గుల్షన్‌గా మారిన గోపాల్!
ABN , Publish Date - Apr 18 , 2026 | 06:49 AM
టీసీఎస్ నాసిక్ విభాగంలో జరిగిన లైంగిక వేధింపులు, మత మార్పిడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గోపాల్(పేరు మార్చారు) అనే వ్యక్తి గుల్షన్‌గా మారిన వైనం.. దీనివెనుక...
మతం మారితే తండ్రికి వచ్చిన పక్షవాతం పోతుందన్నారు!
ముస్లింగా మారాలని ఒత్తిడి చేశారు!
‘టీసీఎస్ నాసిక్’ కేసులో బాధితుడి గోడు
లైంగిక వేధింపులు కామన్: హెచ్‌ఆర్
ఏ ఒక్కరినీ వదలం: సీఎం ఫడణవీస్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: టీసీఎస్ నాసిక్ విభాగంలో జరిగిన లైంగిక వేధింపులు, మత మార్పిడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గోపాల్(పేరు మార్చారు) అనే వ్యక్తి గుల్షన్‌గా మారిన వైనం.. దీనివెనుక జరిగిన వ్యవహారాన్ని అధికారులు వెల్లడించారు. బాధితుడు.. గోపాల్‌ను రెండేళ్ల కిందటి నుంచే టార్గెట్ చేసుకున్నట్టు తెలిపారు. మతం మారితే తన తండ్రికి వచ్చిన పక్షవాతం పోతుందని నమ్మబలికారని, వీడియోలు, ప్రసంగాల ద్వారా మతం మారేలా నిందితులు ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. వీరి ప్రభావంతో గోపాల్ తీవ్రంగా ప్రభావితమైనట్టు అధికారులు తెలిపారు. ఈ కేసులో నిందితు తౌసిఫ్ అత్తర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని మొబైల్ ఫోన్‌లో ఫొటోలను పరిశీలించారు. ఈ క్రమంలో తెల్లటోపీ ధరించిన మరొకరు అత్తర్ పక్కన నిలబడిన ఫొటో కనిపించింది. అతను కూడా నిందితుడేనని భావించారు. కానీ, అత్తర్‌ను విచారించగా.. తెల్లటోపీ ధరించిన(గోపాల్) వ్యక్తి టీసీఎస్ కంపెనీ ఉద్యోగి అని.. మతం మారాడని వివరించారు. ఈ క్రమంలో గోపాల్‌ను విచారించగా.. అనేక విషయాలు వెలుగు చూశాయి. ‘‘2023లో మా నాన్నకు పక్షవాతం వచ్చింది. ఆ సమయంలో నేను కుంగిపోయాను. దీనిని అవకాశంగా తీసుకున్న కొందరు.. మతమార్పిడికి.. ముస్లిం సంప్రదాయాల ఆచరణకు నాపై ఒత్తిడి తెచ్చారు. మతం మారితే మీ నాన్న పక్షవాతం నయం అవుతుందన్నారు.
అంతేకాదు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఆ సమయంలో మానసిక ఒత్తిడిలో ఉన్న నేను.. ఏం చేయాలో తెలియక.. వారిని అనుసరించాను.’’ అని వివరించాడు. ఈ క్రమంలోనే తనపేరును కూడా మార్చుకోవాలని ఒత్తిడి చేశారని.. తనకు ఇష్టం లేకపోయినా.. వారు చెప్పినట్టు వినాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. తనను వివిధ మత ప్రదేశాలకు తీసుకువెళ్లారని తెలిపాడు. ఇదేసమయంలో తన సొంత మతంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని.. కుటుంబానికి హాని తలపెట్టే ఉద్దేశం ఉందని గ్రహించి వారిని అనుసరించానని వివరించాడు. ఇదిలావుంటే, లైంగిక వేధింపులు, మత మార్పిడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు టీసీఎస్ తెలిపింది. వేధింపులను ఎట్టిపరిస్థితిలోనూ సహించేది లేదని స్పష్టం చేసింది.
ఇలాంటి జరుగుతాయి: హెచ్‌ఆర్
లైంగిక వేధింపుల వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు టీసీఎస్ మానవవనరుల విభాగం హెడ్ అశ్వినీ చైనాని మహిళా ఉద్యోగులకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. పైగా.. ‘ఇలాంటివి సర్వసాధారణం. జరుగుతూ ఉంటాయి. చూసీ చూడనట్టు పోవాలి.’’ అని బాధితులకు చెప్పినట్టు నాసిక్ పోలీసు కమిషనర్ సందీప్ కర్నిక్ చెప్పారు. ఈ కేసులో 9 ఫిర్యాదులు అందాయని విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించామని తెలిపారు.
నేను గర్భవతిని బెయిల్ ఇవ్వండి!
టీసీఎస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్.. కోర్టును ఆశ్రయించారు. తాను గర్భవతినని.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. పిటిషన్ వేశారు. ఈ మేరకు ఆమె తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. లైంగిక వేధింపులు, మత మార్పిడి కేసు వెలుగు చూడగానే నిదా పరారయ్యారు. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
కేంద్ర సంస్థలతో దర్యాప్తు: సీఎం
టీసీఎస్ నాసిక్ విభాగంలో జరిగిన లైంగిక వేధింపులు, మతమార్పిడుల అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది అత్యంత హేయం. దారుణం. ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో లోతైన విచారణ చేయిస్తాం. దీనివెనుక భారీ కుట్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది.’’ అని అన్నారు. ఇదిలావుంటే, ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ‘‘ఇదొక దారుణ కుట్ర. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా.. రాజకీయ జోక్యాన్ని నివారించేలా ఆదేశాలు ఇవ్వాలి.’’ అని పిటిషనర్ కోరారు.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..