Share News

గత రెండేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్ని రద్దు చేయాలి!

ABN , Publish Date - Oct 10 , 2026 | 03:00 AM

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో వరుసగా మూడు రోజులు ఢిల్లీలో ఉద్యమించిన ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఎన్నికల్లో ఓట్ల చోరీ జరుగుతోందని, దానిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు

గత రెండేళ్లలో జరిగిన అన్ని   అసెంబ్లీ ఎన్నికల్ని రద్దు చేయాలి!
rahul and others

president-representation.jpg

  • ఓట్ల చోరీ జరిగిందనటానికి పూర్తి ఆధారాలున్నాయి

  • ఇకపై ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లతో నిర్వహించాలి

  • ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి, జ్ఞానేశ్‌ను తొలగించాలి

  • రాష్ట్రపతి ముర్ముకు ఇండియా కూటమి నేతల వినతి

న్యూఢిల్లీ, అక్టోబరు 9: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో వరుసగా మూడు రోజులు ఢిల్లీలో ఉద్యమించిన ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఎన్నికల్లో ఓట్ల చోరీ జరుగుతోందని, దానిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. జ్ఞానేశ్‌కుమార్‌ను సీఈసీ పదవి నుంచి తొలగించాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలని, గత రెండేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని, ఈవీఎంలను పక్కనపెట్టి ఇకపై బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంటూ ఒక విజ్ఞాపనపత్రం అందజేశారు. ఇండియా కూటమి ఎంపీలు దేశంలోని 60 శాతం జనాభాకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రపతిని కలవటానికి ముందు ఇండియా కూటమి ఎంపీలు ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అని రాసి ఉన్న భారీ బ్యానర్‌ను ప్రదర్శిస్తూ పార్లమెంటు హౌస్‌ నుంచి విజయ్‌చౌక్‌ వరకూ ర్యాలీ జరిపారు. విజయ్‌చౌక్‌ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం, రాష్ట్రపతి భవన్‌ నుంచి పిలుపు రావటంతో ఇండియా కూటమి నేతల బృందం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లింది. ఈ బృందంలో రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గే(కాంగ్రెస్‌), మమతా బెనర్జీ (తృణమూల్‌), ఒమర్‌ అబ్దుల్లా (ఎన్‌సీ), సుప్రియాసూలే (ఎన్సీపీ-పవార్‌), రాజీవ్‌రాయ్‌ (ఎస్పీ), మనోజ్‌ఝా (ఆర్జేడీ), తిరుమావలన్‌ (వీసీకే), డీ రాజా (సీపీఐ), ఏంఏ బేబి (సీపీఎం) ఉన్నారు. రాష్ట్రపతిని కలిసి విజ్ఞాపనపత్రం అందజేసిన అనంతరం తిరిగి వచ్చి మీడియాతో నేతలు మాట్లాడారు.


మోదీ, అమిత్‌షా, జ్ఞానేశ్‌కుమార్‌ కలిసి భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే కుట్ర పన్నారని రాష్ట్రపతికి తెలియజేశామని రాహుల్‌ పేర్కొన్నారు. ‘మేం చెప్పినదాన్ని రాష్ట్రపతి ఎంతమాత్రం నిరాకరించలేదు. ప్రశ్నించలేదు కూడా. మా ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఇవ్వమని అడిగారు’ అని రాహుల్‌ తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ను సోమవారం కలిసి విజ్ఞాపనపత్రం అందజేస్తామని వెల్లడించారు. ఖర్గే మాట్లాడుతూ, రాష్ట్రపతి అడిగిన ఆధారాల్ని తాము సమర్పిస్తామన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్ని ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌ పేపర్లతో నిర్వహించాలన్నారు.

13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలి

ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతికి సమర్పించిన విజ్ఞాపనపత్రంలో పలు కీలక డిమాండ్లు చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తప్పించాలి, సీఈసీకి, ఎన్నికల మిషనర్లకు న్యాయవిచారణ నుంచి రక్షణ కల్పిస్తున్న 2023 నాటి చట్టాన్ని రద్దు చేయాలి, ఇకపై దేశంలో జరిగే అన్ని ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లతో నిర్వహించాలి, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలి, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లను తిరిగి ఆ జాబితాలో చేర్చాలి, గత రెండేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీల ఎన్నికల్ని రద్దు చేయాలి.. వీటిలో ఓట్ల చోరీ జరిగినట్లుగా స్పష్టమైన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయులకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటు హక్కును హరించటానికి యావత్‌ ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థలను మోదీ, అమిత్‌షా చెరబట్టారని ఆరోపించారు. ‘హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, బిహార్‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికను బీజేపీ దొంగిలించిందని, భారీ ఎత్తున ఓట్లచోరీ జరిగిందనటానికి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఈవీఎంలను, ఓటర్ల జాబితాలను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఈ సంక్షోభ సమయంలో భారత రిపబ్లిక్‌ రాజ్యాంగ అధినేతగా తగిన చర్యలు తీసుకోవాలని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు..


ఉద్యమిస్తే ప్రభుత్వ పతనం ఖాయం: రాహుల్‌

రాష్ట్రపతిని కలవటానికి ముందు ఇండియా కూటమి ఎంపీలు సంవిధాన్‌ సదన్‌లోని సెంట్రల్‌హాల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. దేశంలో జ్ఞానేశ్‌కుమార్‌ను మించిన సమస్య ఉందని, దానిని పరిష్కరించాలంటే ప్రస్తుత ప్రభుత్వాన్నే తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. గత 3-4 రోజులుగా ఉద్యమిస్తున్న విధంగానే విపక్షాలు ముందుకు దూసుకెళ్తే మోదీ ప్రభుత్వం కుప్పకూలటం ఖాయమని చెప్పారు. విపక్షాల ఉద్యమంతో ప్రభుత్వ వణుకుతోందన్నారు. ఇదిలా ఉండగా, దేశంలో ప్రతి వ్యాపారానికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని రాహుల్‌ అన్నారు. క్రోనీ క్యాపిటలిజం(ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం) గొలుసును తెంచుతామని, వ్యాపారులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు

ఈ వార్తలు కూడా చదవండి

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు

సీజేపీ నిరసన.. అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ బంద్

Updated Date - Oct 10 , 2026 | 03:07 AM