Share News

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్ సిలిండర్‌లు.. దేశంలో తొలిసారిగా..

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:35 PM

పది నిమిషాల్లో గ్యాస్ సిలిండర్లను ఇంటికి సరఫరా చేసేలా క్విక్ కామర్స్ సంస్థ ఇన్‌స్టామార్ట్‌తో హెచ్‌పీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు కోసం ప్రత్యేకమైన నవ్య సిలిండర్‌లను ఆవిష్కరించింది. త్వరలో ఈ సేవలు బెంగళూరులో ప్రారంభం కానున్నాయి.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్ సిలిండర్‌లు.. దేశంలో తొలిసారిగా..
HP Navya Gas Cylinders on Instamart

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్ ఉన్న వారు రీఫిల్‌ను బుక్ చేసుకున్న రెండు మూడు రోజులకు సిలిండర్ డెలివరీ అవుతోంది. అయితే, ఈ మాత్రం జాప్యం కూడా లేకుండా క్విక్ కామర్స్ ద్వారా 10 నిమిషాల్లోనే సిలిండర్లను ఇంటికి చేరవేసే కొత్త విధానం త్వరలో బెంగళూరు వాసులకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ వేదిక ఇన్‌స్టామార్ట్‌తో హెచ్‌పీసీఎల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం, హెచ్‌పీసీఎల్‌కు చెందిన 10 కేజీల నవ్య సిలిండర్లు బుక్ చేసుకున్న పది నిమిషాల్లోనే కస్టమర్ల ఇంటికి చేరుకుంటాయి. గ్యాస్ కనెక్షన్ లేని వారు, చిన్న కుటుంబాలు, విద్యార్థులకు అనువుగా హెచ్‌పీసీఎల్ సంస్థ నవ్య గ్యాస్ సిలిండర్‌లను రూపొందించింది. సాధారణ స్టీల్ సిలిండర్‌ల కంటే భిన్నమైన కాంపోజిట్ పాలిమర్‌తో నవ్య సిలిండర్‌లను తయారు చేశారు. పాక్షిక పారదర్శకంగా ఉండే ఈ సిలిండర్‌లల్లో గ్యాస్ నిల్వలు ఎంత ఉన్నాయో చూస్తే తెలిసిపోతుంది. అంతేకాకుండా, సాధారణ స్టీల్ సిలిండర్‌ల కంటే ఇవి 50 శాతం బరువు తక్కువగా ఉంటాయి.


క్విక్ కామర్స్‌లో బుక్ చేసుకున్నప్పటికీ ఈ సిలిండర్‌లను సాధారణ గ్యాస్ ఏజెన్సీల ద్వారానే డెలివరీ చేయనున్నారు. ఏజెన్సీలకు చెందిన నిపుణులైన సిబ్బంది వీటిని కస్టమర్లకు డెలివరీ చేస్తారని హెచ్‌పీసీఎల్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి సారి బుక్ చేసుకునే వారి వద్ద నుంచి అన్ని రకరాల ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నాక సిలిండర్ కేటాయింపు ఉంటుందని సంస్థ పేర్కొంది. ఆ తరువాత బుక్ చేసుకునే వాటిని రీఫిల్‌గా పరిగణిస్తామని తెలిపింది. రీఫిల్ డెలివరీ తీసుకునే సమయంలో ఖాళీ నవ్య సిలిండర్‌ను కస్టమర్లు తిరిగిచ్చేయాల్సి ఉంటుంది. ఎల్‌పీజీ సిలిండర్‌లను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సేవను తీసుకొచ్చామని హెచ్‌పీసీఎల్ మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ అమిత్ గర్గ్ తెలిపారు. అయితే, ఇతర నగరాలకు ఈ సేవలను ఎప్పుడు విస్తరిస్తారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.


ఈ వార్తలనూ చదవండి:

రూ.2.19 లక్షల కోట్ల విలువైన 7 కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. రెబల్ తృణమూల్ వర్గంలో చేరిన మదన్ మిత్ర

Updated Date - Jul 15 , 2026 | 05:57 PM