Share News

కేకేఆర్‌ చేతికి మెడికవర్‌ హాస్పిటల్స్‌

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:06 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే మరో హాస్పిటల్‌ చెయిన్‌ యాజమాన్యం చేతులు మారుతోంది. మెడికవర్‌ పేరుతో పశ్చిమ, దక్షిణ భారత్‌లో 24 హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న మెడికవర్‌ హాస్పిటల్స్‌ ఇండియా...

కేకేఆర్‌ చేతికి మెడికవర్‌ హాస్పిటల్స్‌

డీల్‌ విలువ రూ.13,200 కోట్లు

హెల్త్‌కేర్‌ రంగంలో అతిపెద్ద డీల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే మరో హాస్పిటల్‌ చెయిన్‌ యాజమాన్యం చేతులు మారుతోంది. మెడికవర్‌ పేరుతో పశ్చిమ, దక్షిణ భారత్‌లో 24 హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న మెడికవర్‌ హాస్పిటల్స్‌ ఇండియా (ఎంహెచ్‌ఐ)ను అమెరికా ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థ కేకేఆర్‌ 120 కోట్ల యూరోలకు (సుమారు రూ.13,200 కోట్లు) కొనుగోలు చేసింది. భారత హెల్త్‌కేర్‌ రంగంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద కొనుగోలుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఎంహెచ్‌ఐ ఈక్విటీలో స్వీడన్‌ కేంద్రంగా పనిచేసే మెడికవర్‌ ఏబీ కంపెనీకి 66.1 శాతం, ఇతర మైనారిటీ వాటాదారులకు 33.9 శాతం వాటా ఉంది. ఈ మొత్తాన్ని 120 కోట్ల యూరోలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు కేకేఆర్‌ ప్రకటించింది. ఇందులో 74 కోట్ల యూరోలు (సుమారు రూ.8,140 కోట్లు) మెడికవర్‌ ఏబీకి, మిగతా మొత్తం మైనారిటీ వాటాదారులకు అందనుంది. పోలండ్‌, రొమేనియా, జర్మనీల్లోని తన హాస్పిటల్స్‌ విస్తరణకు మెడికవర్‌ ఏబీ ఈ నిధులను వినియోగించనుంది. అన్ని అవకాశాలను పరిశీలించిన తర్వాత భారత వ్యాపారం నుంచి సరైన సమయంలో తప్పుకుంటున్నట్లు మెడికవర్‌ సీఈఓ జాన్‌ స్టబింగ్‌టన్‌ తెలిపారు. కేకేఆర్‌ నేతృత్వంలో భారత హెల్త్‌కేర్‌ రంగం సరికొత్త దశలోకి ప్రవేశిస్తుందన్నారు.

ఎందుకంటే: భారత హెల్త్‌కేర్‌ రంగ దీర్ఘకాలిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేకేఆర్‌.. మెడికవర్‌ ఇండియాను కొనుగోలు చేసిందని భావిస్తున్నారు. దేశంలో ప్రజల ఆదాయంతో పాటు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో అత్యాధునిక వైద్య పరికరాలు, నైపుణ్యాలతో వైద్య సేవలు అందించే హాస్పిటల్స్‌కు గిరాకీ పెరుగుతోంది. మరోవైపు ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్యా పెరుగుతోంది. దీంతో కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కు గిరాకీ మరింత పెరిగింది. ఈ అవకాశాలను దృష్టిలో ఉంచుకునే కేకేఆర్‌ భారత హెల్త్‌కేర్‌ రంగంలో పట్టు పెంచుకుంటోంది. అన్ని అనుమతులు లభిస్తే ఈ ఏడాది చివరికి మెడికవర్‌ హాస్పిటల్స్‌.. కేకేఆర్‌ నిర్వహణలోకి వస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా మెడికవర్‌ హాస్పిటల్స్‌ పడకల సంఖ్యను 10,000 పెంచాలని కేకేఆర్‌ భావిస్తోంది.


ఇప్పటికే నాలుగు హాస్పిటల్స్‌లో వాటాలు: పీఈ సంస్థ కేకేఆర్‌ భారత్‌లో హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయడం ఇదేం కొత్త కాదు. 2024లోనే కేరళలోని బేబీ మెమోరియల్‌ హాస్పిటల్‌ ఈక్విటీలో 70 నుంచి 75 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.2,100 కోట్ల నుంచి రూ.2,500 కోట్ల వరకు చెల్లించింది. తర్వాత మిత్రా హాస్పిటల్‌, స్టార్‌ హాస్పిటల్స్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడు తాజాగా మెడికవర్‌ ఇండియా కొనుగోలుతో భారత వైద్య రంగంలో కేకేఆర్‌ పట్టు మరింత పెరగనుంది.

మెడికవర్‌ ఇండియా ప్రత్యేకతలు: 2017లో ఏర్పాటైన మెడికవర్‌ ఇండియా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 4,800 పడకలతో 24 హాస్పిటల్స్‌ నిర్వహిస్తోంది. ఇందులో ఎక్కువ హాస్పిటల్స్‌ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే ఉన్నాయి. ఈ హాస్పిటల్స్‌లో పనిచేసే దాదాపు 1,900 మంది వైద్యులు.. 80 రకాల రోగాలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు.

డిసెంబరు నాటికి డీల్‌ పూర్తి

మెడికవర్‌ కొనుగోలు ప్రక్రియ ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుందని మెడికవర్‌ హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీ హరికృష్ణ తెలిపారు. కేకేఆర్‌ చేతుల్లోకి మెడికవర్‌ హాస్పిటల్స్‌ వెళ్లినా.. విస్తరణ ప్రణాళికలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ వాటాదారుల్లో సీఎండీ అనిల్‌ కృష్ణతో పాటు డాక్టర్లు, ఇతర ఇన్వెస్టర్లు, సీనియర్‌ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. కాగా మైనారిటీ వాటాదారులు మూడేళ్ల పాటు యధావిధిగా కొనసాగుతారని హరికృష్ణ వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..

చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు

Updated Date - Aug 07 , 2026 | 05:06 AM