Share News

357 అంతర్జాతీయవిమానాల రద్దు

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:18 AM

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో విమాన సర్వీసులకు వరుసగా మూడో రోజు కూడా అంతరాయం ఏర్పడింది.

357 అంతర్జాతీయవిమానాల రద్దు

  • సోమవారం రద్దు చేసిన భారత విమానయాన సంస్థలు

  • మూడు రోజుల్లో 1,117 విదేశీ విమాన సర్వీసుల రద్దు

న్యూఢిల్లీ, శంషాబాద్‌రూరల్‌, చెన్నై, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో విమాన సర్వీసులకు వరుసగా మూడో రోజు కూడా అంతరాయం ఏర్పడింది. భారత విమానయాన సంస్థలు సోమవారం 357 అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశాయి. దేశంలో నాలుగు ప్రధాన విమానాశ్రయాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో ఈ విమానాలు రద్దయ్యాయని అధికారులు తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతంలోని చాలా గగనతలాలు ఇంకా మూసి ఉండటంతో విమానాలను రద్దు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. సోమవారం ఇండిగో 163 విమానాలకు పైగా, ఎయిర్‌ ఇండియా గ్రూప్‌(ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌) 110కుపైగా సర్వీసులను రద్దు చేశాయి. మొత్తంగా భారతీయ విమానయాన సంస్థలు 357 విదేశీ విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ మూడు రోజుల్లో రద్దు చేసిన అంతర్జాతీయ విమానాల సంఖ్య 1,117కు చేరింది. మంగళవారానికి షెడ్యూల్‌ చేసిన పలు విమానాలు కూడా రద్దయ్యాయి. అబుదాబి, దోహా, జెద్దా, కువైత్‌, రియాద్‌లకు మంగళవారం తన విమానాల రాకపోకలను రద్దు చేసినట్టు ‘ఎక్స్‌’లో ఆకాశ ఎయిర్‌ పేర్కొంది. అయితే, అమెరికా, కెనడా, యూరప్‌, యూకేకు తన షెడ్యూల్డ్‌ ఆపరేషన్లను ప్రారంభించినట్టు ఎయిర్‌ ఇండియా పేర్కొంది. ఈ విమానాల కోసం ఒమాన్‌, సౌదీ అరేబియా, ఈజిప్ట్‌ గగనతలాలను వినియోగించుకోనుంది. మంగళవారం మస్కట్‌కు ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలను ప్రారంభించనుంది.


శంషాబాద్‌లో 44 విమానాల రద్దు

పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి దోహా, అబుదాబి, దుబాయ్‌, మస్కట్‌తోపాటు మరికొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సిన 22 విమాన సర్వీసులు, ఆయా ప్రాంతాల నుంచి రావాల్సిన 22 విమాన సర్వీసులు రద్దయ్యాయి. గత రెండు రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి దుబాయ్‌, మస్కట్‌, అబుదాబి, దోహాకు వెళ్లాల్సిన విమానాలను శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి మళ్లించారు. అన్ని విమానాలు ఇక్కడే ఉన్నాయి. యుద్ధం ముగిస్తేగాని విమానాలు ఇక్కడి నుంచి కదలవని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. కాగా కొందరు ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వచ్చి ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో టికెట్‌ తీసుకున్న ప్రయాణికులు ఎయిర్‌లైన్స్‌ అధికారులను సంప్రదించి ఎయిర్‌పోర్టుకు రావాలని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు అధికారులు కోరారు. కాగా శంషాబాద్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన అంతర్జాతీయ విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీరికి హెచ్‌వోఐ స్వచ్చంధ సంస్ధ సోమవారం ఆహారం, నీటి బాటిళ్లు అందించి మానవత్వం చాటుకుంది.

భారత్‌కు విమానాలు వస్తున్నాయ్‌..!

పశ్చిమాసియాలో విమానయాన సంస్థలు పరిమిత స్థాయిలో విమాన సర్వీసులను ప్రారంభించాయి. సోమవారం అబుదాబి నుంచి ఒక విమానం ఢిల్లీలో దిగింది. అలాగే అబుదాబి నుంచి మరో ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ విమానం కూడా ముంబైలో దిగినట్టు తెలుస్తోంది. మంగళవారం యూఏఈలోని ఫుజైరా నుంచి ఢిల్లీకి ప్రత్యేక చార్టర్‌ విమానాలను నడిపించనున్నట్టు ట్రావెల్‌ ప్లాట్‌ఫామ్‌ ఈజ్‌మైట్రిప్‌ పేర్కొంది. సోమవారం సాయంత్రం నుంచే ఎమిరేట్స్‌ పరిమిత స్థాయిలో విమానాలను నడపడం ప్రారంభించనున్నట్టు తెలిసింది. సోమవారం నుంచే పరిమిత సంఖ్యలో విమానాలను నడపనున్నట్టు ఫ్లైదుబాయ్‌ పేర్కొంది. కాగా పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను తీసుకువచ్చేందుకుగాను జెద్దా నుంచి భారత్‌లోని నాలుగు నగరాలకు ఇండిగో 10 ప్రత్యేక సహాయ విమానాలను మంగళవారం నడపనుంది. ఈ నగరాల్లో హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జెద్దాలోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాతో ఇండిగో సమన్వయం చేసుకుంటోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.

Updated Date - Mar 03 , 2026 | 04:18 AM