చైనాకు కౌంటర్ ఇచ్చిన భారత్.. స్పష్టమైన మ్యాప్ విడుదల
ABN , Publish Date - Aug 08 , 2026 | 09:52 AM
భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని భూభాగాలను తమవిగా చెప్పుకునే చైనాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లో పలు ప్రాంతాలను తమవిగా చెప్పుకునే చైనాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆ రాష్ట్రంలోని నాలుగు మౌంటెయిన్ పాస్‌లు, ఒక సరస్సు సహా 27 కీలక ప్రాంతాలతో కూడిన సవివరమైన ప్రామాణిక మ్యాప్‌ను సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య సరిహద్దుకు సంబంధించి పూర్తి క్లారిటీతో ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తరువాత ఈ మ్యాప్‌ను ఖరారు చేసినట్టు హోం శాఖ తెలిపింది. తాజా మ్యాప్‌తో ప్రజలకు మరింత అవగాహన పెరుగుతుందని సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది.
మ్యాప్‌లో తాజాగా చేర్చిన 27 ప్రాంతాల్లో సరిహద్దున ఉన్న మూడు ప్రాంతాలకు (సుబన్‌సిరి జిల్లా) వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. అదే జిల్లాలోని నాలుగు మౌంటెయిన్ పాస్‌లను కూడా మ్యాప్‌లో చూపించారు. ఈ ప్రాంతాలన్నీ మిలిటరీ మ్యాపుల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులో వీటిని స్పష్టంగా చూపించడమంటే చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చినట్టేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. మ్యాపులో చూపించిన పలు ప్రాంతాల్లో చైనా, భారత్ దళాల మధ్య ఘర్షణలు జరిగాయి.
అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్ అని పిలిచే చైనా ఆ రాష్ట్రంలోని 23 ప్రాంతాలకు కొత్త పేర్లను ఖరారు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ చర్యలతో క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు ఉండవని చైనాకు భారత్ అప్పట్లోనే గట్టి కౌంటర్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో భాగంగానే ఉంటుందని స్పష్టం చేసింది. చైనా, భారత్‌ల మధ్య సరిహద్దు రేఖ మెక్‌మెహన్ లైన్ టిబెట్, అరుణాచల్ ప్రదేశ్‌ను వేరు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి..
డూప్లెక్స్ ఇంట్లో బయటపడ్డ మహిళ అస్థిపంజరం..