జనరల్ మెడిసిన్‌కే మొగ్గు!
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:38 AM
నీట్-పీజీ 2026 కౌన్సెలింగ్‌లో జనరల్ మెడిసిన్‌కే అభ్యర్థులు మొగ్గు చూపారు. తొలి 100 ఎంపికలలో రేడియాలజీ కంటే కూడా జనరల్ మెడిసిన్‌లోనే ఎక్కువ మంది చేరేందుకు ఉత్సాహం చూపించారు
నీట్-పీజీ ఎంపికలో అగ్రస్థానం దీనికే
న్యూఢిల్లీ, అక్టోబరు 28: నీట్-పీజీ 2026 కౌన్సెలింగ్‌లో జనరల్ మెడిసిన్‌కే అభ్యర్థులు మొగ్గు చూపారు. తొలి 100 ఎంపికలలో రేడియాలజీ కంటే కూడా జనరల్ మెడిసిన్‌లోనే ఎక్కువ మంది చేరేందుకు ఉత్సాహం చూపించారు. వాస్తవానికి పీజీ కోర్సుల్లో జనరల్ మెడిసిన్, రేడియాలజీకి అభ్యర్థులు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా రేడియాలజీకి గత ఏడాది వరకు పోటీ ఎక్కువగా ఉండేది. అయితే, ఈ దఫా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ చేపట్టిన తొలి దఫా సీట్ల కేటాయింపులో 100 ఎంపికలలో 51 మంది జనరల్ మెడిసిన్‌ను ఎంపిక చేసుకోగా, కేవలం 28 మంది మాత్రమే రేడియాలజీని ఎంపిక చేసుకున్నారు. మూడోస్థానంలో డెర్మటాలజీ(చర్మవ్యాధులు) ఉంది. ఈ విభాగంలో ఆరుగురికి సీట్లు కేటాయించారు. పీడియాట్రిక్, జనరల్ సర్జరీ విభాగాల్లో మూడేసి చొప్పున కేటాయించారు. జనరల్ మెడిసిన్ విభాగం క్లినికల్ సవాళ్లతో కూడి ఉన్నప్పటికీ అభ్యర్థులు దీనికే మొగ్గు చూపుతుండడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం.. సూపర్ స్పెషలైజేషన్‌కు అవకాశం ఉండడంతోపాటు మంచి కెరీర్ సొంతం చేసుకునే చాన్స్ ఉంటుంది. ఇక, రేడియాలజీ విభాగంలో కెరీర్ ప్రారంభ దశలోనే ఆదాయం బాగుంటుందన్న ఆలోచనతో అభ్యర్థులు గతంలో దీనిని ఎంచుకునేవారు. అయితే.. ఈ రెండు విభాగాల్లో జనరల్ మెడిసిన్‌కు ఆదరణ ఎక్కువగా ఉండడంతోపాటు వృత్తి నైపుణ్యం, సంతృప్తి వంటివి కూడా ఎక్కువగా ఉంటున్నాయని అందుకే అభ్యర్థులు దీనికే మొగ్గు చూపుతున్నారని ఎయిమ్స్ ఇంటర్నల్ మెడిసిన్ ప్రొఫెసర్ నీరజ్ నిశ్చల్ తెలిపారు.