Share News

ఎఫ్‌సీఆర్ఏ చట్ట సవరణపై యూఎస్ ప్రజాప్రతినిధి అభ్యంతరం.. స్పందించిన భారత్

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:28 PM

విదేశీ నిధుల నియంత్రణకు ఉద్దేశించిన ఎఫ్‌సీఆర్ఏ చట్టానికి భారత్ చేయనున్న సవరణలపై అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రైలీ మూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.

ఎఫ్‌సీఆర్ఏ చట్ట సవరణపై యూఎస్ ప్రజాప్రతినిధి అభ్యంతరం.. స్పందించిన భారత్
MEA On proposed Amendments to FCRA

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ నిధుల నియంత్రణకు ఉద్దేశించిన ఎఫ్‌సీఆర్ఏ చట్టానికి భారత్ చేయనున్న సవరణలపై అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రైలీ మూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. చట్టాలు, వాటి సవరణలు తమ అంతర్గత విషయాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా సహా అనేక దేశాల్లో ఇలాంటి చట్టాలు ఉన్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ప్రజాస్వామిక పద్ధతుల్లో భారత్ చట్టాల రూపకల్పన చేస్తుందని చెప్పారు. దేశీయ చట్టాలకు వాటికంటూ ప్రత్యేక నేపథ్యం ఉంటుందని చెప్పారు. ఈ దృష్టికోణంలోనే చట్టాలను విశ్లేషించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.


ప్రతిపాదిత సవరణలపై రైలీ మూర్ ఇటీవల స్పందిస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సవరణలు చట్ట రూపం దాలిస్తే యూఎస్-భారత్ ద్వైపాక్షిక బంధాలు దెబ్బతింటాయని అన్నారు. ఈ సవరణలతో మతపరమైన చారిటీ సంస్థలను భారత్ నియంత్రించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ చట్టంతో క్రిస్టియన్ సంస్థలపైనే అధిక ప్రభావం పడేలా ఉందని అన్నారు. క్రిస్టియన్‌లను టార్గెట్ చేసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని కూడా వ్యాఖ్యానించారు. అయితే, విదేశీ నిధులతో దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత, ప్రజాప్రయోజనాలు, ప్రజాస్వామిక సంస్థలపై ప్రతికూల ప్రభావం పడకుండా భారత్ ఎఫ్‌సీఆర్ఏ చట్టాన్ని గతంలో తీసుకొచ్చింది. ఇక విదేశీ నిధులతో నడిచే సంస్థల కార్యకలాపాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం, మెరుగైన నిర్వహణ కోసమే తాజా మార్పులను ప్రతిపాదిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి.


ఈ వార్తలనూ చదవండి:

వరుసగా మూడో రోజూ పెరిగిన గోల్డ్ రేట్స్

కేకేఆర్‌ చేతికి మెడికవర్‌ హాస్పిటల్స్‌

Updated Date - Aug 07 , 2026 | 05:36 PM