హెచ్-1బీ వీసాలు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్య
ABN , Publish Date - Feb 07 , 2026 | 10:09 PM
ఐటీ రంగం అభివృద్ధి కోసం హెచ్-1బీ వీసాలపై ఆధారపడాల్సిన అవసరం భారత్‌కు ఇక ఎంతమాత్రం లేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా వ్యాఖ్యానించారు
ఇంటర్నెట్ డెస్క్: ఐటీ రంగం అభివృద్ధి కోసం హెచ్-1బీ వీసాలపై ఆధారపడాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం లేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా వ్యాఖ్యానించారు. గ్లోబల్ మార్కెట్స్‌లో భారత ఐటీ సంస్థల కార్యకలాపాల్లో చాలా మార్పు వచ్చాయని అన్నారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ వీసాలపై అమెరికా నుంచి ఏమైనా హామీలు వచ్చాయా? అన్న మీడియా ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.
వీసాల అవసరం క్రమంగా తగ్గుతూ వస్తోందని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. కరోనా సంక్షోభానికి ముందే ఈ ఒరవడి ప్రారంభమైందని చెప్పారు. హెచ్-1బీ వీసా లాటరీ కారణంగా పలు సంస్థలు స్వల్ప సంఖ్యలో ఉన్న వీసాల కోసం అధికంగా దరఖాస్తులను సమర్పించాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కొవిడ్ తరువాత ప్రపంచం ఎంతో మారిపోయిందని, నాటి రోజులు ఎప్పుడో పోయాయని వ్యాఖ్యానించారు.
హెచ్-1బీ వీసా అంశంపై అమెరికాతో చర్చించాలని తనను ఏ కంపెనీ కరోనా సంక్షోభం తరువాత అభ్యర్థించలేదని మంత్రి తెలిపారు. ఒకప్పుడు అమెరికాలో ఆన్‌సైట్‌లో చేసిన పనిని భారత్ నుంచే రిమోట్‌గా చేయొచ్చన్న విషయాన్ని కంపెనీలు గుర్తించాయని అన్నారు. అమెరికాలో హెచ్-1బీ వీసా ఉద్యోగులకు సంస్థలు భారీగా జీతాలు చెల్లించాల్సి వచ్చేదని కూడా అన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) పనుల ఔట్‌సోర్సింగ్‌తో అటు కంపెనీలకు ఇటు భారత ఆర్థిక వ్యవస్థకు లాభం కలుగుతుందని చెప్పారు. భారత్‌లో ప్రస్తుతం 1800 పైచిలుకు జీసీసీలు ఉన్నాయని అన్నారు. వీటితో ఉద్యోగాలు, ప్రభుత్వానికి పన్ను ఆదాయం లభిస్తోందని అన్నారు. ఉద్యోగులు తమ కుటుంబాలకు దగ్గరగా ఉండగలుగుతున్నారని అన్నారు. గ్లోబల్ సంస్థల లాభదాయకత కూడా పెరుగుతోందని చెప్పారు.
ఈ వార్తలూ చదవండి:
లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..
భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్