ఘాజియాబాద్ టీనేజ్ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 08:27 PM
ఘాజియాబాద్‌లో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ టీనేజ్ అక్కాచెల్లెళ్ల ఉదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమకు కే-పాప్ సంస్కృతే ఇష్టమని వారు డైరీలో రాసుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఘాజియాబాద్‌లో (యూపీ) టీనేజ్ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యల ఉదంతం కలకలం రేపుతోంది. కే-పాప్ కల్చర్ (దక్షిణకొరియా పాప్ సంస్కృతి) ప్రభావానికి బాలికలు ఎక్కువగా లోనుకావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది (K-pop Culture). తమకు కే-పాప్ సంస్కృతే ప్రపంచమని అక్కాచెల్లెళ్లు డైరీలో రాసుకున్నట్టు జాతీయ మీడియా కథనాల్లో వెలువడ్డాయి. ఈ డైరీని పోలీసులు అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. కే-పాప్ పాటలు, వాటిల్లోని యాక్టర్లు, ఆన్‌లైన్ గేమ్స్‌లోకంగా అక్కాచెల్లెళ్లు ఉన్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి (Ghaziabad Incident).
వారి స్మార్ట్ ఫోన్‌ను తండ్రి తీసేసుకోవడాన్ని తట్టుకోలేక బాలికలు బుధవారం తమ అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను నిషికా (16), ప్రాచీ (14), పాఖీగా (12) పోలీసులు గుర్తించారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, కొరియన్ సంస్కృతి, అక్కడి కళాకారుల పాటలు, ఆన్‌లైన్ గేమ్స్‌తో బాలికలు గాఢమైన మానసిక బంధాన్ని పెనవేసుకున్నట్టు స్వయంగా డైరీలో రాసుకున్నారు.
కొరియన్ యాక్టర్లు, ఆ కంటెంట్‌యే ప్రపంచంగా బతుకుతున్న తమను కుటుంబం అర్థం చేసుకోలేకపోయిందని డైరీలో రాసుకున్నారట. కుటుంబం కంటే తమకు కొరియన్ కల్చర్‌యే దగ్గరని కూడా భావించారు. డైరీ ఆసాంతం చదవి తమను అర్థం చేసుకోవాలని కూడా వారు రాసుకున్నట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకూ తన కూతుళ్లు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ గడిపేసేవారని వారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక కొరియన్ గేమ్‌ను తండ్రి ఆడొద్దన్నందుకు మొదలైన వివాదం చివరకు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు దారి తీసినట్టు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ‘కొరియన్ సంస్కృతి మా జీవితం, మమల్ని దాన్నుంచి దూరం చేయలేరు’ అని వారి డైరీలో రాసున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
గత ప్రభుత్వాల కారణంగా భారత్ 6వ స్థానం నుంచి 11కు పడిపోయింది: మోదీ