రెండు స్థానాల దిగువకు ఆర్థిక వ్యవస్థ
ABN , Publish Date - Apr 18 , 2026 | 06:31 AM
అమెరికా-ఇరాన్ యుద్ధం దెబ్బ ప్రభావం భారత్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని కోల్పోయింది. ఏకంగా రెండు మెట్లు దిగి...
గతేడాది జపాన్‌ను దాటేసి 4వ ర్యాంకుకు భారత్..
తాజాగా జపాన్, బ్రిటన్ల వెనుక 6వ స్థానం
డాలర్ మారకంలో రూపాయి పతనమే కారణం.. అమెరికా-ఇరాన్ యుద్ధంతోనే ఈ పరిస్థితి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: అమెరికా-ఇరాన్ యుద్ధం దెబ్బ ప్రభావం భారత్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని కోల్పోయింది. ఏకంగా రెండు మెట్లు దిగి ఆరో స్థానానికి దిగజారింది. ఉత్పత్తి భారీగా ఏమీ పెరక్కపోయినా డాలర్‌తో పోలిస్తే వాటి కరెన్సీ పతనం కాకపోవడం వల్ల జపాన్, బ్రిటన్‌లు భారత్‌ను దాటేసి నాలుగైదు స్థానాల్లో కూర్చున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి తాజా అంచనాల ప్రకారం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, బ్రిటన్‌లు తొలి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా నిలిచాయి.
ఐఎంఎఫ్ అనుబంధ సంస్థ వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ 2026 లెక్కల ప్రకారం భారత్ జీడీపీ 3.92 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.15 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. బ్రిటన్ జీడీపీ 4.27 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. జపాన్ జీడీపీ 4.48 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.38 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. 2022 సెప్టెంబరులో భారత్ బ్రిటన్‌ను దాటేసి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అప్పట్లో మూడో స్థానంలో ఉన్న జపాన్‌ను, 4వ స్థానంలో ఉన్న జర్మనీని కూడా భారత్ దాటేస్తుందని, 2029 కల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. మధ్యలో ఊహించని పరిణామాలు జరిగాయి. జపాన్‌ను జర్మనీ దాటేసింది. గత ఏడాది మే నెలలో నీతీ ఆయోగ్ సీఈవో బీవీర్ సుబ్రహ్మణ్యం భారత్ జపాన్‌ను దాటేసి నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రకటించారు. ఇప్పుడు ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం భారత్‌ను వెనక్కినెట్టి జపాన్, బ్రిటన్‌లు నాలుగు, ఐదు స్థానాలను ఆక్రమించాయి. భారత్ ఆర్థిక ప్రస్థానం కుంటుపడటం దీనికి కారణం కాదు. ప్రభుత్వం జీడీపీ అంచనాలను సవరించడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కారణం.
అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు భారీగా పెరగడంతో అచ్చంగా చమురు దిగుమతులపై ఆధారపడ్డ భారత్ భారీ ఎత్తున డాలర్ల కొనుగోలు చేయాల్సి రావడంతో ఇటీవలికాలంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీగా పతనమైంది. దారి ప్రభావంతో డాలర్ల లెక్కల్లో భారత్ జీడీపీ అమాంతం పతనమైంది. నాలుగో స్థానాన్ని కోల్పోయింది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం అమెరికా(30 ట్రిలియన్ డాలర్లు), చైనా(19 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ(5 ట్రిలియన్ డాలర్లు) మొదటి మూడు స్థానాల్లో సుస్థిరంగా ఉన్నాయి. జపాన్(4.38 ట్రిలియన్ డాలర్లు), బ్రిటన్(4.27 ట్రిలియన్ డాలర్లు), ఇండియా(4.15 ట్రిలియన్ డాలర్ల)తో చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి. డాలర్ మారకంలో రూపాయి స్థిరపడితే భారత్ నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం పెద్ద విషయం కాదని, వచ్చే సంవత్సరం యథాస్థానానికి చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..