Share News

కర్ణాటక సీఎం ఇంటికి అదానీ

ABN , Publish Date - Aug 24 , 2026 | 07:01 AM

బెంగళూరు ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన టన్నెల్‌ రోడ్డు ప్రాజెక్టు తాజా పరిణామాలతో తీవ్ర చర్చనీయాంశమైంది...

కర్ణాటక సీఎం ఇంటికి అదానీ

డీకే శివకుమార్‌తో 20 నిమిషాలు భేటీ

బెంగళూరు, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): బెంగళూరు ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన టన్నెల్‌ రోడ్డు ప్రాజెక్టు తాజా పరిణామాలతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్టుకు అత్యంత తక్కువ బిడ్‌ దాఖలు చేసిన అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ గౌతం అదానీ ఆదివారం కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ నివాసానికి విచ్చేశారు. ఆయనతో సుమారు 20 నిమిషాలు చర్చలు జరిపారు. ముందస్తు షెడ్యూల్‌ లేకున్నా అదానీ ఆకస్మికంగా సదాశివనగర్‌లోని సీఎం నివాసానికి వచ్చి భేటీ కావడం తీవ్ర చర్చకు కారణమైంది. అనంతరం అదానీ బయటకు వచ్చిన వేళ సీఎం వీడ్కోలు పలికే ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి. వీరి భేటీపై ఇటు సీఎం కార్యాలయంగానీ, అటు అదానీ సంస్థగానీ అధికారికంగా ప్రకటించలేదు. బెంగళూరు శివారులోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థను అదానీ సందర్శించారు. ఆ తర్వాత తిరిగి విమానాశ్రయానికి వెళ్లే క్రమంలో సీఎం ఇంటికి వెళ్లి కలిశారని అధికార వర్గాలు తెలిపాయి. హెబ్బాళ్‌ నుంచి సిల్క్‌బోర్డు దాకా 17 కిలోమీటర్ల మేర సొరంగమార్గం నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలవగా.. అదానీ సంస్థ రూ.22,267 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. ఇదే అతి తక్కువ బిడ్‌గా తెలుస్తోంది. కాగా, అదానీ.. డీకేను కలవడం కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బీజేపీ విమర్శించింది. అదానీ బీజేపీ ఏజెంట్‌ అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శిస్తుండగా.. కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం అదానీకి రెడ్‌ కార్పెట్‌ వేస్తోందని అసెంబ్లీలో ప్రతిపక్షనేత అశోక్‌ ఎద్దేవా చేశారు.

Updated Date - Aug 24 , 2026 | 07:01 AM