఒప్పందం మేకిన్‌ ఇండియాకు ఊతమిస్తుందని.. రైతులు, మహిళలు, యువత, పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందంపై సంయుక్త ప్రకటన అనంతరం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ‘‘భారత్‌, అమెరికా ప్రజలకు శుభాకాంక్షలు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్‌వర్క్‌పై అంగీకారానికి వచ్చాం. ఇరుదేశాల మధ్య లోతైన, విశ్వాసపూర్వకమైన భాగస్వామ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. వికసిత్‌ భారత్‌ దిశగా మరో ముందడుగు వేశాం’’ అన్నారు.


భారత్‌ సుంకాలు తగ్గించే రంగాలు

  • అమెరికా నుంచి దిగుమతి అయ్యే పారిశ్రామిక, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులు, రసాయనాలు, వాహనాల విడిభాగాలు, టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తులపైన డేటా సెంటర్‌ పరికరాలు, సర్వర్లు, సెమీకండక్టర్‌ చిప్స్‌, కృత్రిమ మేధ హార్డ్‌వేర్‌, జీపీయూలపై భారత్‌ సుంకాలను క్రమంగా సున్నాకు తగ్గిస్తుంది. దీనితో ఆయా ఉత్పత్తుల ధరలు తగ్గి మేకిన్‌ ఇండియాకు ఊతం లభిస్తుంది.

  • ఎర్ర జొన్నలు, బాదాం, వాల్‌నట్స్‌, పిస్తా, జీడిపప్పు, సోయాబీన్‌ నూనె, కొన్ని రకాల పండ్లు, ‘డ్రైడ్‌ డిస్టిలర్‌ గ్రెయిన్స్‌’పై భారత సుంకాలు సున్నాకు తగ్గుతాయి. ఆయా ఉత్పత్తుల ధర తగ్గుతుంది. డిస్టిలరీల్లో మొక్కజొన్న, పలు రకాల ధాన్యాలతో ఇథనాల్‌ ఉత్పత్తి చేశాక మిగిలే పదార్థమే ‘డ్రైడ్‌ డిస్టిలర్‌ గ్రెయిన్స్‌’. ఇది పశువులకు మంచి దాణా. దాని దిగుమతులపై సుంకం మినహాయింపుతో దాణా ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

  • వైన్‌, విస్కీ, బీర్‌ తదితర ఆల్కాహాలిక్‌ ఉత్పత్తులపై ఇప్పటివరకు 150ు దిగుమతి సుంకాలు ఉండగా, ఇకపై 30-40 శాతానికి తగ్గిస్తారు. దీనితో అమెరికన్‌ ఆల్కాహాల్‌ బ్రాండ్ల ధరలు బాగా తగ్గుతాయి. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వైద్య పరికరాలు, సౌందర్య ఉత్పత్తుల ధరలు కూడా దిగిరానున్నాయి.

ఇవి కూడా చదవండి..

మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ

భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Updated Date - Feb 08 , 2026 | 05:41 AM