Share News

భారత్‌.. మృత ఆర్థిక వ్యవస్థ కాదు

ABN , Publish Date - Jul 30 , 2026 | 05:11 AM

ఏ కోణంలో చూసినా భారత దేశం డెడ్‌ ఎకానమీ (మృత ఆర్థిక వ్యవస్థ) కాదని.. రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లి అలా అనడం మనను అవమానించడమేనని ప్రధానమంత్రి ఆర్థిక సలహా...

భారత్‌..  మృత ఆర్థిక వ్యవస్థ కాదు

  • రాహుల్‌ విదేశాలకు వెళ్లి అలా అనడం సరికాదు

  • ఉత్పాదకత లేని ఉచితాలతో ఆర్థిక వ్యవస్థకు దెబ్బ

  • రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌ సిటీ.. సరైన నిర్ణయమే

  • అప్పుల ఊబి నుంచి రాష్ట్రం బయటపడాలి

  • అమరావతి నిర్మాణంతో బహుళ ప్రయోజనాలు

ఆంధ్రజ్యోతితో ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ మహేంద్రదేవ్‌

న్యూఢిల్లీ, జులై 29 (ఆంధ్రజ్యోతి): ఏ కోణంలో చూసినా భారత దేశం డెడ్‌ ఎకానమీ (మృత ఆర్థిక వ్యవస్థ) కాదని.. రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లి అలా అనడం మనను అవమానించడమేనని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ సూర్యదేవర మహేంద్ర దేవ్‌ అన్నారు. మన దేశం 7.7 శాతం జీడీపి వృద్ధి రేటును సాధిస్తూ ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిందని ఆయన గుర్తుచేశారు. దేశంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకే ప్రధాని మోదీ ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ పిలుపునిచ్చారని.. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్టు సరైన నిర్ణయమన్న మహేంద్రదేవ్‌.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా పలు విషయాలపై ఆయన ఈ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు తెలిపారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

  • నెహ్రూ హయాం నుంచే మన దేశంలో ఆర్థిక అభివృద్ధి వేగం పట్టాలు తప్పింది. ఆర్థిక సంస్కరణలు కూడా 15 సంవత్సరాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. వాజపేయి హయాం నుంచి అభివృద్ధి వేగం పుంజుకుంది. ఎన్ని అవాంతరాలున్నా.. మోదీ హయాంలో అది కొనసాగుతోంది. నెహ్రూ హయాం నుంచి నాలుగు ద శాబ్దాల పాటు మన అభివృద్ధి రేటు 3.5 శాతం మాత్రమే. అప్పట్లో కార్మిక ఆధారిత ఉత్పాదక రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రాథమిక ఆరోగ్యం, ప్రాథమిక విద్యను కూడా పట్టించుకోలేదు. చైనా, తూర్పు ఆసియా దేశాలు ఆరోగ్యం, విద్యపై 60లలోనే పెట్టుబడులు పెంచాయి. కానీ, మనం నిర్లక్ష్యం చేశాం. అనేక దేశాలు 70వ దశకంలో సంస్కరణలు అమలు చేస్తే మనం పీవీ నరసింహారావు పుణ్యమాని 90లలో అమలు చేశాం. అందుకే మన తలసరి అదాయం ఇంకా తక్కువగానే ఉంది. ఇప్పుడు 7-8 శాతం అభివృద్ధి రేటు సాధించగలుగుతున్నాంగానీ.. ఇంకా వేగంగా పరుగెత్తాల్సి ఉంది.

  • దేశంలో ఆర్థిక వృద్ధి జరుగుతోందని చెప్పడానికి.. పెట్టుబడులు, ఎగుమతుల శాతం పెరగడమే నిదర్శనం. ప్రస్తుతం పెట్టుబడుల రేటు 32శాతంగా ఉంది. దేశం 7 నుంచి 8ు ఆర్థిక వృద్ధిని సాధించాలంటే పెట్టుబడుల రేటు 34-35 శాతానికి పెరగాలి. కొవిడ్‌, ఉక్రెయిన్‌ యుద్ధం, సుంకాల బాదుడు, గల్ఫ్‌ సంక్షోభం ఇలాంటివెన్నో మన అభివృద్ధి వేగానికి కళ్లెం వేస్తున్నాయి. చమురుపై కూడా మనం 80 శాతం ఎగుమతులపై ఆధారపడుతున్నందువల్ల దాని ప్రభావం కూడా ఆర్థిక వ్యవస్థపై ఉంది.


  • మన దేశంలో తయారీ రంగం జీడీపీలో ఇంకా 17 శాతం వద్దే నిలిచిపోయింది. దీన్ని పెంచితే తప్ప సమస్యలు పరిష్కారం కావు. అంతేకాదు.. కార్మిక, ఉద్యోగ శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రస్తుతం ఉన్న 35 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి.

  • మోదీ సర్కారు ప్రస్తుతం మౌలిక సదుపాయాలపై విస్తృతంగా ఖర్చు చేస్తోంది. దీంతో పాటు ప్రైవేటు పెట్టుబడులనూ పెంచాల్సి ఉంది. ప్రధాని మోదీ తయారీ (మాన్యుఫ్యాక్చరింగ్‌) రంగంపై ఎక్కువగా దృష్టి సారించారు. సెమీకండక్టర్లు, రేర్‌ ఎర్త్‌, చిప్స్‌ తదితర రంగాల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మోదీ వచ్చాకే దేశంలో వ్యాపార నిర్వహణ సులభతరమైంది. అలా సులభతరం చేసేందుకకే.. కాలం చెల్లిన చట్టాలను రద్దుచేశారు. కానీ రాష్ట్రాల స్థాయిలో జరగాల్సినంత జరగడం లేదు.

  • తెలంగాణ సీఎం రేవంత్‌ ఫ్యూచర్‌ సిటీ పేరిట హైదరాబాద్‌ను విస్తరించడం విస్తృత అభివృద్ధి వ్యూహంలో భాగమే. దీని వల్ల తెలంగాణలో పలు జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. అయితే.. తెలంగాణ కూడా అప్పుల వలలో ఉంది. దాన్నుంచి బయటపడాల్సి ఉంది.

  • కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఒక పెద్ద రాజధాని నగరం అవసరం. వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన అర్థం లేనిది. హైదరాబాద్‌ ఒక పెద్ద నగరంగా మారినందునే 67ు పన్నులు ఆ నగరం నుంచి వస్తున్నాయి. అదే కోవలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అభివృద్ధి చెందితే ప్రయోజనాలుంటాయి. దాని ప్రభావం చుట్టుప్రక్కల ఉన్న గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ పై కూడా విస్తృతంగా పడుతుంది. అందుకే కేంద్రం అమరావతి నిర్మాణానికి తోడ్పడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కలిసికట్టుగా అభివృద్ధి వ్యూహాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.

  • దేశంలో ప్రభుత్వోద్యోగాలు మొత్తం ఉపాధిలో కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే ఉంటాయి. మిగిలిన 80ు శాతం ఉపాధి.. వ్యవసాయం, ప్రైవేటు, తయారీ, సేవా రంగాలనుంచి లభించేందుకు కేంద్రం విస్తృత చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాలు కూడా అదే దిశలో పనిచేయాలి. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వానికి మధ్య నిరంతర సమన్వయం ఉంటేనే సరైన పనులకు సరైన ఉద్యోగాల కల్పన జరుగుతుంది. విద్యావ్యవస్థను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా, నైపుణ్యాధారిత విద్యావిధానంగా మార్చాలి.

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు పెరుగుతున్నాయని ఆందోళన చెందడంలో అర్థం లేదు. అప్పుల్ని కేవలం సంఖ్య రూపంలోనే కాకుండా జీడీపీలో వాటి నిష్పత్తి ఎంతో చూడాలి. ఈ క్రమంలోనే.. కేంద్ర ప్రభుత్వం తన రుణభారాన్ని జీడీపీలో 50 శాతానికి తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రాలు కూడా సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పథకాలకూ మధ్య సమతౌల్యం పాటించాలి.


  • జనాభా మనకు వరం లాంటిది. మన జనాభా సగటు వయసు 28. విద్య, నైపుణ్యాల కల్పన ద్వారా దీన్ని మనకు ప్రయోజనంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే.. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఉత్పాదకరంగాల్లో కృత్రిమ మేధను ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

  • వ్యవసాయం నుంచి ఉత్పాదక రంగానికి నిర్మాణాత్మక పరివర్తన జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు నెలకొల్పాలి. ఈ నిర్మాణాత్మక పరివర్తన అన్ని దేశాల్లో జరిగింది. మన దేశంలో కూడా క్రమంగా జరుగుతోంది.

సంజీవ్‌దేవ్‌ కుమారుడు

ప్రముఖ తత్వవేత్త, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందినసంజీవ్‌ దేవ్‌ కుమారుడైన మహేంద్రదేవ్‌.. గుంటూరు జిల్లాలోని తుమ్మపూడిలో జన్మించారు. ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ, ఏల్స్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ డాక్టొరల్‌ పరిశోధన చేశారు. రిజర్వు బ్యాంకు ఏర్పాటుచేసిన ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవల్‌పమెంట్‌ రిసెర్చ్‌ (ఐజీఐడీఆర్‌) డైరెక్టర్‌, వైస్‌ చాన్స్‌లర్‌గా, కమిషన్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ కాస్ట్స్‌ అండ్‌ ప్రైసెస్‌ చైర్మన్‌గా, హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ డైరెక్టర్‌గా.. ఇలా ఎన్నో కీలక పదవులు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 05:11 AM