Share News

అగ్నివీర్‌ల సర్వీస్‌ రెండేళ్లు పెంపు

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:19 AM

భారత రక్షణ దళాల్లో అమలవుతున్న అగ్నిపథ్‌ పథకంలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

అగ్నివీర్‌ల సర్వీస్‌   రెండేళ్లు పెంపు
agniveers

  • నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచే యోచన

న్యూఢిల్లీ, నవంబరు 3: భారత రక్షణ దళాల్లో అమలవుతున్న అగ్నిపథ్‌ పథకంలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది..! 2022లో ప్రారంభమైన ఈ పథకం కింద ఎంపికైన అగ్నివీర్‌ల సర్వీస్‌ కాలాన్ని పెంచనుంది. అగ్నివీర్‌ల ప్రస్తుత 4 ఏళ్ల సర్వీస్‌ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించి మొత్తం 6 సంవత్సరాలు చేయాలని యోచిస్తోంది. సర్వీస్‌ కాలాన్ని పొడిగించడమే కాకుండా.. త్రివిధ దళాల్లో కొనసాగించాల్సిన అగ్నివీర్‌ల సంఖ్యను కూడా పెంచడానికి ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిబంధలన ప్రకారం అగ్నివీర్‌లుగా ఎంపికైన వారిలో నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందిని మాత్రమే శాశ్వత కేడర్‌లోకి తీసుకుంటారు. అయితే త్రివిధ దళాలు ఈ పరిమితిని భారీగా పెంచాలని ప్రతిపాదించాయి. వీటికి సంబంధించిన అధికారిక నిర్ణయాన్ని ఈ నెల 21 లోపు ప్రకటించే అవకాశం ఉందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఆర్మీ, వైమానిక దళాలు ఈ పరిమితిని 25 నుంచి 50 శాతానికి పెంచాలని కోరుతుండగా, నేవీలో సాంకేతిక నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం ఎక్కువగా ఉండడంతో 70ు-75ు మంది అగ్నివీర్‌లను శాశ్వతంగా కొనసాగించాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. నౌకాదళ అగ్నివీర్‌ల మొదటి బ్యాచ్‌ పదవీ కాలం నవంబరు 21న, వైమానిక దళ అగ్నివీర్‌ల మొదటి బ్యాచ్‌ పదవీకాలం డిసెంబరు 21తో, సైన్యం మొదటి బ్యాచ్‌ పదవీకాలం డిసెంబరు 31తో ముగియనుంది. కాబట్టి ఈ లోపే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నాలుగేళ్ల కిత్రం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో మొదటి విడతలో 24,400మంది అగ్నివీర్‌లు చేరారు. ఈ పథకం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ నాలుగేళ్లలో సైన్యంలో సుమారు 2,70,000మంది, వాయుసేనలో 27,000 మంది, నేవీలో 21,000 మంది అగ్నివీర్‌లుగా నియమితులయ్యారు.

Updated Date - Nov 04 , 2026 | 04:40 AM