IAS Officer Arrest: అవినీతి ఆరోపణలు.. గుజరాత్ ఐఏఎస్ అధికారి అరెస్ట్
ABN , Publish Date - Jan 03 , 2026 | 10:23 AM
అవినీతి ఆరోపణలు, నగదు అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న గుజరాత్ ఐఏఎస్ అధికారికి ఈడీ తాజాగా అరెస్టు చేసింది. పీఎమ్ఎల్ఏ కోర్టు ఆయనకు జనవరి 7 వరకూ ఈడీ రిమాండ్‌ను విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గుజరాత్ ఐఏఎస్ ఆఫీసర్ రాజేంద్రకుమార్ పటేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయనకు అహ్మదాబాద్‌లోని పీఎమ్ఎల్‌ఏ కోర్టు జనవరి 7 వరకూ ఈడీ రిమాండ్‌ను విధించింది.
భూఅనుమతుల జారీకి లంచాలు తీసుకోవడం, నగదు అక్రమ రవాణా ఆరోపణలతో రాజేంద్రకుమార్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే అనుమతులు ఇచ్చేందుకు రాజేంద్రకుమార్ లంచాలు తీసుకున్నారని ఆరోపించింది. లంచాల్లో 50 శాతం ఐఏఎస్ అధికారికి, మిగతా 50 శాతం ఇతర అధికారులకు వెళ్లేదని పేర్కొంది. రాజేంద్రకుమార్ తరపున ఆయన పీఏ స్వయంగా లంచాలను తీసుకునే వారని నిందితుల్లో ఒకరు చెప్పారని కూడా ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ కేసులో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు 10 రోజుల పాటు రాజేంద్రకుమార్ కస్టడీని తమకు అప్పగించాలని కోరింది. భూఅనుమతులకు సంబంధించి ఇప్పటివరకూ సుమారు 800 అప్లికేషన్లను గుర్తించామని, వీటి కోసం ఐఏఎస్ అధికారి సుమారు రూ.10 కోట్ల మేర లంచం తీసుకున్నట్టు ఆరోపించింది. అయితే, కోర్టు జనవరి 7 వరకూ మాత్రమే ఈడీ రిమాండ్‌కు అనుమతించింది.
2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ రాజేంద్రకుమార్.. సురేంద్రనగర్ కలెక్టర్‌గా పనిచేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే బదిలీ వేటు పడింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఈడీ గతేడాది డిసెంబర్ 23న డిప్యుటీ కలెక్టర్ చంద్రసిన్హ్ భూపత్‌సింగ్ మోరీని కూడా అరెస్టు చేసింది. ఆయన ఇంటి నుంచి రూ.67.5 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. అది లంచంగా తీసుకున్న డబ్బేనని నిందితుడు అంగీకరించాడని తెలిపింది. కొంత మొత్తాన్ని తాను స్వయంగా, మరికొంత మొత్తాన్ని ఇతరుల ద్వారా సేకరించినట్టు మోరీ అంగీకరించాడని తెలిపింది. ఈ క్రమంలో ఈడీ ఫిర్యాదు మేరకు గుజరాత్ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ క్రమంలోనే రాజేంద్రకుమార్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది.
ఇవీ చదవండి:
యూఎస్‌లో భారీ ఉగ్రదాడికి టీనేజర్ యత్నం.. భగ్నం చేసిన ఎఫ్‌బీఐ
ఆందోళనకారులను చంపుతుంటే చూస్తూ ఊరుకోబోం.. ట్రంప్ హెచ్చరిక