భారత్ వైపు 40 ఇంధన నౌకలు
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:30 AM
కొంతకాలంగా మూసుకుపోయిన హోర్ముజ్ జలసంధి నుంచి ఎట్టకేలకు నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ఆ జలసంధి దాటి భారత్‌కు ....
హోర్ముజ్ జలసంధి దాటడానికి సిద్ధం.. యూరియా, డీఏపీ నౌకలు కూడా రెడీ
న్యూఢిల్లీ, జూన్ 20: కొంతకాలంగా మూసుకుపోయిన హోర్ముజ్ జలసంధి నుంచి ఎట్టకేలకు నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ఆ జలసంధి దాటి భారత్‌కు రావడానికి 40 నౌకలు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆ రవాణా నౌకల్లో భారత్‌కు వెంటనే కావాల్సినది.. కోట్లాది కుటుంబాల వంటకు అవసరమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ). హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో భారత్ ఎల్పీజీ దిగుమతిపై భారీ ప్రభావం పడింది. యుద్ధం ముందునాటి కంటే 51శాతం దిగువకు దిగుమతులు పడిపోయాయి. క్రూడ్ ఆయిల్ దిగుమతిని ఎలాగోలా సర్దుబాటు చేసుకున్నా, ఎల్పీజీ విషయంలో మాత్రం గట్టిదెబ్బ పడింది. ఎందుకంటే ఈ వాణిజ్యం ప్రత్యేకమైన ట్యాంకర్లు, పరిమిత సంఖ్యలోని సరఫరాదార్లపై ఆధారపడి ఉంటుంది. నౌకల్లోకి ఎల్పీజీ నింపండం ఆలస్యమైనా, సాధ్యం కాకపోయినా మన దేశానికి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. గల్ఫ్‌లోని ఎగుమతి టర్మినళ్లు సాధారణ పరిస్థితులకు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవీకృత సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) ఎగుమతులు కూడా త్వరలో కోలుకునే అవకాశం ఉంది. మరోవైపు, హోర్ముజ్ జలసంధిని దాటడానికి 80 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుతో ఇంధన రవాణా నౌకలు సిద్ధంగా ఉన్నాయని బ్లూమ్‌బెర్గ్ తాజాగా పేర్కొంది. 40 ట్యాంకర్లలో ఆ ముడి చమురు నింపి ఉందని, వాటిలో 21 నౌకలు ఆసియాకు రానున్నాయని వెల్లడించింది.
ఎరువుల రవాణాకు సిద్ధం
ఈ సీజన్‌కు చాలినంత ఎరువులు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం ఇటీవల చెప్పింది. జూన్ 14 నాటికి 196.65 లక్షల టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయని తెలిపింది. హోర్ముజ్ జలసంధి నుంచి 12 నౌకలు ఎరువుల రవాణాకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. వీటిలో 3.3 లక్షల టన్నుల యూరియా, 2.57 లక్షల టన్నుల డీఏపీ ఉందని పేర్కొంది. మార్చి 1నుంచి భారతీయ కంపెనీలు 50 లక్షల టన్నుల ఎరువులు దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకున్నాయని, ఇప్పటికే 21.95 లక్షల టన్నుల యూరియా, 4.18 లక్షల డీఏపీ దేశానికి చేరుకుందని వెల్లడించింది.