Share News

కళ్లజోడు.. ఏఐ తోడు

ABN , Publish Date - Feb 18 , 2026 | 06:35 AM

ఏఐ కళ్లజోళ్లు అనగానే అందరికీ గూగుల్‌, మెటా, యాపిల్‌ వంటి అంతర్జాతీయ టెక్‌ దిగ్గజ కంపెనీలు అభివృద్ధి చేస్తున్నవే గుర్తొస్తాయి! కానీ.. మన ఇండియాలోనూ ‘సర్వం ఏఐ’ అనే స్టార్టప్‌ సంస్థ కృత్రిమ మేధ

కళ్లజోడు.. ఏఐ తోడు

  • ఇండియా ఏఐ సమ్మిట్‌లో ధరించిన ప్రధాని మోదీ

  • అభివృద్ధి చేసింది బెంగళూరు స్టార్టప్‌.. ‘సర్వం ఏఐ’

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఏఐ కళ్లజోళ్లు అనగానే అందరికీ గూగుల్‌, మెటా, యాపిల్‌ వంటి అంతర్జాతీయ టెక్‌ దిగ్గజ కంపెనీలు అభివృద్ధి చేస్తున్నవే గుర్తొస్తాయి! కానీ.. మన ఇండియాలోనూ ‘సర్వం ఏఐ’ అనే స్టార్టప్‌ సంస్థ కృత్రిమ మేధ పరిజ్ఞానంతో పనిచేసే కళ్లజోళ్లను రూపొందిస్తోంది! బెంగళూరుకు చెందిన ఆ స్టార్టప్‌ సంస్థ ‘సర్వం కేజ్‌’ పేరిట రూపొందించిన ఏఐ గ్లాసెస్‌.. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో ప్రధాన ఆకర్షణగా మారాయి. ప్రధాని మోదీ మంగళవారం ఆ కళ్లజోడును ధరించి, ఆసక్తిగా దాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ఫొటోను సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రత్యూ్‌షకుమార్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ కళ్లజోడును మొదటిసారి పెట్టుకుని ప్రయత్నించింది ప్రధాని మోదీయేనని పేర్కొన్నారు. దాన్ని డిజైన్‌ చేసింది, తయారుచేసింది భారత్‌లోనే అని.. దాంట్లో ఉన్న కృత్రిమ మేధ కూడా భారత్‌దేనని స్పష్టం చేశారు. ఈ కళ్లజోడు ప్రత్యేకతల విషయానికి వస్తే.. అది ఎదురుగా ఉన్న దృశ్యాలను చూసి అర్థం చేసుకోగలదు. కావాలంటే ఆ దృశ్యాలను రికార్డు కూడా చేయగలదు. మనం అడిగిన ప్రశ్నలు అర్థం చేసుకుని స్పందించి సమాధానమివ్వగలదు. మనం అడిగిన సమాచారాన్ని నెట్‌లో వెతికి చెప్పగలదు. మన ఎదురుగా ఉన్న వస్తువులను లేదా సమాచారాన్ని గుర్తుపట్టి వివరాలు అడిగితే ఇవ్వగలదు. అన్నిటికంటే ముఖ్యంగా.. పలు భారతీయ భాషలను అప్పటికప్పుడే (రియల్‌టైమ్‌లో) మనకు కావాల్సిన భాషలోకి అనువదించగలదు! ఉదాహరణకు.. ఈ కళ్లజోడు ధరించి మనం చెన్నైకో, కోయంబత్తూరుకో వెళ్లామనుకోండి. అక్కడ వాళ్లు మాట్లాడే తమిళ భాషను ఎంచక్కా మన తెలుగులోకి మార్చి వినిపిస్తుంది. మనం దానికి మాటల ద్వారా ఆజ్ఞలు జారీచేయొచ్చు. దీంట్లో చాట్‌ ఫీచర్‌ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. అంటే.. మొబైల్‌లో సర్వం యాప్‌ ద్వారా రాతపూర్వకంగా కూడా ఈ కళ్లజోడుకు మనం కమాండ్స్‌ ఇవ్వొచ్చు. దీనికి ఉన్న అసలైన ప్రత్యేకత ఏంటంటే.. ఈ పనులన్నీ ఇది ఆఫ్‌లైన్‌లో కూడా చేయగలదు. ‘సర్వం ఎడ్జ్‌’ అనే మినీ బ్రెయిన్‌ని ‘సర్వం ఏఐ’ సంస్థ ఈ కళ్లజోడులో అమర్చింది. అది పనిచేయడానికి ఇంటర్‌నెట్‌ అక్కర్లేదు. ‘కేజ్‌’ అంటే జపనీ్‌సలో ‘గాలి’ అని అర్థం. ‘గాలి’లా సర్వాంతర్యామిలా పనిచేస్తుంది కాబట్టే సర్వం ఏఐ సంస్థ ఈ కళ్లజోడుకు ‘సర్వం కేజ్‌’ అనే పేరు పెట్టింది. ఈ కళ్లజోడును మే నెలలో మార్కెట్లోకి తేనున్నట్టు తెలిపింది.


సర్కారు ఏఐ మిషన్‌లో భాగంగానే..

చాట్‌జీపీటీ, జెమినై వంటి ఏఐ మోడళ్లను వాడేటప్పుడు.. మన వివరాలు, మనం వాటిలోకి అప్‌లోడ్‌ చేసే ఫొటోలు.. అన్నీ విదేశీ సర్వర్లలోకి వెళ్తాయి. ఆ ప్రమాదం లేకుండా దేశీయంగా వాటికి దీటుగా కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో 2024లో కేంద్ర ప్రభుత్వం రూ.10,372 కోట్లతో ‘ఇండియన్‌ ఏఐ మిషన్‌’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగానే సర్వం ఏఐ ఈ కళ్లజోడును తయారు చేసింది. ఈ మిషన్‌ కోసం ప్రభుత్వం మన స్టార్ట్‌పల కోసం 38 వేలకుపైగా జీపీయూలను సమకూర్చింది.

25 ఏళ్ల తర్వాత ఉద్యోగాల

అవసరం ఉండదు: వినోద్‌ ఖోస్లా

మరో పాతికేళ్లలో ప్రజలెవరికీ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదని టెక్‌ దిగ్గజం వినోద్‌ ఖోస్లా అంచనా వేశారు. అప్పటికి అన్ని రంగాల్లో ఏఐ వేగంగా దూసుకెళ్తుందని చెప్పారు. మంగళవారం ఆయన ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో మాట్లాడారు. 2050 నాటికి ఉద్యోగాల విషయంలో ఒక స్పష్ఠత వస్తుందని అన్నారు. ఐదేళ్లలో ఐటీ, బీపీవో వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు అదృశ్యం అవుతాయని పునరుద్ఘాటించారు. ఐటీ ఉద్యోగాల మీద ఎక్కువగా ఆధారపడుతున్న భారత్‌ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఒక ఐటీ కంపెనీలో ఎవరైనా 15-20 ఏళ్లుగా పని చేస్తున్నట్లయితే వాళ్లను వెంటనే తీసేయొచ్చని అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సావరిన్‌ ఏఐ మోడల్స్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఖోస్లా చెప్పారు. అందుకే సర్వంలో తాను పెట్టుబడులు పెట్టానన్నారు.

ఇవి కూడా చదవండి..

ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ

మెక్రాన్‌తో ముంబైలో మోదీ భేటీ

Updated Date - Feb 18 , 2026 | 06:35 AM