కూలిన హాస్టల్ భవనం
ABN , Publish Date - Sep 07 , 2026 | 05:36 AM
: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ ఐదంతస్తుల హాస్టల్ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 30 నుంచి 50 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఢిల్లీలో కుప్పకూలిన 50 ఏళ్ల నాటి ఐదంతస్తుల బిల్డింగ్
ముగ్గురి మృతి, ఐదుగురి పరిస్థితి విషమం
శిథిలాల కింద 30-50 మంది విద్యార్థులు
కాపాడాలంటూ ఆర్తనాదాలు
రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్ పారామిలిటరీ
భవనం బేస్‌మెంట్‌లో మరమ్మతు పనులు,
ఎడతెరపి లేని వర్షాలే కారణం?
భవనాల నిర్వహణపై స్థానికుల ఆగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ ఐదంతస్తుల హాస్టల్ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 30 నుంచి 50 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కొందరు విద్యార్థులు శిథిలాల మధ్య నుంచే తమను కాపాడాలని కేకలు వేస్తుండటం స్థానికులనుభయాందోళనలకు గురిచేసింది. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సాయి నికేతన్ ప్రాంతంలోని బాలుర హాస్టల్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రమాదం జరిగిందని, ఒక్కసారిగా కూలిపోవడంతో పెద్ద శబ్దం వచ్చి భూకంపం వచ్చినట్లుగా ప్రకంపనలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్‌ఢీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి 8 మందిని సురక్షితంగా బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించిన వారిలో ముగ్గురు మృతి చెందగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇరుకైన వీధులు, జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో అంబులెన్సులు, వాహనాల రాకపోకలు క్రమబద్దీకరించేందుకు పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. కాగా, సుమారు 50 ఏళ్లనాటి ఈ పురాతన భవనాన్ని విద్యార్థుల కోసం వసతి గృహంగా(పీజీ హాస్టల్) ఉపయోగిస్తున్నారు. కాలేజీ, యూనివర్సిటీలకు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతమంతా పీజీ హాస్టళ్లతో నిండిపోయింది. కేరళం, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ నివాసముంటున్నారు.
ఆదివారం సెలవుదినం కావడంతో కొంతమంది విద్యార్థులు ఊళ్లకు వెళ్లిపోగా, ఎక్కువమంది విద్యార్థులు గదుల్లోనే ఉన్నట్లు సమాచారం. భవనంలో బేస్‌మెంట్ మరమ్మతు పనులు జరుగుతుండటం, శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలతో నీరు చేరి పునాదుల బలహీనపడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. భవన యజమానిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో పీజీ భవనాల నిర్వహణ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 70 శాతం భవన యజమానులు తమ నివాస గృహాలను పీజీ హాస్టళ్లుగా మార్చేస్తూ.. ఇక్కడి నుంచి వెళ్లిపోయి, ఆన్‌లైన్ అద్దెలు వసూలు చేస్తూ భవన నిర్వహణను గాలికొదిలేశారని వాపోయారు. బాధ్యులపై ఆధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటన పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు, కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో సరైన వసతుల్లేక విద్యార్థులు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇలాంటి ప్రమాదకరమైన వసతి గృహాల్లో నివసించాల్సి వస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి ప్రాణం చాలా విలువైనదని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారిని రక్షించాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల దుస్థితిని విస్మరించి, ప్రధాని మోదీ రాజకీయ ప్రసంగాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు పూర్తి వైద్యసదుపాయాలు అందిస్తామని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ప్రహ్లద్ జోషి భరోసానిచ్చారు.
యూపీలో కుండపోత, ఇళ్లు కూలి ఆరుగురి బలి!
ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇళ్లు, మట్టి గోడ లు కూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్‌లో కుండపోత వర్షానికి ఓ మట్టి ఇల్లు కూలిపోగా, ఈ ప్రమాదంలో ముఖేష్ అనే వ్యక్తితో పాటు అతని ముగ్గురు కుమార్తెలు మరణించారు. బుధౌన్ జిల్లాలో ఇంటి గోడ కూలి వినోద్ అనే రైతు మృతి చెందగా, బలియా జిల్లాలో ఆరేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.