Share News

ఈ22, ఈ25, ఈ27, ఈ30 రకాల పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం పూర్తిగా ఎత్తివేత

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:35 AM

ముడిచమురు దిగుమతులను భారీగా తగ్గించుకోవడానికి మిశ్రమ ఇంధనాన్ని (ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌) ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా మరోకీలక నిర్ణయం తీసుకుంది...

ఈ22, ఈ25, ఈ27, ఈ30 రకాల పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం పూర్తిగా ఎత్తివేత

  • కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ, జూన్‌ 11: ముడిచమురు దిగుమతులను భారీగా తగ్గించుకోవడానికి మిశ్రమ ఇంధనాన్ని (ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌) ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా మరోకీలక నిర్ణయం తీసుకుంది. ఈ22 (అంటే లీటర్‌ పెట్రోల్‌లో 22ు ఇథనాల్‌ మిశ్రమం), ఈ25, ఈ27, ఈ30 రకాల పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నది ఈ20 పెట్రోల్‌ మాత్రమే. మెజారిటీ వాహనాలు ఈ20, ఈ10తో నడిచేవే. ఇటీవలికాలం లో ఆటోమొబైల్‌ కంపెనీలు ఈ20 నుంచి ఈ85, ఈ100 పెట్రోల్‌తో సైతం నడిచే ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ వాహనాలను తయారుచేస్తున్నాయిగానీ అవి ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. మార్కెట్లో విస్తృతంగా లేవు కూడా. అలాగే.. ఈ22, ఈ25, ఈ27, ఈ30 రకాల పెట్రోల్‌ కూడా దాదాపుగా ఎక్కడా అందుబాటులో లేదు. ఇటీవలే మారుతీ సుజుకీ కంపెనీ తయారుచేసిన ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ వ్యాగన్‌ ఆర్‌ కారును ఆవిష్కరించిన కేంద్ర మంత్రి గడ్కరీ.. ముంబై, పుణె, నాగపూర్‌ నగరాల్లో, ఢిల్లీ ఎన్సీఆర్‌ ప్రాంతంలో 50 నుంచి 100 దాకా ఇథనాల్‌ ఫ్యూయెల్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి ఈ మినహాయింపు వల్ల ప్రస్తుతానికి వాహన వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ, ఇకపై వాహనాలు కొనేవారు ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ వాహనాలను కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 05:36 AM