Share News

ఒమన్‌ నుంచి భారత్‌కు..సముద్రం అడుగున పైప్‌లైన్‌

ABN , Publish Date - May 15 , 2026 | 04:00 AM

హోర్ముజ్‌ జలసంధి మూసివేతతో చమురు, సహజవాయువు, ఎల్పీజీ సరఫరాలు నిలిచిపోయి చాలా దేశాలు అల్లాడుతున్నాయి.

ఒమన్‌ నుంచి భారత్‌కు..సముద్రం అడుగున పైప్‌లైన్‌

  • సహజవాయువు, ఎల్పీజీ సరఫరా కోసం నిర్మాణానికి ప్రతిపాదన

  • గతంలోనే ప్రాథమిక పరిశీలన పూర్తి

  • సంక్షోభం నేపథ్యంలో మళ్లీ తెరపైకి!

  • రూ.40 వేల కోట్లతో 2 వేల కిలోమీటర్ల పైప్‌లైన్‌

న్యూఢిల్లీ, మే 14: హోర్ముజ్‌ జలసంధి మూసివేతతో చమురు, సహజవాయువు, ఎల్పీజీ సరఫరాలు నిలిచిపోయి చాలా దేశాలు అల్లాడుతున్నాయి. మన దేశంపైనా ప్రభావం తీవ్రంగానే ఉంది. ఈ క్రమంలోనే భవిష్యత్తులో ఇలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనగలిగేలా.. గల్ఫ్‌లోని ఒమన్‌ నుంచి యూఏఈ మీదుగా భారత్‌లోని గుజరాత్‌ వరకు సముద్రగర్భంలో భారీ పైప్‌లైన్‌ నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. గల్ఫ్‌ నుంచి సహజవాయువు, ఎల్పీజీ సరఫరా కోసమని గతంలోనే ఈ ప్రతిపాదన చేశారు. ‘మిడిల్‌ఈ్‌స్ట-ఇండియా డీప్‌ వాటర్‌ పైప్‌లైన్‌ (ఎంఈఐడీపీ)’ ప్రాజెక్టు పేరిట సౌత్‌ ఆసియా గ్యాస్‌ ఎంటర్‌ప్రైజ్‌ (సీఏజీఈ) ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక సాధ్యాసాధ్యాల పరిశీలన కూడా పూర్తయింది. సుమారు 3వేల మీటర్ల మేర పైప్‌లైన్‌ను ప్రయోగాత్మకంగా నిర్మించి.. సముద్రగర్భంలో పరిస్థితులను అధ్యయనం చేశారు. అయితే భారీ వ్యయం, సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో ప్రాజెక్టుపై అడుగులు ముందుకు పడలేదు. కానీ ఇరాన్‌పై అమెరికా యుద్ధం, హోర్ముజ్‌ మూసివేతతో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ఈ పైప్‌లైన్‌ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. సీఏజీఈ సంస్థ పరిశీలన ఆధారంగా పూర్తిస్థాయి అధ్యయనం చేసి ‘సవివర సాధ్యాసాధ్యాల నివేదిక (డీఎఫ్ఆర్‌)’ ఇవ్వాలని గెయిల్‌, ఇంజనీర్స్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పైప్‌లైన్‌ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే.. ఒమన్‌తోపాటు యూఏఈ, సౌదీ, ఖతార్‌ల నుంచి నిరంతరాయంగా సహజవాయువు, ఎల్పీజీ సరఫరాకు వీలు కలుగుతుంది. భారత్‌కు ఇంధన భద్రత చేకూరుతుంది. ఇది ప్రపంచంలోనే సాంకేతికంగా తీవ్రమైన సవాళ్లతో కూడిన ప్రాజెక్టుగా నిలవనుంది.


సముద్రగర్భ పైప్‌లైన్‌ ప్రాజెక్టు స్వరూపమిదీ..

పైప్‌లైన్‌ పొడవు: దాదాపు 2,000 కిలోమీటర్లు

గరిష్ఠంగా సముద్రం లోతు: సుమారు 3,450 మీటర్లు

గ్యాస్‌ సరఫరా సామర్థ్యం: రోజుకు 3.1 కోట్ల క్యూబిక్‌ మీటర్లు

ప్రాజెక్టు అంచనా వ్యయం: సుమారు రూ.40 వేల కోట్లు

నిర్మాణానికి పట్టే సమయం: దాదాపు ఐదు నుంచి ఏడేళ్లు

Updated Date - May 15 , 2026 | 04:01 AM