కూలిన వాయుసేన విమానం
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:52 AM
అస్సాంలోని జోర్హాట్‌లో ఉన్న వైమానిక స్థావరంలో ల్యాండ్ అవుతున్న సమయంలో వాయుసేనకు చెందిన ఏఎన్-32 రవాణా విమానం శనివారం ప్రమాదానికి గురైంది.
అస్సాంలోని జోర్హాట్‌లో ప్రమాదం
ఐదుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మృతి
న్యూఢిల్లీ, జూన్ 13: అస్సాంలోని జోర్హాట్‌లో ఉన్న వైమానిక స్థావరంలో ల్యాండ్ అవుతున్న సమయంలో వాయుసేనకు చెందిన ఏఎన్-32 రవాణా విమానం శనివారం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు సిబ్బంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఇద్దరు అధికారులు కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ కో-పైలెట్‌కు స్థానిక మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఈ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. జోర్హాట్‌లోని రౌరీ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దైనందిన విధుల్లో ఉన్నప్పుడు ఉదయం 10 గంటల సమయంలో ప్రమాదం సంభవించిందని భారత వాయుసేన తెలిపింది. చనిపోయిన వారిలో స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ (వాయు) ఖేమారామ్ కుమావత్, అగ్నివీర్ (వాయు) దానిష్ ఆలం ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలను కనుగొనేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. విమానం రన్‌వేపై దిగుతున్న సమయంలో నియంత్రణ కోల్పోయి రన్‌వే నుంచి పక్కకి జారిపోయిందని అక్కడి సిబ్బంది చెప్పారు. టాక్సీవే మీదుగా దూసుకెళ్లి రెండు ముక్కలైందని, తర్వాత మంటలు చెలరేగాయని తెలిపారు. అయితే విమాన ప్రమాదంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయని ది వీక్ పత్రిక తన కథనంలో పేర్కొంది. టాక్సీయింగ్ చేస్తున్న సమయంలో శక్తివంతమైన పేలుడు సంభవించిందని, ల్యాండింగ్ సమయంలో పల్టీకొట్టిందని అక్కడి వర్గాలు చెప్పినట్లు తన కథనంలో పేర్కొంది. రష్యా డిజైన్ చేసిన రెండు ఇంజిన్ల టర్బోప్రాప్ ఏన్టనోవ్ (ఏఎన్)32 రవాణా విమానాలు దశాబ్దాలు తరబడి ఐఏఎ్‌ఫలో సేవలందిస్తున్నాయి. సంక్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలకు సిబ్బందిని తీసుకెళ్లడానికి, కీలకమైన సామగ్రిని మోసుకెళ్లడానికి ఈ విమానాలను వినియోగిస్తున్నారు. వీటిని పలుమార్లు అప్‌గ్రేడ్ చేశారు. కాగా, పాతపడిన వీటి స్థానంలో మధ్యస్థస్థాయి రవాణా విమానాల(ఎంటీఏ) కొనుగోలుకు 2022లో సమాచార అభ్యర్థన(ఆర్‌ఎఫ్ఐ) జారీ చేసింది.
