రోగి గొంతులో జలగ.. అలా జరిగి ఉంటే ప్రాణాలు పోయేవి..
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:12 AM
హిమాచల్ ప్రదేశ్‌లో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. సరిగా ఊపిరి ఆడటం లేదని ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి గొంతులో జలగ ఉన్న సంగతి బయటపడింది. డాక్టర్లు 20 నిమిషాల పాటు ఎంతో కష్టపడి ఆ జలగను బయటకు తీశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: సరిగా ఊపిరి ఆడటం లేదని ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. అతడి గొంతులో జలగ ఉన్న సంగతి బయటపడింది. డాక్టర్లు 20 నిమిషాల పాటు ఎంతో కష్టపడి ఆ జలగను బయటకు తీశారు. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిర్మౌర్ జిల్లా కంగర్ ధర్యార్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల సురేశ్ దత్ గత కొద్దిరోజుల నుంచి గొంతు నొప్పితో బాధపడుతున్నాడు. ఊపిరి తీసుకోవటంలోనూ ఇబ్బంది తలెత్తింది.
స్వరం కూడా మారిపోయింది. దీంతో సోలాన్‌లోని మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ (ఎమ్ఎమ్‌యూ)కి చికిత్స కోసం వెళ్లాడు. అక్కడి డాక్టర్లు లారింగోస్కోపీ చేశారు. సురేశ్ గొంతులో నల్లటి వస్తువు ఏదో కదులుతూ కనిపించింది. సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న డాక్టర్లు షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్‌కు రిఫర్ చేశారు. సురేశ్ అక్కడికి వెళ్లాడు. ఐజీఎమ్‌సీలోని ఈఎన్‌టీ డాక్టర్లు సురేశ్ గొంతును పరీక్షించి అక్కడ జలగ ఉన్నట్లు గుర్తించారు. ఆ జలగ శ్వాసనాళానికి అతి దగ్గరగా ఉండటంతో వెంటనే సర్జరీ చేయడానికి ఉపక్రమించారు.
దాదాపు 20 నిమిషాల పాటు కష్టపడి జలగను గొంతు నుంచి ప్రాణాలతో బయటకు తీశారు. అనంతరం డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ జలగ ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండి ఉంటే ప్రాణాలు పోయేవి. 20 నిమిషాల పాటు సర్జరీ చేసి జలగను ప్రాణాలతో గొంతునుంచి బయటకు తీశాము. సర్జరీ సమయంలో జలగ తప్పించుకుని లోపలికి వెళ్లిపోయి ఉంటే ఊపిరి తీసుకోవటానికి తీవ్ర ఆటంకం ఏర్పడి ఉండేది. ఒక వేళ జలగ ముక్కలు అయి ఉంటే ఇన్‌ఫెక్షన్స్ వచ్చి ఉండేవి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్